- డ్రగ్స్, గంజాయి ముఠాలు, రౌడీ గ్యాంగ్‌లపై ఉక్కుపాదం
- నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం
- మతసామరస్యం పాటించాలి
- విలేజ్ కమిటీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు
- నిజామాబాద్‌తో 27 ఏళ్ల అనుబంధం
- శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసులు భేష్
- నిజామాబాద్ రూరల్ డీఎస్పీ, ముగ్పాల్ నూతన పోలీస్ భవనం ప్రారంభం
- డ్రగ్స్ బారి నుండి విముక్తి పొందిన వారితో మాట్లాడిన డిజిపి
- నిజామాబాద్ సమీక్ష సమావేశంలో డీజీపీ సి.వి.ఆనంద్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 28: యూనిఫాంలో ఉన్న పోలీసులను విధి నిర్వహణలో అడ్డుకున్నా, వారిపై దాడులకు పాల్పడినా సహించేది లేదని డీజీపీ సి.వి.ఆనంద్ స్పష్టం చేశారు. అదే సమయంలో పోలీసులు ఎవరైనా తప్పు చేసినట్లయితే ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్రగ్స్, గంజాయి ముఠాలు, రౌడీ గ్యాంగ్‌లను అణచివేసేందుకు సమర్థవంతమైన పోలీసింగ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ డీఎస్పీ కార్యాలయం, ముగ్పాల్ నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. జిల్లా పోలీసులు చేపట్టిన డీఅడిక్షన్ సెంటర్ల ద్వారా డ్రగ్స్ నుంచి విముక్తి పొందిన డ్రగ్స్ బాధితులకు డ్రగ్స్ జోలికి భవిష్యత్తులో వెళ్లొద్దని సూచించారు. శనివారం నిజామాబాద్‌లో నిర్వహించిన పోలీసు అధికారుల సమీక్ష సమావేశం, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేరాలు నియంత్రణ చేస్తున్నట్టుగా వివరిస్తూ, కొన్ని లోపాలను సరి చేసుకోవాలని సూచిస్తూ జిల్లా పోలీసుల పనితీరును అభినందించారు. నిజామాబాద్ రూరల్ లోని డిఎస్పీ కార్యాలయం మోగ్పాల్ లోని నూతన పోలీస్ స్టేషన్ కార్యాలయాల ప్రారంభోత్సవంలో స్థానిక నాయకులు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి , ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భేష్
నిజామాబాద్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని డీజీపీ అభినందించారు. మతసామరస్యం, శాంతిభద్రతల పరిస్థితి అదుపులో ఉండటం సంతృప్తికరమన్నారు. తెల్లంపూర్ విలేజ్ ఘటన నేపథ్యంలో విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీల పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని అన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వారిపై ఈ ఏడాది 69 ఈ కేసులు వీరి మీద నమోదైనట్టుగా వివరించారు. ఒకప్పుడు నక్సల్స్ తూటాల శబ్దాలతో మారుమోగిన ప్రాంతాలు నేడు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయి, సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అయితే, వారి కదలికలపై పోలీసుల నిఘా కొనసాగుతుందని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
మా ఊరు.. మా భద్రతతో ప్రజలకు చేరువ
నిజామాబాద్ పోలీసులు ‘సంకల్పం’, ‘మా ఊరు.. మా భద్రత’ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతూ నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నారని డీజీపీ పేర్కొన్నారు. పెట్రోలింగ్‌ను మరింత సమర్థంగా నిర్వహిస్తూ నేరాల నియంత్రణలో మంచి ఫలితాలు సాధిస్తున్నారని ప్రశంసించారు. కొన్ని అంశాల్లో ఉన్న లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దుకోవాలని సిబ్బందికి సూచించారు.
నిజామాబాద్‌తో 27 ఏళ్ల అనుబంధం
నిజామాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని డీజీపీ సి.వి.ఆనంద్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. సుమారు 27 ఏళ్ల క్రితం ఇక్కడ పనిచేసిన రోజులను నెమరువేసుకున్నారు. అప్పట్లో చేపట్టిన భవన నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాలను పరిశీలించారు. తనతో కలిసి పనిచేసిన పాత సిబ్బందిని పేరుపేరునా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సలీం అనే అనే ఉద్యోగి కనిపించగా…. మసూద్ గురించి ఆరా తీశారు. చంద్రకళ అనే మహిళా ఉద్యోగిని పలకరించి, ఆమె కుటుంబ వివరాలను కూడా గుర్తుచేసుకున్నారు. నిజామాబాద్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తన కుమారుల పేర్లలోనూ ఆ ప్రాంతంతో ఉన్న అనుబంధం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
గోదావరి పుష్కరాలకు పటిష్ఠ భద్రత
రానున్న గోదావరి పుష్కరాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు. పుష్కరాల సమయంలో రోజుకు సుమారు 2.5 లక్షల మంది, మొత్తం 1.3 కోట్ల మంది భక్తులు వచ్చే అంచనాతో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, ఇతర భద్రతా చర్యలపై ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తూనే సామాన్య ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని డీజీపీ సూచించారు.
తగ్గిన తీవ్రమైన నేరాలు…. పెరిగిన చిన్న తరహా మోసాలు!
నిజామాబాద్ సి.పి. ఇచ్చిన పవర్ ప్రజెంటేషన్ లో…. తీవ్రమైన నేరాలు తగ్గుముఖం పడుతున్నా.. ఆర్థిక మోసాలు, మాదకద్రవ్యాల కేసులు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నట్లుగా వివరించారు. హత్యలు, తీవ్రమైన అత్యాచారాలు, రాత్రి వేళల్లో ఇళ్లలో చోరీలు తగ్గగా.. చీటింగ్, నమ్మకద్రోహం కేసులు 34 నుంచి 35 శాతం, సాధారణ గాయాల కేసులు 18 శాతం, డ్రగ్స్ కేసులు 47 శాతం, రోడ్డు ప్రమాదాలు 10 శాతం పెరిగాయి.
దర్యాప్తులో 54 శాతం కేసులు
2026లో నమోదైన కేసుల్లో 54 శాతం ఇంకా దర్యాప్తు దశలోనే ఉన్నాయి. కేవలం 34 శాతం కేసుల్లో మాత్రమే 60 రోజుల గడువులో ఛార్జిషీట్లు దాఖలవుతున్నాయి. న్యాయస్థానాల్లో విచారణ కోసం 15,092 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నేరాల నియంత్రణతోపాటు నమోదైన కేసులను సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి, నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆ ఐదు స్టేషన్ల పరిధిలోనే 30% నేరాలు
2026లో నమోదైన నేరాల పరంగా ఆర్మూర్ పోలీస్‌స్టేషన్ 607 కేసులతో మొదటి స్థానంలో ఉంది. నిజామాబాద్ రూరల్ 460, టౌన్-I 449, బోధన్ 443, టౌన్-IV 410 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఐదు పోలీస్‌స్టేషన్ల పరిధిలోనే కమిషనరేట్ మొత్తం నేరాల్లో 30 శాతం నమోదయ్యాయి. ఆయా స్టేషన్ల పరిధిలో 1,393 కేసులు ఇంకా దర్యాప్తులో ఉన్నాయి. నిజామాబాద్ రూరల్‌లో నేరాలు గత ఏడాదితో పోలిస్తే 24 శాతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
తీవ్రమైన నేరాల్లో ఊరట
2025లో 294 తీవ్రమైన నేరాలు నమోదుకాగా, 2026 నవంబరు 15 నాటికి 222 నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 14 శాతం తగ్గాయి. హత్యలు, తీవ్రమైన అత్యాచారాలు, రాత్రి వేళల్లో జరిగే చోరీలు తగ్గడం పోలీసులకు ఊరటనిస్తోంది. కమిషనరేట్ పరిధిలో హత్యలు, మహిళలపై అత్యాచారాలు, కిడ్నాప్ తదితర కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తోంది. 2024లో 36 హత్య కేసులు నమోదుకాగా, 2025లో 53, 2026 నవంబరు 15 నాటికి 37 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం 31% తగ్గాయి.
మహిళలపై అత్యాచారాల కేసులు 2024లో 55, 2025లో 71 నమోదయ్యాయి. 2026 నవంబరు 15 నాటికి 41 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత నమోదు ధోరణిని పరిగణనలోకి తీసుకుంటే గత ఏడాదితో పోలిస్తే ఈ కేసులు సుమారు 34 శాతం తగ్గే అవకాశం ఉంది. అన్ని నేరాల విభాగంలో గత ఏడాదితో పోలిస్తే 19 శాతం తగ్గుదల కనిపిస్తోంది.
ఐదు పోలీస్‌స్టేషన్ల పరిధిలోనే 30 శాతం నేరాలు!* కమిషనరేట్ పరిధిలోని ఐదు పోలీస్‌స్టేషన్ల పరిధిలోనే మొత్తం నేరాల్లో 30 శాతం నమోదవుతున్నాయి. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ టౌన్-I, బోధన్, నిజామాబాద్ టౌన్-IV పోలీస్‌స్టేషన్ల పరిధిలో కేసుల సంఖ్య అధికంగా ఉన్నట్లు నేర సమీక్షలో వెల్లడైంది.
పనితీరులో వెనుకబడిన స్టేషన్లు
నూతన క్రిమినల్ చట్టాల అమలు, కేసుల పరిష్కారం, 60, 90 రోజుల గడువులో దర్యాప్తు పూర్తి చేయడం, సంఘటన స్థలంలోనే ఎఫ్ఐఆర్ నమోదు, ఈ-పెట్టీ కేసుల పరిష్కారం తదితర అంశాల ఆధారంగా పోలీస్‌స్టేషన్ల పనితీరును సమీక్షించారు. ఈ ప్రమాణాల్లో నిజామాబాద్ టౌన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, నిజామాబాద్ టౌన్-III, బిక్కనూరు, బోధన్, నవీపేట్, ముప్కాల్ పోలీస్‌స్టేషన్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించారు.
విజిబుల్ పోలీసింగ్‌తో చోరీలకు కళ్లెం
గృహ చోరీలు, హౌస్ బ్రేకింగ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. పోలీసులు చేపడుతున్న నిరంతర పెట్రోలింగ్, వాహన తనిఖీలు, ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తున్న విజిబుల్ పోలీసింగ్ ఇందుకు దోహదపడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే విధానాన్ని మరింత సమర్థంగా కొనసాగించాలని సూచిస్తున్నారు. కార్యక్రమంలో డీజీపీ సి.వి.ఆనంద్‌తో పాటు, నిజామాబాద్ సిపి సాయి చైతన్య, ఐజీ కార్తికేయ (మల్టీజోన్–1), సీఐడీ డీఐజీ నారాయణ నాయక్, సైబర్ సెక్యూరిటీ ఎస్పీ హర్షవర్ధన్, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్‌తో, నిజామాబాద్ అడిషనల్ డీసీపీ శుభం ప్రకాష్, డీసీపీ లు, ఏసిపి లు, ఎస్హెచ్ఓలు ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





