నేడు తీర్పు చెప్పనున్న దిల్లీ వోటర్లు

చీపురుతో ఊడ్చివేస్తారా, కాషాయాన్ని కప్పుకుంటారా, చెయ్యి కలుపుతారా

దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ కి నేడు జరుగనున్న ఎన్నికలపై యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఇక్కడ పోటీ పడుతున్న మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ మూడిరటిలో  బిజేపి, ఆమ్‌ ఆద్మీ పార్టీలు మాత్రం నువ్వానేనా అన్నట్లుగా నిన్నటి వరకు పోటీ ప్రచారాలు నిర్వహించాయి. గడచిన రెండు  ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆమ్‌ ఆద్మీపార్టీ (ఆప్‌) మూడవసారి అధికారం చేపట్టేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నది. ఈ పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి దిల్లీ  అసెంబ్లీ పరిధిలో తిరగులేని శక్తిగా ఆవిర్భవించింది. దిల్లీ శాసనసభకున్న 70 స్థానాల్లో 67 సీట్లను గెలుచుకోవడం ద్వారా 2015లో అధికారం చేపట్టిన ఆప్‌, 2020లో 62 స్థానాలతో తిరిగి అధికారంలోకి వొచ్చింది.

అయితే ఈ పదేళ్ళ కాలంలో ఆప్‌ కేంద్రంలోని బిజేపి ప్రభుత్వంతో ఆనేక ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వొచ్చింది. అనేక సందర్భాల్లో దిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌తో తగాదాపడుతూ రావడం రాష్ట్ర ముఖ్యమంత్రిగా అరవింద కేజ్రీవాల్‌కు సవాల్‌గా మారింది. 2012లో పార్టీ ప్రారంభమైనప్పుడు ఎన్నోఆశలు, ఆశయాలను వల్లించిన కేజ్రీవాల్‌ను నిస్సందేహంగా దేశరాజకీయాలకు దిక్సూచీగా భావించారు. కేంద్రం నుండి ఎన్ని అవాంతరాలు వొచ్చినా దిల్లీ ప్రజలు ఆయన వెంటే నిలిచారు. దీంతో దేశాధిపత్యాన్ని చేపట్టిన బిజెపికి ఆప్‌ పక్కలో బల్లెంగా తయారైందన్న భావం కలుగుతూ వొచ్చింది.

ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటూ వొచ్చిన మోదీ ప్రభుత్వం దిల్లీ అసెంబ్లీ పైన కాషాయ జంఢాను ఎగురవేసేందుకు ఎన్ని ఎత్తుగడలు వేసినా కొరుకుడు పడకుండాపోయింది. అయితే దిల్ల్లీ లిక్కర్‌ స్క్యామ్‌ కేజ్రీవాల్‌ ఇమేజిపైన తీవ్రంగా దెబ్బకొట్టింది. ఎంతో నీతివంతుడిగా ప్రజలచేత మన్నలను పొందిన కేజ్రీవాల్‌ జ్కెల్‌కు వెళ్ళాల్సిన పరిస్తితి ఏర్పడిరది. ఆయనతోపాటు ఆప్‌ ముఖ్యనాయకులు కూడా ఊచలు లెక్కించాల్సి వొచ్చింది. చివరకు తన ముఖ్యమంత్రి పదవిని కూడా వదులుకుని తమ పార్టీ నేత అతిశీకి అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఆ దశలో దిల్ల్లీ శాసన సభకు ఇప్పుడు ఎన్నికలు వొచ్చాయి. బుధవారం(నేడు) జరుగనున్న ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాల్సి ఉంది.

ఎంతో కష్టకాలాన్ని ఎదుర్కుని పోటీలోనిలిచిన ఆప్‌ హ్యాట్రిక్‌ సాధిస్తే నిజంగానే అదొక చరిత్రే అవుతుంది. దేశాధిపత్యం చేపట్టిన బిజెపి రాజధానిలోని అసెంబ్లీలో మరో పార్టీ ప్రాపకాన్ని జీర్ణించుకోలేకపోతున్నది. రెండున్నర దశాబ్ధాలక్రితం దిల్ల్లీపైన ఉన్న తమ ఆధిపత్యాన్ని తిరిగి దక్కించుకునేందుకు చాలాకాలంగా బిజెపి తమ శక్తియుక్తులను దార పోస్తూ వొచ్చింది. 1993 నుంచి 1998 వరకు దిల్ల్లీ అసెంబ్లీ పై బిజెపికి పట్టుఉండిరది . మదన్‌లాల్‌ ఖురానా, సాహిబ్‌సింగ్‌ వర్మ, సుస్మాస్వరాజ్‌లు ముఖ్యమంత్రులుగా కొనసాగారు. 27 ఏళ్ళ కిందినాటి వైభవాన్ని తిరిగి పొందేందుకు గడచిన దశాబ్ధకాలంగా దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై అనేక ఒత్తిడులు తీసుకురావడంతోపాటు, చివరకు జ్కెల్‌కు పంపడంలోనూ మోదీ ప్రభుత్వ హస్తముందన్న ఆరోపణ లేకపోలేదు.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఎట్టిపరిస్థితిలో దిల్లీ అసెంబ్లీ పైన కాషాయ జంఢాను ఎగురవేయాల్సిందేనన్న పట్టుదలతో బిజెపి పనిచేసింది. సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీతోపాటు, హోంశాఖ మంత్రి అమిత్‌షా అదేపనిగా రోజులతరబడి ఇక్కడ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు చివరకు ఎమ్మెల్యేలను  కూడా ఇక్కడికి తరలించారు. మిత్రపక్షంగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం  ప్రచారం నిర్వహించారు. అరవింద కేజ్రీవాల్‌ అవినీతితోపాటు దిల్లీలోిని వాయుకాలుష్యం, నీటి (యమున) కాలుష్యం ఈ ఎన్నికల్లో ప్రధానాస్త్రాలుగా మారాయి. ఈ రెండు కాలుష్యానికి బాధ్యులు మీరంటే మీరని బిజెపి, ఆప్‌ నాయకుల ఆరోపణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ విచిత్రమేమంటే గతంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్‌ ప్రకటించిన సంక్షేమ పథకాలను విమర్శించిన విపక్షాలు కూడా ఈ ఎన్నికల్లో అనేక రాయితీలు, ప్రోత్సహకాలను, ఉచితాలను పోటీపడి ప్రకటించాయి. బిజెపి, ఆప్‌లతో పోటీపడి మేనిఫెస్టోను ప్రకటించినప్పటికీ కాంగ్రెస్‌పార్టీ ఆ రెండుపార్టీలకు ధీటుగా ప్రచారం చేయలేకపోయింది.  దిల్లీ   ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన షీలాదీక్షిత్‌ తర్వాత అంతటి నాయకులెవరూ అక్కడ ఎదగకపోవడం కాంగ్రెస్‌కు మైనస్‌ పాయింట్‌ అయింది.

దానికి తగినట్లుగా  ఇండియా కూటమి నుండి కేజ్రీవాల్‌ వైదొలగడంతో కాంగ్రెస్‌ ఒంటరిగా రంగంలోకి దిగాల్సి వొచ్చింది. ఇండియా కూటమిలోని ఇతరపార్టీలు కూడా ఆప్‌కే మద్దతిస్తుండటం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. రాజధాని దిల్లీలోని అసెంబ్లీలో వోట్లను సాధించుకోకపోవడం అప్రదిష్టగా భావిస్తున్న కాంగ్రెస్‌ ఉనికికోసం పోరాటం చేయక తప్పడంలేదు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున కర్గే, రాహుల్‌, ప్రియాంకగాంధీతో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలు విస్తృత ప్రచారం చేశారు.
అయినా పోటీమాత్రం బిజెపి, ఆప్‌ మధ్యనే ఉంటుందన్న టాక్‌ వినిపిస్తున్నది. దిల్లీ  వోటర్లు ఈసారి ఎవరిని గద్దెనెక్కిస్తారన్నది వేచి చూడాల్సిందే.
మండువ రవీంర్‌రావు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page