రైతుల శాపనార్థాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది
ట్విటర్ వేదికగా కేటీఆర్ విమర్శలు
ఇది రైతు రాజ్యం కాదని, రైతు వంచన రాజ్యమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఒకే రోజు నలుగురు రైతులను పొట్టనబెట్టుకున్న ప్రభుత్వమిదని మండిపడ్డారు. ముమ్మాటికీ రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదని, తోడేళ్లలా ప్రాణం తీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యమని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ కాదు ఇది ఖూనీకోర్. ఆత్మహత్యలు కాదివి ముమ్మాటికి మీరు చేసిన హత్యలే అని అన్నారు. రుణమాఫీ చేయనందుకే ఈ ఆత్మహత్యలని అన్నారు. రైతుబంధు వేయకుండా చేసిన ఖూనీలు. ఆ కుటుంబాల మనోవేదనలే మీ సర్కారుకు మరణ శాసనం రాస్తాయని చెప్పారు. వారి కన్నీళ్లే కపట సర్కార్‌ను కూల్చివేస్తాయని ఎక్స్ వేదికగా కేటీఆర్ నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో ఆందోళనకర స్థాయికి చేరిన రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితులపై బీఆర్‌ఎస్ పార్టీ 9 మందితో కూడిన అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో నెలకొన్న దుర్భరమైన పరిస్థితులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ మంత్రికి, వ్యవసాయ కమిషన్‌కు, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నివేదికను అందజేస్తుందని కేటీఆర్ తెలిపారు. రెండు వారాలపాటు విస్తృతంగా పర్యటించి రైతు ఆత్మహత్యలకు దారి తీస్తున్న ప్రధానమైన కారణాలతోపాటు రాష్ట్రంలో ఏడాది నుంచి వ్యవసాయ సంక్షోభానికి దారితీసిన పరిస్థితులను పరిశీలించి నివేదిక తయారు చేస్తుందని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో సన్న, చిన్నకారు, కౌలు రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటుందని వివరించారు. రాష్ట్ర రైతాంగానికి అనేక హామీలిచ్చి అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే 400 మందికి పైగా రైతన్నలు ఆత్మహత్య చేసుకున్న ఆందోళనకర పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన రైతు రుణమాఫీ కనీసం 30 శాతాన్ని దాటకపోవడం, రైతన్నలకు కొన్ని సంవత్సరాలుగా అందుతున్న రైతుబంధును ఆపి, ఇస్తామన్న రూ.15 వేల రైతు భరోసాను కూడా ఎత్తగొట్టడం వంటి ప్రధానమైన ఆర్థిక సమస్యలు రైతు ఆత్మహత్యలకు దారితీస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు సరఫరా, సకాలంలో సాగునీటి వసతి కల్పించే విషయంలో సరారు పూర్తిగా చేతులెత్తేయడంతోనే రైతులు తీవ్ర సంక్షోభంలో కురుకుపోతున్నాని ఆవేదన చెందారు. కాంగ్రెస్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్లే రాష్ట్ర వ్యవసాయ రంగం పూర్తిగా చిన్నాభిన్నమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేలా ప్రధాన ప్రతిపక్షంగా తమ వంతు పాత్ర పోషించాలనే సదుద్దేశంతోనే ఈ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసినట్టు కేటీఆర్ తెలిపారు. విస్తృత పర్యటనలు, అధ్యయనం తర్వాత పార్టీ తరఫున రూపొందించే ఈ నివేదిక ప్రభుత్వానికి అందజేసి రానున్న బడ్జెట్ సమావేశాల్లో రైతుల సమస్యలపై వారికి ఇచ్చిన హామీల అమలుపై, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.





