పంచాయతీరాజ్, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాలు
గత ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసింది.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు కొలువులు ఇవ్వడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టామమని తెలిపారు. రవీంద్రభారతిలో నిర్వహించిన ‘ప్రజాపాలనలో కొలువుల పండగ’ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు కారుణ్య నియామకాలను చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి చేతులమీదుగా నియామక పత్రాలను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, పురపాలక శాఖలో మొత్తం 922 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఇందులో పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో కారుణ్య నియామకాల కింద 582 జూనియర్ అసిస్టెంట్లు, మిషన్ భగీరథ శాఖలో 55 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 27 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో 38 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 55 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ల నియామకం జరిగింది.
ఈసందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పదేండ్ల నిరీక్షణకు సీఎం రేవంత్ రెడ్డి తెరదించారు. పంచాయతీ రాజ్ శాఖలో వివిధ హోదాల్లో హోదాల్లో పనిచేసి చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు ఇవ్వడము చాలా సంతోషకరంగా ఉంది. యువతను ప్రోత్సహించే సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నో ఏళ్లుగా పుట్టెడు దుఃఖం నుంచి కూడా కొలువుల కోసం ఇక్కడికి వచ్చిన మీ అందరికీ అభినందనలు. తెలంగాణ ఉద్యమమే ఉద్యోగాల కోసం పుట్టింది. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది యువకులు అమరులయ్యారు. తెలంగాణ వొచ్చిన తర్వాత కూడా ఉద్యోగాల కోసం ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో కేవలం 81 వేల ఉద్యోగాలనే భర్తీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగ ఖాలీల భర్తీపై గత ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేసే ఉంటే ఎంతోమంది ప్రాణాలు దక్కేవి. ఇందిరమ్మ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నియామకాలపై దృష్టి సారించారు.
గత ప్రభుత్వం యువతకు ఆశలు చూపారు తప్ప కొలువు ఇవ్వలేదు. కెసిఆర్ కుటుంబ సభ్యులు ఖాలీగా ఉంటే రాజకీయ ఉద్యోగాలిచ్చారు తప్ప యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఒక్క సంవత్సరంలోపే 57 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. నిరుద్యోగుల్లో గూడు కట్టుకున్న నిరాశను తొలగించాం. యువతను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వ విభాగాల్లో ఎక్కడ ఖాలీలు ఉన్నా వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తున్నాం 2018 నుంచి 2023 వరకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. పేపర్ లీకేజీలతోనే కాలం వెళ్లదీశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అన్ని ఖాలీలను భర్తీ చేస్తున్నారు. ఉద్యోగ నియామకాలను ఒక యజ్ఞం గా పూర్తి చేస్తున్నారు.
పంచాయతీరాజ్ శాఖలో 10 సంవత్సరాల తర్వాత కారుణ్య నియామకాలు చేపడుతున్నాం. కుటుంబ పెద్దన కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉద్యోగాల కోసం మా దగ్గరికి వొస్తే.. నేను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లాను. పెద్దదిక్కును కోల్పోయి పుట్టెడు ఉన్న కుటుంబాలను ఆదుకునే బాధ్యత తమదని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే కారుణ్య నియామకాలను తక్షణమే భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల కొంత ఆలస్యమైంది. తొందరగా మీ చేతుల్లో నియామక పత్రాలు పెట్టి మీ ముఖాల్లో సంతోషం చూడాలనే తలంపుతో యుద్ధప్రాతిపదికన నియామక పత్రాలు అందజేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసి మీ కుటుంబానికి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు.