- డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి
- ఆపరేషన్ కవచ్‌తో అంతర్రాష్ట్ర ముఠాలకు కళ్లెం
- సైబర్ నేరాల్లో 61 శాతం నగదు రికవరీ
- డీజీపీ సి.వి. ఆనంద్
- కామారెడ్డి పోలీసులకు డీజీపీ ప్రశంసలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: నేరాల నియంత్రణలో పెట్రోలింగ్ కీలక పాత్ర పోషిస్తుందని, క్షేత్రస్థాయిలో పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తే నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని డీజీపీ సి.వి.ఆనంద్ అన్నారు. ఆస్తి సంబంధిత నేరాల నమోదును తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సైబర్ నేరాల్లో బాధితులు పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రికవరీ చేయడంలో, శిక్షణ ఖరారులో కామారెడ్డి పోలీసులు చూపుతున్న పనితీరును అభినందించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన క్రైమ్ సమీక్ష సమావేశానికి హాజరైన డిజిపి కి కామ రెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో డిజిపి మాట్లాడుతూ…
జిల్లాలో ఆస్తి సంబంధిత నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి పెట్రోలింగ్ పెంచాలని సూచించారు. పోక్సో సహా వివిధ నేరాల్లో నిందితులకు శిక్షలు పడేలా పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. సైబర్ మోసాల్లో పోగొట్టుకున్న నగదును బాధితులకు తిరిగి అందించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పనిచేసిన అనుభవాలను డీజీపీ గుర్తుచేసుకున్నారు. 1996 ఆగస్టు నుంచి 1999 డిసెంబరు వరకు సుమారు మూడున్నరేళ్లపాటు ఇక్కడ విధులు నిర్వర్తించానన్నారు. అప్పట్లో నక్సల్స్ సమస్య తీవ్రంగా ఉండేదని, గ్రామాల్లో దళాల సంచారం, పట్టణాల్లో టౌన్ పార్టీల కార్యకలాపాలతో నిరంతరం సవాళ్లు ఎదురయ్యేవని తెలిపారు. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రుల పర్యటనలకు కూడా భద్రత కల్పించడం కష్టంగా ఉండేదన్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ పోలీసుల సమష్టి ప్రణాళికతో మూడు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించగలిగామని గుర్తుచేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడినప్పటికీ సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణ ప్రధాన సవాళ్లుగా మారాయని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాకు మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలతో సరిహద్దులు ఉండటంతో అంతర్రాష్ట్ర నేర ముఠాల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు.
గతంలో ఏటా 10 నుంచి 15 వరకు ముఠాలు జిల్లాలో సంచరించే పరిస్థితి ఉండేదని, వాటి కట్టడికి చేపట్టిన ఆపరేషన్ కవచ్ మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. ఈ ఆపరేషన్‌ను మరింత సమర్థంగా కొనసాగించాలని సూచించారు.దేశాన్ని 2029 డిసెంబరు 31 నాటికి నషా ముక్త్ భారత్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని డీజీపీ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసులతోపాటు సమాజంలోని అన్ని వర్గాలు భాగస్వాములు కావాలన్నారు. తెలంగాణలో ఇప్పటికే ఈగల్ వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మాదకద్రవ్యాల సరఫరా, వినియోగంపై పీసీ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించుకుంటూ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని డీజీపీ పేర్కొన్నారు. సుమారు 40 రకాల సైబర్ నేరాల ద్వారా ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని చెప్పారు. ప్రతి జిల్లాలో సైబర్ యూనిట్లు, సైబర్ వారియర్లు అందుబాటులో ఉన్నారని, బాధితులకు తక్షణ సహాయం అందించడంతోపాటు నగదు రికవరీకి ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, వీటివల్ల ఆర్థికంగా నష్టపోయి కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్ కూడా అందించాలని సూచించారు.జిల్లాలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను విస్తరించాల్సిన అవసరం ఉందని డీజీపీ తెలిపారు. కామారెడ్డి పట్టణంలో మరో పోలీస్‌స్టేషన్, బాన్సువాడలో పోలీస్‌స్టేషన్‌తోపాటు ట్రాఫిక్, మహిళా పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ట్రాఫిక్ నిర్వహణ, బ్లూకోల్ట్స్, టెక్ టీమ్‌లకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు.ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సీసీటీఎన్‌ఎస్, ఈ-సాక్ష వంటి సాంకేతిక అప్లికేషన్లను సమర్థంగా వినియోగించుకోవాలని చెప్పారు. కేసుల నమోదు, దర్యాప్తు, నేరాల విశ్లేషణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లాలో డ్రగ్స్ బాధితుల పునరావాసం కోసం డీ-అడిక్షన్ కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
విధి నిర్వహణలో నిరంతరం ఒత్తిడిని ఎదుర్కొనే పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని డీజీపీ తెలిపారు. ఫిట్‌కాప్ కార్యక్రమం ద్వారా 75 వేల మందికి పైగా పోలీసు సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, సమస్యలను గుర్తించి తగిన సూచనలు, మార్గదర్శకాలు అందించనున్నట్లు వివరించారు.సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పవర్ జిల్లాలో నేరాలు, శాంతిభద్రతలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జాతీయ రహదారులు, ఇతర రాష్ట్రాలకు అనుసంధానమయ్యే మార్గాలు ఉండటంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదాలు అధికంగా జరిగే 25 ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లు వివరించారు. బాన్సువాడలో ఫిబ్రవరి 2026లో జరిగిన మతపరమైన ఘర్షణలకు సంబంధించి 17 కేసులు నమోదు చేసి 41 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి రవాణా జరిగే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని నిఘా పెంచామన్నారు. ఇటీవల 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని పీడీయాక్ట్ కింద చర్యలు తీసుకున్నట్లు వివరించారు. 2024లో 51, 2025లో 14, 2026 అక్టోబరు వరకు 14 ఎన్‌డీపీఎస్ కేసులు నమోదైనట్లు తెలిపారు. నిందితులకు సంబంధించిన ఆస్తుల జప్తునకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు.సమావేశంలో ఎన్‌డీపీఎస్ కేసుల నమోదు, దర్యాప్తు అంశాలపై ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ వివరించారు. కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై సీఐడీ డీఐజీ నారాయణ నాయక్ అవగాహన కల్పించారు. సోషల్ మీడియా వినియోగం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు, నిరసన కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు డీజీపీ పలు సూచనలు చేశారు.
నేరాల నియంత్రణ, దర్యాప్తు, సైబర్ నేరాల బాధితులకు నగదు రికవరీ, మొబైల్ ఫోన్ల స్వాధీనం తదితర అంశాల్లో కామారెడ్డి జిల్లా పోలీసుల పనితీరును ఎస్పీ రాజేష్ చంద్ర పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీజీపీ సి.వి.ఆనంద్‌కు వివరించారు. జిల్లాలో సిబ్బంది కొరత, నేరాల నమోదు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వివరాలను వెల్లడించారు.జిల్లా పోలీసు శాఖలో మొత్తం 1,158 పోస్టులు మంజూరయ్యాయని, ప్రస్తుతం 976 మంది సిబ్బంది పనిచేస్తున్నారని ఎస్పీ వివరించారు. మరో 182 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. సిబ్బంది అందుబాటులో ఉన్న వనరులతో సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.సైబర్ నేరాల నియంత్రణతోపాటు బాధితులు కోల్పోయిన నగదును తిరిగి ఇప్పించడంలో జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 2024లో 55 శాతం, 2025లో 69 శాతం, 2026 నవంబరు నాటికి 61 శాతం నగదును రికవరీ చేసినట్లు వివరించారు. సైబర్ నేరాలపై నిరంతర నిఘా, బాధితులకు సత్వర సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ల రికవరీలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ఏడో స్థానంలో ఉందని ఎస్పీ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 7,285 మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదులు అందగా, వాటిలో 3,683 ఫోన్లను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇది 55 శాతానికి పైగా రికవరీగా పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా వ్యాప్తంగా 25 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించినట్లు ఎస్పీ వివరించారు. ముఖ్యంగా జాతీయ రహదారి 44, రాష్ట్ర రహదారి 765D పరిధిలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రమాదాల తీవ్రత తగ్గించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జిల్లాలో నేరాల నమోదును విశ్లేషించగా కామారెడ్డి టౌన్, దేవునిపల్లి, బాన్సువాడ, బిచ్కుంద, బిక్కనూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఐదు పోలీస్‌స్టేషన్ల పరిధిలోనే జిల్లాలోని మొత్తం నేరాల్లో 42 శాతం నమోదవుతున్నట్లు వివరించారు. కేసుల పరిష్కారం, దర్యాప్తు, శిక్షల ఖరారు, అండర్ ట్రయల్ కేసుల పురోగతి, రోడ్డు ప్రమాదాల నియంత్రణ తదితర అంశాల్లో పనితీరు ఆధారంగా పోలీస్‌స్టేషన్లను విశ్లేషించినట్లు చెప్పారు.ఇసుక అక్రమ రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాల నియంత్రణలో భాగంగా 2024లో 36 కేసులు నమోదు చేసి 37 వాహనాలను, 2025లో 313 కేసులు నమోదు చేసి 393 వాహనాలను, 2026 నవంబరు నాటికి 193 కేసులు నమోదు చేసి 281 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రజెంటేషన్‌లో వివరించారు.అక్రమ గేమింగ్ కార్యకలాపాలపై కూడా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 2023లో 155 కేసులు, 2024లో 207, 2025లో 309, 2026 నవంబరు నాటికి 376 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిఘా ఉంచినట్లు ఎస్పీ వివరించారు. 2023లో 13, 2024లో 24, 2025లో 108, 2026లో ఇప్పటివరకు 135 రౌడీషీట్లు తెరిచినట్లు తెలిపారు. నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.2026 ఫిబ్రవరిలో బాన్సువాడ పట్టణంలో జరిగిన మత ఘర్షణ సంబంధించి కేసులు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వివరించారు.జిల్లాలో 2026 నవంబరు 15 నాటికి నమోదైన కేసులు, వాటి దర్యాప్తు, ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, కేసుల పరిష్కారానికి సంబంధించిన వివరాలను కూడా డీజీపీకి సమర్పించారు.ఈ కార్యక్రమంలో డీజీపీ సి.వి.ఆనంద్‌తో పాటు ఐజీ కార్తికేయ (మల్టీజోన్–1), సీఐడీ డీఐజీ నారాయణ నాయక్, జోన్–3 డీఐజీ సన్ ప్రీత్ సింగ్, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర, సైబర్ సెక్యూరిటీ ఎస్పీ హర్షవర్ధన్, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





