ఉద్య‌మాన్ని మ‌లుపు తిప్పిన‌ దీక్షా దివస్  

పదవులను వదిలి ప్రజల మధ్యకు కేసీఆర్..
ఆమరణ దీక్షతో దిల్లీని కదిలించిన ఉద్యమం!
ఒక వ్యక్తి దీక్షగా మొదలై సబ్బండ వర్గాల సమష్టి పోరాటంగా మారిన చారిత్రక ఘట్టం

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 29 : తెలంగాణ చరిత్రలో నవంబర్‌ 29 ఒక సాధారణ తేదీ కాదు. ఆరు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు, ఎన్నో పోరాటాలకు, వందలాది మంది త్యాగాలకు ఒక కీలక మలుపుగా నిలిచిన రోజు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు నాంది పలికిన రోజు. అందుకే నవంబర్‌ 29ను తెలంగాణ ప్రజలు దీక్షా దివస్‌గా గుర్తు చేసుకుంటారు. స్వ‌రాష్ట్రం ఒక్క రోజులోనో, ఒక్క నాయకుడి ప్రయత్నంతోనో ఏర్పడలేదు. 1969 తెలంగాణ ఉద్యమం నుంచి మలి దశ ఉద్యమం వరకు విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, మేధావులు, మహిళలు, యువత అనేక రూపాల్లో పోరాటాలు చేశారు. ఎన్నో తరాల ఆకాంక్ష, ఎన్నో కుటుంబాల త్యాగాలు, ఎన్నో ఉద్యమాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం. అయితే ఈ సుదీర్ఘ పోరాటంలో నవంబర్‌ 29, 2009 ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఆ రోజు కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మరో దశకు తీసుకెళ్లింది. ఆ దీక్ష వెనుక ఉన్న రాజకీయ నేపథ్యం, ఉద్దేశం, దాని ద్వారా సాధించిన ఫలితాలను చరిత్రాత్మక దృష్టితో పరిశీలించాల్సిన అవసరం ఉంది.

2004 హామీ నుంచి 2009 ఆమరణ దీక్ష వరకు

2004లో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంతో టీఆర్ఎస్‌ పొత్తు పెట్టుకుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై తగిన సంప్రదింపులు, ఏకాభిప్రాయం సాధించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని యూపీఏ ఉమ్మడి కనీస కార్యక్రమంలో పేర్కొంది. 2004 జూన్‌లో రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలోనూ తెలంగాణ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ప్రజల్లో ఆశలు చిగురించాయి.  కానీ ఆ హామీ ఆచరణలోకి రాకపోవడంతో తెలంగాణలో నిరాశ పెరిగింది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారనే భావన ఉద్యమ శ్రేణుల్లో బలపడింది. కాంగ్రెస్‌ నాయకత్వంపై ఒత్తిడి పెంచేందుకు టీఆర్ఎస్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పదవులకు రాజీనామాలు చేసి బయటకు వచ్చింది. 2006లో యూపీఏ నుంచి వైదొలగడం, రాజీనామాల రాజకీయంతో తెలంగాణ అంశాన్ని మళ్లీ జాతీయ రాజకీయాల కేంద్రంలోకి తీసుకురావడానికి ప్రయత్నించింది.
అయితే రాజకీయ ప్రకటనలు, పొత్తులు, ఎన్నికల హామీలతో తెలంగాణ సాధ్యం కాదని, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం వచ్చేలా ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ భావించారు. ఈ నేపథ్యంలోనే 2009 నవంబర్‌ 29న ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు.

‘తెలంగాణ వొచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో’

2009 నవంబర్‌ 29న సిద్దిపేటలోని రంగదాంపల్లి చౌరస్తా వద్ద దీక్ష ప్రారంభించేందుకు కేసీఆర్‌ బయలుదేరారు. కానీ కరీంనగర్‌ సమీపంలోని అలుగునూరు చౌరస్తా వద్ద పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. వరంగల్‌ మీదుగా ఖమ్మం తరలించి న్యాయస్థానంలో హాజరుపరిచి ఖమ్మం సబ్‌జైలుకు పంపించారు. జైలులో ఉన్నప్పటికీ ఆయన నిరాహార దీక్ష కొనసాగించారు. ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.
ఆ సమయంలో తెలంగాణ అంతటా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. విద్యార్థులు, ఉద్యోగులు, న్యాయవాదులు, కార్మికులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఉద్యమంలో భాగస్వాములయ్యాయి. ముఖ్యంగా ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఉద్యమానికి కేంద్ర బిందువులయ్యారు. కేసీఆర్‌ అరెస్టు వార్తతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దీక్షకు మద్దతుగా బంద్‌లు, రాస్తారోకోలు, నిరసనలు జరిగాయి. ‘తెలంగాణ వొచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో’ అనే నినాదం గ్రామగ్రామాన మార్మోగింది. ఒక వ్యక్తి నిరాహార దీక్షగా ప్రారంభమైన కార్యక్రమం క్రమంగా ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపంగా మారింది. ఈ ఉద్యమం వెనుక విద్యార్థులు, యువకులు, అమరవీరులు, ప్రజాసంఘాలు, ఉద్యోగులు, సబ్బండ వర్గాలు సమష్టి పోరాటం చేశారు.

దీక్షతో కదిలిన కేంద్ర ప్రభుత్వం

నవంబర్‌ 29న ప్రారంభమైన దీక్ష, తెలంగాణలో విస్తరించిన ప్రజా ఉద్యమం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చాయి. డిసెంబర్‌ 9, 2009న అప్పటి కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం పార్లమెంట్‌ వేదికగా కాకుండా దిల్లీలో చేసిన ప్రకటన ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కేసీఆర్‌ తన నిరాహార దీక్ష విరమించారు.
అయితే డిసెంబర్‌ 23న కేంద్ర ప్రభుత్వం మరో ప్రకటన చేసి, తెలంగాణపై యూటర్న్ తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీంతో తెలంగాణ ఉద్యమం మరోసారి తీవ్రరూపం దాల్చింది. అనంతరం 2010 ఫిబ్రవరి 3న జస్టిస్‌ బీఎన్‌ శ్రీకృష్ణ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ పరిణామాలన్నింటి మధ్య విద్యార్థులు, ఉద్యోగులు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఉద్యమాన్ని కొనసాగించాయి. సకల జనుల సమ్మె, మిలియన్‌ మార్చ్‌, సాగరహారం వంటి కార్యక్రమాలు తెలంగాణ ఆకాంక్షను మరింత బలపరిచాయి. తెలంగాణలో అన్ని రాజకీయ పక్షాలు సబ్బండ వర్గాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కెసిఆర్ నాయకత్వంలో రాజీ లేని పోరాటం చేశారు..
2013 జూలై 30న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం పొందిన అనంతరం 2014 జూన్‌ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది.

దీక్షా దివస్‌ మనకు నేర్పిన పాఠం ఏమిటి?

దీక్షా దివస్‌ అంటే కేవలం కేసీఆర్‌ నిరాహార దీక్షను గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ నాయకత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయాన్ని, దాని వెనుక ప్రజలు ప్రదర్శించిన ఉద్యమ స్ఫూర్తిని, అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం.
ఈ దీక్ష ద్వారా తెలంగాణ ఉద్యమానికి ప్రధానంగా మూడు పరిణామాలు చోటుచేసుకున్నాయి.
తెలంగాణ అంశానికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత: రాష్ట్ర విభజన, ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ దేశ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.
ప్రజా ఉద్యమానికి కొత్త ఊపు: విద్యార్థులు, ఉద్యోగులు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు, మేధావులు ఒకే లక్ష్యంతో ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
 రాష్ట్ర ఏర్పాటుకు రాజకీయ ప్రక్రియ వేగవంతం: డిసెంబర్‌ 9 ప్రకటన నుంచి శ్రీకృష్ణ కమిటీ, అఖిలపక్ష సమావేశాలు, పార్లమెంట్‌ చట్టం వరకు పరిణామాలు ముందుకు సాగాయి.
అయితే 60 ఎళ్ల తెలంగాణ ఆకాంక్ష నిజం కావడానికి ఈరోజు ఎంతో కీలకమైంది. 1969 ఉద్యమకారుల నుంచి మలి దశ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల వరకు, ఉద్యమాన్ని గ్రామగ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతి ఒక్కరి పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కెసిఆర్ సారథ్యంలో ఈ దీక్ష ఉద్యమంలో ఒక కీలక మలుపు కాగా, ప్రజల సమష్టి పోరాటానికి, రాష్ట్ర సాధనకు బలమైన పునాదిగా మారింది..

స్వ‌రాష్ట్రంలో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాయా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దీక్షా దివస్‌ మనకు కొన్ని ప్రశ్నలను గుర్తు చేస్తుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు కన్న కలలు ఎంతవరకు సాకారమయ్యాయి? రైతుల బతుకులు బాగుపడ్డాయా? సాగునీరు, తాగునీరు అందరికీ అందుతున్నాయా? యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయా? గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు చేరాయా? తెలంగాణ ఆత్మగౌరవం, స్వయం పాలన ఆశయాలు నిలబడుతున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం కూడా దీక్షా దివస్‌ స్ఫూర్తిలో భాగమే. రాష్ట్ర సాధనతో పోరాటం ముగిసిపోలేదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.

చరిత్రను గుర్తు చేసుకోవడమే కాదు.. స్ఫూర్తిని కొనసాగించాలి!

నవంబర్‌ 29న నిర్వహించే దీక్షా దివస్‌ కార్యక్రమాలు కేవలం సభలు, సమావేశాలు, నివాళులకే పరిమితం కాకూడదు. తెలంగాణ కోసం పోరాడిన తరం అనుభవాలను నేటి తరానికి తెలియజేయాలి. అమరవీరుల కుటుంబాలను గౌరవించాలి. ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, కళాకారులు, జర్నలిస్టులు, సామాన్య కార్యకర్తల సేవలను గుర్తించాలి. నాడు తెలంగాణ కోసం జరిగిన పోరాటం వెనుక ఉన్న ప్రధాన ఆకాంక్ష స్వయం పాలన, ఆత్మగౌరవం, సమాన అభివృద్ధి. ఆ ఆకాంక్షలను భవిష్యత్‌ తరాలకు అందించడం మన బాధ్యత. నవంబర్‌ 29 ఒక దీక్షకు గుర్తు.. ఒక ఉద్యమానికి మలుపు.. ఒక రాష్ట్ర సాధన సంకల్పానికి ప్రతీక. తెలంగాణ చరిత్రలో కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అదే సమయంలో ఆ దీక్షకు బలాన్నిచ్చిన ప్రజా ఉద్యమాన్ని, తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరవీరులను ఎన్నటికీ మరువకూడదు. తెలంగాణ చరిత్రను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ఈ రెండు పార్శ్వాలనూ సమానంగా గుర్తించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *