దేశ వ్యాప్తంగా 150 ఆలయాల అభివృద్ధి

యువత  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
వరంగల్ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు

న్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 14 : బిజెపి హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ రెడ్డి ఆధ్వర్యంలో వ‌రంగ‌ల్ లోని భద్రకాళి దేవస్థానంలో అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా కిషన్ రెడ్డికి ఆల‌య పూజారులు పూర్ణకుంభంతో ఘ‌న‌స్వాగతం పలికారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి కోసమే బిజెపి పనిచేస్తోంద‌ని అన్నారు. దిల్లీ నుంచి గల్లీ దాకా ఆధ్యాత్మిక శోభతో దేవాలయాలను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా మోదీ సర్కార్ పనిచేస్తోంద‌ని తెలిపారు. ఓరుగల్లులోని చారిత్రక దేవాలయాలపై రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ సూచనల మేరకు కావాల్సిన నిధులను కేంద్రం సమకూరుస్తుందని తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 150 దేవాలయాలను పరిగణలోకి తీసుకున్నామ‌ని, గత పాలనలో ఆలయాల్లో ప్రవేశాలకు నిబంధనలు ఉండేవని, సీనియర్ సిటిజన్ల‌కు మాత్రమే ప్రవేశాలు కల్పించిన పరిస్థితులు ఉండేవ‌ని, కానీ ఇప్పుడు ప్రతీఒక్కరికి ఎలాంటి నిబంధన లేకుండా ఆలయ ప్రవేశాలను కల్పిస్తున్నామ‌ని చెప్పారు. వ‌రంగ‌ల్ భద్రకాళి అమ్మవారు అంటే నాకు ఎంతో భ‌క్తి ఉంద‌ని, కుల మతాలకు తేడా లేకుండా దేశంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నారని సంతోషం వ్య‌క్తం చేశారు.

ప్రతి ఒక్కరికి భక్తి భావన ఉంటే దేశ అభివృద్ధికి సమాజ ఎదుగుదలకు సంస్కృతి సంప్రదాయాలకు నెలవుగా దేశం తయారవుతుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. దేశంలో ఉన్న మారుమూల‌ గ్రామాల్లో నుంచి చంద్రమండలం వరకు త్రివర్ణ పతాకం ఎగిరేసే శక్తి కేవలం నరేంద్ర మోదీ నాయకత్వంలోనే సాధ్యమైంద‌ని చెప్పారు. ఓరుగల్లు కాకతీయ చారిత్రక ప్రదేశాలు, ఇక్కడి దేవాలయాలపై కేంద్రం ఎప్పటినుంచో దృష్టిసారించిందని కిష‌న్ రెడ్డి తెలిపారు.అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపును తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోదీదేన‌ని కొనియాడారు.

కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నానని తెలిపారు. మంత్రి అయిన తర్వాత వెంటనే జమ్ము కాశ్మీర్ ఎన్నికల బాధ్యతలు అప్ప‌గించ‌డంతో ఇక్కడికి రావడం కాస్త ఆలస్యమైంద‌ని తెలిపారు. ప్ర‌ధాని నరేంద్ర మోదీ కూడా భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారని తెలిపారు. తెలంగాణలో జోగులాంబ, భద్రచలం, రామప్ప, బ‌ల్కంపేట అమ్మవారి దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నామని, అయోధ్య, వారణాసి దేవాలయాలతో పాటు పంచ దేవాలయాలను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 150 దేవాలయాలకు అభివృద్ధి పనులకు కొనసాగుతున్నాయని కిష‌న్ రెడ్డితెలిపారు. ప్రతి పండుగల్లో యువత భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నార‌ని. యువత ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటే పెద్దల పట్ల గౌరవం, సంస్కృతి, సాంప్రదాయాలపై అవ‌గాహ‌న వ‌స్తుంద‌ని తెలిపారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఘ‌న‌స్వాగ‌తం
హనుమకొండ: వరంగల్ లోని భద్రకాళి అమ్మవారిని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం ద‌ర్శించుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డిని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఆర్డీవో వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. అలాగే అధికారులు ఘన స్వాగతం పలకగా, పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత‌రం ఆలయ వేద పండితులు కేంద్రమంత్రికి ఆశీర్వచనా అందించి ఆలయ వస్త్రాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి శేషు భారతి, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *