జ్ఞాపకాల నెమలీక….

సుద్దాల అశోక్‌ ‌తేజ, పెండెం సత్యనారాయణ, శ్రీరామోజు హరగోపాల్‌, ‌సుభాష్‌, ‌సుధాకర్‌, ‌జయంత్‌ అన్న పేర్లున్న ఆరుగురు స్నేహితులు… ఈ ఆరుగురి స్నేహాను బంధం గత యాభై సంవత్సరాలుగా సతత హరితమై సాగుతూ వస్తున్నది. అశోక్‌ ‌తేజ ప్రఖ్యాత సినీగేయకవిగా, హరగోపాల్‌ ‌కాళోజీ సాహిత్య పురస్కార గ్రహీతగా, కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధకులుగా లబ్ధ ప్రతిష్టులయ్యారు. స్నేహితులలో ఒకరైన అశోక్‌ అప్పటినుండే కభీ కభీ మేరె దిల్‌ ‌మే అంటూ శ్రావ్యంగా పాటలు పాడుతూ ఉండేవారు. ఈ స్నేహితులంతా తరచూ ఆలేరులోని హరగోపాల్‌ ఇం‌టికి వచ్చి వెళ్తూ ఒకరు పాటతో, మరొకరు కవితతో, ఇంకొకరు ముచ్చటతో త్రివేణి సంగమమై ఆత్మీయతానందాలకు ప్రతిబింబాలయ్యేవారు. ఆలేరు పెద్దవాగులో వెన్నెలలో ఇసుక తిన్నెల పై కూర్చుని అశోక్‌ ‌తేజ ట్యూన్లు ఇస్తుంటే హరగోపాల్‌ అప్పటికప్పుడు పాటలు కడుతుండేవారు.

ట్యూన్లు చెప్పిన అశోక్‌ ‌తేజ సినీ కవిగా స్థిరపడగా, హరగోపాల్‌ ఉపాధ్యాయునిగా పనిచేసి పదవీ విరమణ పొంది ఇప్పుడు కొత్త తెలంగాణ చరిత్రను అన్వేషిస్తూ చరిత్ర పరిశోధకుడిగా సేవలందిస్తున్నారు. అమ్మ యాది ఫౌండేషన్‌ ‌పేరుతో సంస్థను స్థాపించి కవులు, కళాకారులను ప్రోత్సహిస్తూ, అవార్డులు ఇస్తూ, పుస్తకాలను ప్రచురిస్తూ విశ్రాంత ఉపాధ్యాయులైన సత్యనారాయణ హితోధిక కళా, సాహిత్య సేవలు అందిస్తున్నారు. హైదరాబాదులో ఇరుకు అద్దె గదిలో ఉంటూ చదువులను కొనసాగించిన జ్ఞాపకాలు ఎన్నెన్నో ఈ మిత్రుల మదిలో ఈనాటికీ పదిలంగా ఉన్నాయి. జీవన యానంలో దశాబ్దాలు తరలిపోయినా ఆనాడు అంకురించిన ఆ స్నేహం ఈనాటికీ నిత్య నూతనంగా సాగుతూనే ఉంది. తమ స్నేహాను బంధాన్ని ఆ ఆరుగురి స్నేహితులలో ఒకరైన హరగోపాల్‌ ‌దోస్తానా పేరుతో హృదయపు తడిని నింపి మినీ కవితలుగా ఆవిష్కరించారు. ఎంత దూరంలో ఉన్నా యాదికొచ్చి పరుగెత్తుకొచ్చే తండ్లాట, ఎద కత్తుకునే అనిర్వచనీయమైన ప్రేమ స్నేహం మాత్రమేనని ఈ సంపుటిలోని 150 మినీ కవితలు చాటి చెప్పాయి.

చదువులు నెపంగా స్నేహం బాటన ఒకటైన తాము ఇష్టాలు కలిసి దోస్తానీ కట్టినామని మొదటి,రెండు మినీ కవితల్లో తమ స్నేహారంభాన్ని హరగోపాల్‌ ‌స్పష్టంగా చెప్పారు. యాభైయేండ్ల నుండి మాట్లాడుకున్నా, తరాలు గడచినా మనస్సులో నిండుగా నిండిన ఈ దోస్తాని మధురమోహనమని అభివర్ణించారు. తిరిగిరాని తమ కాలాన్ని ఇప్పుడు ఎవరిస్తారని కాస్త బాధపడుతూనే భవన కవనాలు కొత్తగా కట్టుకోవచ్చు, ఆత్మకథలో యాదులు బాగా రాసుకోవచ్చునని చెప్పారు. కాలరేఖ మీద తాము నడిచిన దూరాన్ని కాలిబాటలో కలిసి నడిచిన దూరంతో పోల్చారు. చింత చెట్టు వనగాయల రుచుల గోలను, వాగుల్లో చెలిమి నీళ్ల సద్దిమూట సారాన్ని విప్పి చెప్పారు.

ఆలేరు రైల్వే స్టేషన్‌ ‌లో తిరుగుతూ అక్కడి క్యాంటీన్లో టిఫిన్లు తింటూ ఆనందాలు పంచుకున్న ముచ్చట్లను గుర్తు చేసుకున్నారు. చిన్నచిన్న చేష్టలతోనే మురిసిపోయే అప్పటి మురిపెం ను ఎంతో ఆర్ద్రంగా వివరించారు. స్నేహించుకోవడమే తప్ప ఒకరికి ఒకరు ఇచ్చుకున్నది ఏమీ లేదని చెప్పారు. అడుగుతప్పనితనమే బతుకంతా స్నేహం తమకు ఇచ్చిన సాహసం అని తెలిపారు. కలవడమే, కలసి మనసారా మాట్లాడుకుని ఇంపారా తృప్తితో నవ్వడమే, ముందుకు సాగడమే తమ స్నేహం లోని మూల సూత్రమని చెప్పారు. ప్రతి కలయిక తొలి కలయికలా, ప్రతి వీడ్కోలు ప్రస్తుత వీడ్కోలు లా తాము గడిపామన్నారు. మైత్రి మధుర స్మృతి అన్నారు. నవ్వుకుంటూ, తుల్లుకుంటూ, ఏడ్చుకుంటూ, తుడుచుకుంటూ బాట సారులమై బతుకు బాటలో నడిచి యాభై యేళ్ళ కాలాన్ని గడిపామని చెప్పారు.

పాడే కోయిలకు పాటతోటి దోస్తీ / ఆడే నెమలికి సయ్యాట తోటి దోస్తీ / జాడ తెలియని కాలానికి దోస్తానీ / కూడే మనుషుల మనసులతో దోస్తీ అని తమ దోస్తానీకి ప్రతీకలుగా సృజనాత్మకమైన ఉదాహరణలను చెప్పుకున్నారు. రాతిరి వెన్నెల వెలుగులో పాటలై, సినీవాలి లోపలి మాటల బాటలై మొలకెత్తిన ఆనాటి దోస్తులు కాలక్రమంలో దీవులుగా విడిపోయి ఎక్కడెక్కడో ఉండిపోయిన తీరునూ వేదనతో చెప్పారు. స్నేహమే తోడుంటే భాదెంత, శోక మెంత, వేద నెంత, శోధ నెంత అన్నారు. తరచూ కలుస్తూ బతుకును సం పన్నం చేసిన దో స్తులు మన సుల్లో సొంతమై నిలిచా రని తెలిపారు. పిలుపుల్లో, తల పుల్లో ప్రియమైన దోస్తులు పిలుపులందే దూర ంలో ఉన్నారని యాభైయేండ్ల తరువాత కూడా చెలిమి సోయితో ఆనందపడ్డారు. మనసు దూప తీర్చే నేస్తాల జ్ఞాపకాలను, తాము కూడి ఉన్న వేళలను, కూడుతిన్న వేళలను, వెన్నెలలో మాట్లాడుకుంటూ పంచుకున్న ముచ్చట్లను, తమ సహచర్యం, సహవాసాలను తలచుకున్నారు.

మాట మాట అల్లుకొని,పూట పూట బతుకు తోట నాటుకున్నది స్నేహమని చెప్పారు. చుట్ట మేది కాని బువ్వ పెట్టే దోస్తీ అపురూపమైన అనుబంధమని అన్నారు. ఎవరుండని చోట మజిలైతది స్నేహం అని చెప్పారు. ఎల్లప్పుడూ గుండె చప్పుడు ధ్వనించేది స్నేహం అని నిర్వచించారు. ఖాళీలు లేకుండా బతుకు పుటలో చేవ్రాలు చేసేది స్నేహమే అని అన్నారు. కాలమెంత కఠినమైన ఎదురీదినా అనంతమైన జీవన లయ మధురిమలను కురిపించేది స్నేహమని చెప్పారు. మొదలైన కథలకు చివరికి మిగిలేది , తుది లేని కలయికలకు జెండా వంటిది స్నేహమేనని అన్నారు. బతుకు సంధ్యను కూడా వెలిగించే శిఖరాను బంధమే స్నేహమని చెప్పారు. లోకాన ఎందరున్నా మనసుకు చేరువ దోస్తులే అన్నారు. శూన్యం, ఒంటరితనం రానీయనిది స్నేహమేనని చెప్పారు.

రోజులెన్ని మారినా వెలిగే దీపం వంటిది దోస్తీనే అన్నారు. కాలమెట్ల గడిచినా,తనువు కూలిపోయినా బతుకుతుంది నేస్తమని చెప్పారు . పండుగ లెక్క బతకాలంటే తోడుండాలి దోస్తీ అన్నారు. ఎద నిండిన కైదండ అనుబంధం స్నేహం అని చెప్పారు. దోస్తీ యాది కొస్తే ప్రాణమంతా పులకింతతో జల్లుమంటుందని అన్నారు. మట్ట బెల్లం పెడితే మాట్లాడే దోస్తు / కాకెంగిలీ ఇస్తే కనబడే దోస్తు / దోస్తానీ కొరకెన్ని తిప్పలో చిన్నప్పుడు / కడుపులున్నది దేవి చేతికిస్తే దోస్తు అని చిన్ననాటి స్నేహ మాధుర్యాన్ని గొప్పగా అక్షరీకరించారు. ఆనాడు రోజూ కలిసినా ఒడవని ముచ్చట్లను గురించి చెప్పారు. దోస్తీని జీవిత కాలమంతా నిలుపుకుంటామన్నారు. హృదయంలో రాసుకుని జాగ్రత్తగా దాచుకున్న జ్ఞాపకాల నెమలీక దోస్తీ అని చెప్పారు. రాయబోయే కావ్యానికి ముందుమాట వంటిది స్నేహమని తెలిపారు.

పిడికెడంత గుండెను మనిషంత చేసేది స్నేహమేనని తేల్చారు. వాన కురిస్తే కాగితం పడవలాట, ఎండాకాలం బావుల్లో ఈదులాట, చలికాలం ఆల్వా కాడ అస్సయ్‌ ‌దుల ఆటలాంటి స్వచ్ఛత స్నేహమని చెప్పారు. గాయాలకు లేపనమయ్యే సంజీవని స్నేహమని తెలిపారు. గర్వాలు,ప్రతిష్టలు అహంకారాలు, స్వాతిశయ ప్రదర్శన లేకుండా ఆత్మీయతతో కూడిన ఆలింగనమే స్నేహం అని చెప్పారు. కాలం గడిచే కొద్ది సమృద్ధం అయ్యేది, కాగిన పాల మీద మీగడ వంటిది,మరుపున బడి దాగిపోనిది దోస్తీ అన్నారు. జీవిత గాధలో స్మృతుల ఊయల దోస్తీ అని చెప్పారు. త్వమేవాహం అనే దాకా తోడుండేది దోస్తీ అన్నారు. ఈ విశాల ప్రపంచంలో మనం ఒకటనే బలమే రా స్నేహం అని చెప్పారు. కలల సింగిడిలే దోస్తానీలు అన్నారు. దర్పాలు, దాపరికాలు లేకుండా ప్రేమతోటి బతికేయడమే దోస్తానాలోని అంతరార్థమని చెప్పారు. బతుకు పచ్చదనంగా, మెతుకు వెచ్చదనం లా భరోసానిచ్చేది స్నేహమే అన్నారు. ఎల్లప్పటికీ గుండె తడిపే బతుకు పాట స్నేహమేనని చెప్పారు.

అశోక దోస్తేజం పేరిట అశోక్‌ ‌తేజ ఈ సంపుటిలో రాసిన మాటల్లో నేను సినీ రచయితగా,హరగోపాల్‌ ‌కవి,రచయితగా , సత్యనారాయణ కథారచయితగా, జయంత్‌ ‌గాయకుడిగా, సుభాష్‌ ‌చిత్రకారుడిగా పట్టుదలతో ఎదిగి ప్రజల్లో పేరు సంపాదించాలని 50 ఏళ్ల కింద అనుకొని సాగించిన, సాగిస్తున్న స్నేహానుబంధ ప్రయాణం మాది, మా ఆనాటి సంకల్ప బలం ఇప్పుడు అనుకున్న గుర్తింపుని సాధించి పెట్టిందని చెప్పారు. ఎవరికి ఏ పేరున్నా / కీర్తి శిఖరాలున్నా/ స్నేహం ఎత్తులో/ అందరం ఎదిగిపోయాం అని సుభాషితం రాసిన మరో స్నేహితుడు సుభాష్‌ అన్నారు.

బ్యాంకులో కొత్త నోట్లలా మా స్నేహం నిత్య నూతనంగానే కాలంతో సాగుతోంది అని ఈ ఆరుగురు స్నేహితులంతా స్నేహితులంతా ఈ సంపుటి ముందు ముందు పుటల్లో తమ స్నేహ సౌధానికి నగిషీ లు చెక్కారు. తరచూ కలుసుకునే ఈ స్నేహితులు ఒక వాట్స్అప్‌ ‌గ్రూపును కూడా ఏర్పాటు చేసుకొని అందులో ప్రతినిత్యం తమ భావాలను కవితాత్మకంగా పరస్పరం పంచుకుంటుండడం మరొక విశేషం. అలా హరగోపాల్‌ ‌వాట్సప్‌ ‌వేదికగా రాసిన కవితలే ఇవి. మా కొరకు, మాచేత, మేమే రాసుకున్న ఈ దోస్తానా పద్యాల ప్రేరణతో రేపటి తరం స్నేహ బృందాలు చెలిమి చెలిమెలను తవ్వుకొని స్నేహంపు ఊటలుగా మారాలని ఈ సంపుటి కవిగా హరగోపాల్‌ ఆ ఆరుగురి స్నేహితుల పక్షాన సస్నేహ పూర్వకంగా ఆకాంక్షించారు.
– డా. తిరునగరి శ్రీనివాస్‌
  9441464764

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page