నల్లగొండ బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయాన్ని కూల్చేయండి

అనుమతి లేకుండా నిర్మించడంపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 18:  అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ను కూల్చేయాలని తెలంగాణ హైకోర్టు అధికారులను ఆదేశించింది. నల్గొండలోని ఆఫీస్‌ను పదిహేను రోజుల్లో నేల మట్టం చేయాలని స్పష్టం చేసింది. నల్ల‌గొండలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ను రెగ్యులరైజ్‌ ‌చేసేలా అధికారులను ఆదేశించాలన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అనుమతి తీసుకోకుండా ఆఫీస్‌ ‌కట్టి… ఇప్పుడు రెగ్యులరైజ్‌ ‌చేయాలని అడగడమేంట‌ని ప్రశ్నించింది. అనుమతులు లేకుండా అక్రమంగా కట్టిన ఆఫీస్‌ను 15 రోజుల్లో కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు దానికి అయ్యే ఖర్చును నష్టపరిహారం రూపంలో రూ.లక్ష బీఆర్‌ఎస్‌ ‌పార్టీ చెల్లించాలని తేల్చి చెప్పింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్‌ ‌చేసే విధంగా మున్సిపల్‌ ‌శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలైంది. పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని హైకోర్టు ఈ పిటిషన్‌ ‌పై విచారణ సందర్భంగా సూటిగా ప్రశ్నించింది.

కట్టకముందు అనుమతి తీసుకోవాలి కానీ కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని హైకోర్టు పిటిషనర్‌ను అడిగింది. 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టాలని హైకోర్టు ఆదేశించింది. నల్ల‌గొండ జిల్లా బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆఫీస్‌ ‌కూల్చివేతకు గత నెల తాత్కాలికంగా బ్రేక్‌పడింది. ఆగస్టు 11లోగా పార్టీ ఆఫీస్‌ ‌కూల్చివేయాలని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులకు డెడ్‌లైన్‌ ‌పెట్టిన సంగతి తెలిసిందే.. అయితే నెల రోజులు అవుతున్నా పార్టీ ఆఫీస్‌ ‌కూల్చివేతపై అధికారుల నుంచి ఎలాంటి కదలిక లేదు. పార్టీ ఆఫీస్‌ను టచ్‌చేస్తే అంతు చూస్తామని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సైతం హెచ్చరించారు. కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌మధ్య పార్టీ ఆఫీస్‌ ‌వివాదం పెద్ద రాజకీయ దుమారం రేపింది. పార్టీ బిల్డింగ్‌కు మున్సిపల్ పర్మిషన్‌ ‌లేదని, దాన్ని కూల్చేయాలని డీటీసీపీ కమిటీ సిఫార్సు చేసింది. దీంతో అధికారులు కూడా టెన్షన్‌ ‌పడ్డారు. చివరకు బీఆర్‌ఎస్‌ ‌నాయకత్వం హైకోర్టును ఆశ్రయించింది. రెగ్యులరైజేషన్‌ ‌పర్మిషన్‌ ‌లేనందున దీనికి ప్రత్యామ్నాయం మార్గం చూపాలని హైకోర్టు డైరెక్షన్‌ ఇచ్చిందని మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌ముసాక్‌ అహ్మద్‌ అప్పట్లో తెలిపారు. దీంతో అప్పటికి పార్టీ ఆఫీస్‌ ‌కూల్చివేత ఆగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *