ఇది వివేక్ మాయ!

-నిర్వాణ

లంకమల దారుల్లో- ఎంత బాగుందో ఈ బుక్. మొదటి నుండి ప్రకృతి అంటే ఇష్టం వల్ల నేను ఈ పుస్తకానికి చాలా తొందరగా కనెక్ట్ అయ్యాను. ఇప్పటికి రెండుసార్లు చదివాను. మొదటిసారి చదివినప్పుడు కలిగిన అనుభూతి కంటే, రెండోసారి చదివినప్పుడు కలిగిన అనుభూతి వేరు, అదేందో తిరుపతిలో వెంకన్నను చూసినంతసేపు కళ్ళలో ఉంటాడు, కొండ దిగి వస్తామో లేదో మాయమైతాడు అది విష్ణుమాయ! అట్లే ఈ పుస్తకం కూడా. చదివినంత సేపు ఆ కొండలు వాగులు రస్తలు దారులు కళ్ళముందు మెదుల్తాయి. మూసేస్తే ఏమీ గుర్తుండదు. ఇది వివేక్ మాయ! అందుకే ఈ ఆసక్తి రెండోసారి చదివేంత ఇష్టం ఏర్పడింది.

“ఈరోజు మూడ్ బాలేదు ఎక్కడికైనా వెళ్దామా? అని నోబిత అడగడం ఆలస్యం, డోరేమన్ ఎనీవేర్ డోర్ ఓపెన్ చేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు.” మొట్టమొదటిసారి చదవగానే ఇదే గుర్తొచ్చింది. మీకు నవ్వొచ్చిన ఇదే నిజం. ఇంతకుముందు చదివిందే అయినా మళ్ళీ కొత్తగా పరిచయమైనట్లు, తప్పిపోయిన దారుల్ని వెతుకుతున్నట్లు ఉంది. తనపేరులోని ఇంటిపేరును తీసివేసి ఒక అడవి పేరును ఇంటిపేరుగా మార్చుకొని, ఆ పేరుకి సార్థకత తీసుకొచ్చారు. ప్రతి ప్రయాణంలో ఉత్సాహం, ఏదో కనిపిస్తుందనే తపన, ఎలాగైనా వెళ్లాలానే మొండిధైర్యం, అన్నా, న్నో అనే పలకరింపుల్లో ఆప్యాయత కనిపిస్తుంది. అసలు కాలుకి అంత గాయమైన పున్నమిలో మల్లెంకొండను చూడాలన్న ఇష్టం ముందు శరీర గాయాలు కనిపించలేదా? మానసికంగా సిద్దమైపోయి ఉంటాడు రచయిత. ఇంక గాయలేం చేస్తాయి. ఒంటరిగా ఉండటమే ఒకెత్తు అయితే ఒంటరిగా అడవిలో ఎలా వెళ్ళారో! అన్ని భయాలు, ఆలోచనల మధ్య. బహుశా వీడు మావాడే అనుకోని ఉంటది అడవి కూడా.

మనిషి సంఘజివి. తనని పట్టించుకోకుండా మర్చిపోతే తన చుట్టూ పదిమంది ఉన్నా, చూడకపోతే పలకరించకపోతే తన మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది? కొంతకాలం గడిస్తే తను అడవిలో మోడుబారిన చెట్టులా మూగబోతాడేమో. మనిషికి తోడు ఒకరుంటే చాలేమో బ్రతికున్నానని. బాధకు సాంత్వనకు మధ్య ప్రయాణం “గమ్యాన్ని చేరుకోలేకపొయామనే దిగులు అవసరం లేదు, ప్రయాణం చేయ్. ఎక్కడో ఒకచోట నీకు నువ్వు పరిచయం అవుతావు” అని చదివిన ప్రతిసారి నాలో నేను ప్రయాణం చేశాను. నాకు తెలియని నేను పరిచయం అయ్యాను.

ప్రకృతి చూపించిన ప్రతిదానిలో కొత్త విషయం నేర్చుకోవడం, ఆలోచించే విధానం, ముఖ్యంగా అర్థం చేసుకునే విధానం నేర్పించారు. ఉదాహరణకు వెళ్లినవాడు ఊరికే ఉండకుండా #NOPLASTICLANKAMALA ద్వారా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలనుకోవడం చిన్న విషయం కాదు, మాటలు చెప్పేవాడు కాదు చెప్పకుండా ఆచరణలో పెట్టేవాడు వివేక్ లంకమల అని నిరూపించారు. రచయితలకు, కవులకు ప్రకృతిని మించిన వస్తువు లేదంటారు. ప్రకృతిలో ప్రతి భాగము అర్థవంతమైనేదే. కానీ, ప్రతిపువ్వునీ, ఆకుని వర్ణించడం, ఎండిన ఆకుల్ని, అమావాస్య అందాన్ని సైతం వదలకుండా అర్థం చేసుకోవడం పాఠకులను ఆకట్టుకుంటుంది.

ప్రతి కొండకు కథ ఉంటుంది/ ప్రతి కోటకు చరిత్ర ఉంటుంది/ ప్రతి చెట్టుకు ఆశ ఉంటుంది/ ప్రతి నదికి గమ్యం ఉంటుంది/ అన్నీ తెలుసుకోవాలని కాదు, మనిషి ఉన్న లేకున్నా వాటి ఉనికి మాత్రం నిజం. సదురు బండ, బిలం, మల్లెంకొండ, గరుడాద్రి, జ్యోతిక్షేత్రం, లంకమల, సిద్దవటం, నల్లమల, గండికోట ఇవన్నీ ఒకవైపు. వలస జీవితాలు, యానాదులు,  చెయ్యేరు వరదల్లో కొట్టుకుపోయిన జీవితాలు, వాస్తవాలు, ప్రజల్లో భయాలు, బాధలు, వాళ్ల చుట్టూ అల్లుకున్న రాజకీయాలు మరోవైపు. వీటిని అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయాణమే ఈ లంకమల దారుల్లో. అర్థంచేసుకోవడం వరకే సరిపెట్టుకోలేదు ఒక ప్రళయం తర్వాత జరిగే పరిణామాలను కూడా అవగాహన చేసుకొన్నారు. ప్రకృతి తనంతట తాను తిరిగి జీవం పోసుకోగలదు కానీ మనిషి జీవనం అలాకాదు. ఉన్న ఇల్లు, గొడ్డు జీవనదారం పోతే మళ్ళీ పునర్నిమించుకోడానికి సమయం పడుతుంది.

“మదిలో మెదిలో ఆశకు/ తగిన శ్రమ శక్తి ఒంట్లో ఉంటేనే విలువ/ లేదంటే నిర్ధాక్షిణ్యంగా కాలం తనలో కలిపేసుకుంటుంది” వర్షాకాలపు రోడ్లను, శీతకాలపు అందాల్ని వసంతాలను జలపాతాలను మండే ఎండల్ని ఎండమావులని ఎండకు రేగిన దుమ్ముని అమావాస్యలు పున్నాలు చెట్టుని జంతువుల్ని ప్రతిదీ అందమే, ప్రతిదీ భాగమే ప్రకృతిలో, ఈ అక్షరాల్లో. కొందరు పుస్తకం చదివితేనో, మూవీ చూస్తేనో రిలాక్స్ అవుతారు. అలా వివేక్ కి అడవులను చూస్తే. ఒక చెట్టును చూసినా ఆనందపడిపోతాడు. చేసిన ప్రయాణాలన్ని గొప్పవి కావాలని లేదు అనుభూతిని సంపాదించే ఏ ప్రయాణమైన గొప్పదే. అది లంకమల కావొచ్చు, తిరుమల కావొచ్చు, చిన్న కాలినడక కావొచ్చు అనుభూతి గొప్పది. సినిమాలో బ్రహ్మానందo చెప్పినట్లు అనుభవాలే కథలు. ఆ కథల్లో పుట్టిందే లంకమల దారుల్లో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *