వారం రోజులుగా తల్లి శవంతో ఇంట్లోనే కూతుళ్లు

  • అంత్యక్రియలకు డబ్బులు లేక ..ఎవరికీ చెప్పలేదన్న వాదన
  • తల్లి మరణంతో డిప్రెషన్‌లోకి వెళ్లారని మరో కథనం
  • విషయం తెలుసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
అకస్మాత్తుగా తల్లి మరణం.. ఆమె ఇద్దరు కుమార్తెలను మానసికంగా కుంగిపోయేలా చేసింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తల్లి మృతదేహంతో ఒకే ఇంట్లో  నాలుగు రోజులుగా ఉండిపోయారు కుమార్తెలు. ఈ హృదయవిదారక ఘటన సికింద్రాబాద్‌ ‌వారాసిగూడలో ఆలస్యంగా వెలుగుచూసింది.వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్‌ ‌వారాసిగూడ పోలీసుస్టేషన్‌ ‌పరిధిలోని బౌద్ధనగర్‌లో లలిత అనే మహిళ మృతిచెందారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. లలిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. లలిత చనిపోయి నాలుగు రోజులవుతోందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె గుండెపోటుతో మరణించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. తల్లి అకస్మాత్తుగా చనిపోవడంతో ఆమె ఇద్దరు కుమార్తెలు రవళిక, యశ్విత మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఏం చేయాలో తెలియక నాలుగు రోజులపాటు అదే ఇంట్లో ఒక గదిలో తల్లి మృతదేహాన్ని ఉంచి, మరో గదిలో వారిద్దరూ ఉన్నట్లు తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వారాసిగూడ పోలీసులు తెలిపారు. అయితే మరో కథనం కూడా ఇందులో ఉంది.
సికింద్రాబాద్‌ ‌వారాసిగూడలో వెలుగులోకి వచ్చిన ఘటన.. అందరికీ కన్నీళ్లు తెప్పిస్తుంది. తల్లి చనిపోయి వారం రోజులు అవుతుంటే.. అంత్యక్రియలకు డబ్బులు లేక ఇంట్లోనే వారం రోజులు.. తల్లి శవంతో గడిపిన ఆ ఇద్దరు పిల్లల మానసిక పరిస్థితి ఏంటన్నది చర్చ సాగుతోంది.  బౌద్దనగర్‌లో లలిత (45) తన ఇద్దరు కూతుర్లు రవళిక (25), అశ్విత (23)తో కలిసి నివాసం ఉంటుంది. కరోనా సమయంలో లలిత భర్త కుటుంబాన్ని వదిలి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇద్దరు ఆడకూతుర్ల బాగోగులు లలితనే చూసుకుంటుంది. ఈ క్రమంలోనే లలిత అనారోగ్యానికి గురి అయ్యింది. ట్రీట్మెంట్‌ ‌చేయించుకునేందుకు డబ్బులు లేకపోవడంతో అలాగే ఇంట్లో ఉంటుంది.  దీంతో ఆరోగ్యం మరింత విషమించి జనవరి 23న అంటే తొమ్మిది రోజుల క్రితం లలిత మరణించింది.
తల్లి మరణంతో డిప్రెషన్‌ ‌లోకి వెళ్లిన కూతుర్లు.. దహన సంస్కారాలకు డబ్బులు లేక తల్లి మరణవార్తను ఎవరికీ చెప్పలేదు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా లలిత మృతి చెంది ఉంది. కూతుళ్లను ప్రశ్నించగా.. జనవరి 23వ తేదీన తమ తల్లి చనిపోయిందని.. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో విషయాన్ని ఎవరికీ చెప్పలేదన్నారు. మొదట ఖంగుతున్న పోలీసులు.. చివరకు అర్థం చేసుకుని లలిత మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. తల్లి శవంతోటే ఇద్దరు కూతుర్లు తొమ్మిది రోజుల పాటు ఇంట్లో ఉన్నారన్న విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లలిత మృతికి గల కారణం ఏంటన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page