భూ భారతి చట్టం ప్రకటనపై బీఆర్‌ఎస్ నోటీసులు
రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి పేరుతో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో భూ భారతి చట్టంపై వివిధ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు గుప్పించింది. దీనిపై బీఆర్‌ఎస్ పార్టీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. శాసనసభ హక్కులను రక్షించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కోరింది. డిసెంబర్ 19న దినపత్రికల్లో చట్టానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చిందని, ఆమోదం పొందని బిల్లును చట్టంగా ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికల్లో భారీ ప్రకటనల ద్వారా ప్రజలను ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని పేర్కొంది. శాసనసభలో చర్చ దశలో ఉన్న బిల్లును చట్టంగా పేర్కొనడంతో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 245 ప్రకారం సభా హక్కులకు హాని జరిగిందని తెలిపింది.
కాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ‘భూ భారతి’తో రెవెన్యూ రికార్డుల నిర్వహణలో అనేక మార్పులు జరగనున్నాయి. రాష్ట్రంలోని ప్రతి భూ కమతానికి ఆధార్ తరహాలో ‘భూదార్’ నంబర్‌ను కేటాయించనున్నారు. ఇకపై భూ క్రయవిక్రయాలు జరిపే సమయంలో ముందుగా ఆ భూమిని సర్వే చేయించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ధరణి పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ‘ఇన్‌స్టెంట్ మ్యుటేషన్’ను కొ త్త చట్టంలోనూ కొనసాగించారు. క్రయవిక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మ్యుటేషన్ కూడా పూర్తవుతుంది. కానీ, వారసత్వంగా జరిగే భూముల బదిలీ (ఫౌతీ)లో కొత్త నిబంధన తీసుకొచ్చారు. తహసిల్దార్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ జరిగినా.. మ్యుటేషన్ చేసే అధికారాన్ని మాత్రం ఆర్డీవోకు అప్పగించారు. నిర్ణీత కాలంపాటు (30 రోజులు) మ్యుటేషన్ చేయకుండా నిలిపివేస్తారు. ఆలోగా ఆ భూమి పై ఎలాంటి ఫిర్యాదులు రాకపోతే ప్రక్రియ పూర్తి చేస్తారు. కోర్టు ద్వారా వొచ్చే, ఓఆర్సీ, 38-ఈ తదితర మొత్తం 14 రకాల భూమి హకులపై మ్యుటేషన్ అధికారాలను ఆర్డీవోకు కట్టబెట్టారు.
రైతుల సమస్యలపై బిఆర్‌ఎస్ నిరసనలు
ఆకుపచ్చ కండువాలతో అసెంబ్లీకి..
ఆటో డ్క్రెవర్లకు మద్దతుగా ఖాలీ చొక్కాలతో బుధవారం అసెంబ్లీకి వెళ్లిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. గురువారం ఆకుపచ్చ కండువాలతో అసెంబ్లీకి హాజరయ్యారు. రైతు సమస్యలపై మండలి, శాసన సభలో చర్చించాలంటూ బీఆర్‌ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సహాయం అందక, రుణమాఫీ కాక, అన్ని పంటలకు బోనస్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఈ యాసంగికి వానాకాలంతో కలిపి ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సహాయం అందించాలి. రూ.2 లక్షల వరకు రైతులందరికి రుణమాఫీ చేయాలని, అన్ని పంటలకు వెంటనే బోనస్ చెల్లించాలని కోరింది. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్యేలు ఆకుపచ్చ కండువాలతో సమావేశాలకు హాజరయ్యారు. కాగా, బీఆర్‌ఎస్ నేతలు రోజుకో సమస్యతో శాసనసభకు వొస్తున్నారు.