చెమ్మ : వారాల ఆనంద్
‘పతాక మారింది కానీ పద్ధతి మారలేదు’ ఇది స్వాతంత్ర భారతదేశ స్థితిమీద కాళోజీ మాట “అన్యాయాన్ని ఎదిరించనివాడు, అన్యాయంలో భాగమే” ఇది సమస్త మానవాళి పట్ల కాళోజీ అవగాహన. “నిజం మాట్లాడితే నేటి ప్రపంచంలో నువ్వే నేరస్థుడవుతావు” ఇదీ వర్తమాన సమాజ స్థితి గురించి కాళోజీ చెప్పినమాట. ఆయన “నా గొడవ” అన్నప్పుడు అది ఆయన ఒక్కరి గొడవ కాదు. అది అణగారిన ప్రతిమనిషి గొడవ. తెలంగాణ భాషను సాహిత్యంలో ముందు వరుసలో నిలబెట్టిన అరుదైన ప్రజాకవి కాళోజీ. ఆయన కవిత్వంలో మట్టివాసన, మనిషి చెమటతడి ఉంటుంది. ఆయన రాసిన వ్యంగ్యంలోనూ ద్వేషం కనిపించదు ప్రేమ ధ్వనిస్తుంది. కాళోజీని చదవడం అంటే కేవలం ఒక కవిని చదవడం కాదు మనల్ని మనం ఎదుర్కోవడమే. “అన్నపూర్ణ ఒకచోట/ ఆకలిమంట ఒకచోట/ హంసతూలిక ఒకచోట/ అలసిన దేహాలు ఒకచోట” అన్న మాటలతో సమాజానికి అద్దం పట్టాడు.
దశాబ్దాలుగా తెలంగాణా నేలలోనూ ప్రజల్లోనూ అనేక సాహిత్య, సామాజిక, రాజకీయ ఉద్యమాలు మొలకెత్తి, ఎదిగి చైతన్యాన్ని రగిలించాయి. వాటిల్లో ప్రతి ఉద్యమానికి ఒక స్వరముంది. వేగం. వేడి ఉన్నాయి.ఆ స్వరాల్లో అత్యంతమానవీయమైనది, అత్యంత ప్రజాస్వామ్యమైనది, అత్యంత నిర్భయమైనది కాళోజీ స్వరం. ఆయన కేవలం కవి మాత్రమే కాదు ప్రజల ఊపిరిని అక్షరాలుగా మార్చిన ఒకానొక సాక్షి. బాధను మాత్రమే చూసి కవిత్వం రాసినవాడు కాదు బాధల మధ్యలో, బాధపడుతున్న జనం మధ్యనే జీవించి దాన్ని భాషగా మలిచిన మనిషి. అందుకే కాళోజీ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కవికంటే కూడా ఆర్ద్రత నిండిన మనిషి కన్నీరు కార్చే మనసు కనిపిస్తాయి. ఆయనతో మాట్లాడితే ఆత్మీయత పొంగిపొరలుతుంది.
కాళోజీ నారాయణరావు 1914 సెప్టెంబర్ 9న కర్ణాటకలోని రట్టిహళ్లిలో జన్మించారు. అయితే ఆయన జీవితం మొత్తం తెలంగాణతో మమేకమైంది. వరంగల్, హన్మకొండ ప్రాంతాలే లోపల ఆలోచనలకు పునాది వేశాయి. చిన్ననాటి నుంచే భాషలపై ఆసక్తి పెంచుకున్న కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, ఆంగ్లభాషలలో ప్రవేశం సంపాదించారు. ప్రాథమిక విద్యానంతరం హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్ పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజీ లోనూ, హన్మకొండ లోని కాలేజియేట్ ఉన్నత పాఠశాల లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషను పూర్తిచేశాడు. 1939లో హైదరాబాదులో ఉన్నత న్యాయస్థానానికి అనుబంధంగా ఉన్న న్యాయకళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. అప్పుడే సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించాడు. కాళోజీ జన్మించిన అయిదారు నెలలకే తల్లి రమాబాయమ్మ చనిపోవడంతో అతని అన్న కాళోజీ రామేశ్వరరావు అమ్మగా మారి తమ్ముడు కాళోజిని పెంచి పెద్దచేశాడు. కాళోజీ రామేశ్వరరావు మంచి ఉర్దూ కవి.‘షాద్’ పేరుతో ఉర్దూ కవిత్వం రాశాడు.1996 లో రామేశ్వరరావు చనిపోయినప్పుడు‘నేను నా ఆరవయేట మా అన్న భుజాల మీదికెక్కినాను. అతను మరణించేదాకా దిగలేదు. నేను అతను భుజాల మీదికి ఎక్కడం గొప్పకాదు. 70 ఏళ్లవరకూ అతను నన్ను దించకుండా ఉండడం గొప్ప.’ అన్నాడు కాళోజీ. 1940లో రుక్మిణీబాయితో వివాహం జరిగింది. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పి.వి. నరసింహారావు వంటివారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. 1953 లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.1958 లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ “సామాన్యుడే నా దేవుడు” అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 న తుదిశ్వాస విడిచాడు. మరణానంతరం అతని పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేసారు
కాళోజీ జీవితాన్ని కేవలం ఆయన సాహిత్యంతో మాత్రమే అర్థం చేసుకోలేం. ఆయనకు జీవితం అంటేనే ఉద్యమం. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సమస్యలపై, పౌరహక్కుల కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన జీవితాంతం పోరాడారు. ఎక్కడయినా ఎప్పుడయినా అధికారాన్ని ప్రశ్నించడం ఆయనకు అలవాటు కాదు, అది ఆయన స్వభావం. అందుకే ఆయన కవిత్వంలో రాజకీయం సహజంగా ప్రవహిస్తుంది. కానీ అది శుష్క రాజకీయపార్టీలు చేసే రాజకీయం కాదు, మనిషి స్వేచ్ఛ కోసం చేసే ఆర్తనాదం.
తెలుగు కవిత్వంలో కాళోజీ రచనది విభిన్నధోరణి. ఎప్పుడూ అలంకారాల కోసం పరుగులు తీయలేదు. పదాల ప్రదర్శన చేయలేదు. ప్రజలు మాట్లాడే భాషలోది. అది పుస్తక భాషలా అసలే అనిపించదు పక్కింటి మనిషి మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. పెదనాన్నో, తాతో భుజంమీద చేయేసి వెంట నడిపిస్తున్నట్టు ఉంటుంది. ఆయన కవిత్వం ఒకేమాట చెబుతుంది “మనిషి గురించి మాట్లాడని సాహిత్యం చివరకు నిశ్శబ్దమైపోతుంది”. తన రచనల్లో సంభాషణల్లో తెలంగాణ యాసకు అమిత గౌరవం ఇచ్చాడు. ఆయన వ్యంగ్యంలో మానవత్వం, రాజకీయ చైతన్యం ,ప్రజల బాధల పట్ల స్పందన, సరళమైన పదాల్లో లోతైనభావం ఇమిడి వున్నాయి. “అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి” అన్న ఆయన రాసిన ప్రసిద్ధ కవితా సంపుటి “నా గొడవ” తెలుగుసాహిత్యంలో మైలురాయి. ఆ “గొడవ” వ్యక్తిగతం కాదు. సమాజంతో గొడవ, అన్యాయంతో గొడవ, అసత్యంతో గొడవ. ఆ గొడవలో కోపం ఉంది, కానీ ద్వేషం కనిపించదు. వ్యంగ్యం ఉంది, కానీ ఎప్పుడూ మానవత్వాన్ని కోల్పోలేదు. ఆయన రచనల్లో నా గొడవ’ కవితా సంకలనంతో పాటు కొన్నెదులు, వ్రాసిన చరిత్ర హాస్య వంగ్మయం, జ్ఞాపకాల జలపాతం, వర్తమానం, కాళోజీ కథలు తదితరాలున్నాయి. ఇంకా నిజాం నిరంకుశ పాలనపై రాసిన అనేక పద్యాలు, కవితలు తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని నింపాయి. కాళోజీ జీవితం ఒకకవి జీవితం మాత్రమే కాదు; అది ప్రజల కోసం అక్షరాలతో సాగించిన నిరంతర పోరాటగాథ.