మూడు గ్రామాల్లో సంపూర్ణ సౌర విద్యుదీకరణ

  • ‎కొండారెడ్డిపల్లి తరహాలో మరో రెండు గ్రామాల్లోనూ సోలార్ ప్రాజెక్టు అమలు చేయాలి
  • ‎వ్యవసాయ అవసరాలకూ సౌర విద్యుత్ అందేలా కార్యాచరణ..
  • నాణ్యమైన విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
  • ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 28 : ‎రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన సంపూర్ణ సౌర విద్యుదీకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన మూడు గ్రామాల్లో సంపూర్ణ సౌర విద్యుదీకరణ లక్ష్యాన్ని నిర్దేశిత ప్రమాణాలతో సాధించాలని స్పష్టం చేశారు.  ‎నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరు గ్రామంలో శనివారం టీజీఎస్‌పీడీసీఎల్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో అమలు చేస్తున్న సౌర విద్యుత్ నమూనాను మరో రెండు గ్రామాల్లోనూ పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు. బల్మూరు మండలంలోని కొండారెడ్డిపల్లి, తాడూరు మండలంలోని తుడుకుర్తి గ్రామాల్లోనూ ఇదే తరహా ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేసి, మూడు గ్రామాలను సంపూర్ణ సౌర విద్యుదీకరణకు ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
‎‎సౌర విద్యుదీకరణ అంటే కేవలం గృహ అవసరాలకు విద్యుత్ ఉత్పత్తి చేయడం మాత్రమే కాదని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కూడా సౌర విద్యుత్ అందించడం ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రైతుల వ్యవసాయ అవసరాలకు సౌర విద్యుత్‌ను వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాట్ల ద్వారా రైతులకు గరిష్ఠ ప్రయోజనం చేకూరే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు.
‎‎ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, విద్యుత్ సరఫరాలో లోపాలు గుర్తించినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
‎‎నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అవసరమైన సామగ్రి, పరికరాల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొంటూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. విద్యుత్ సరఫరాపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని, సమస్యలను తక్షణమే పరిష్కరించేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *