నేడు నగర వాతావరణంలో పక్షుల మనగడ కష్టమవుతోంది. ప్రశ్నార్ధకంగానూ మారుతోంది. ఇప్పటికే అనేక రకాల పక్షులు నగరాల్లో కనుమరుగయ్యాయి. అయితే పావురాలకు మాత్రం ఇది వర్తించదు. పల్లె ప్రాంతాల్లో కన్నా నగరా ల్లోనే మనం పావురాలను ఎక్కువగా చూస్తాం. సిటీస్‌లో వాటికి నీరు, ఆహారం అందుబాటులో ఉంటాయి. వాటిని చంపితినే జంతువులు దాదాపు ఉండవు. ఉన్నా చాలా తక్కువ. వీటికి తోడు ఎత్తయిన బిల్డింగులు, కిటికీలు, పైకప్పులు, వంతెనలు, ఫ్లైఓవర్లు, గోదాములు..ఇలా ఒకటేంటి, అవి నివసించడానికి ఎన్నో అనువైన ప్రదేశాలున్నాయి. అయితే, మెట్రో సిటీస్‌లో వీటి సంఖ్య పెరగటం మనుషులకు ప్రమాదంగా పరిణమిస్తోంది. పావురాల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను పరిగణనలోకి తీసుకున్న పుణె మున్సిపల్ కార్పొరేషన్, వాటిని పోషించే వారిపై చర్యలు ప్రారంభించింది. పావురాల రెట్టలు, ఈకలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. వీటితోపాటు చర్మ సమస్యలు, అలర్జీలు, సైనసైటిస్ ప్రమాదం పెరుగుతుంది. కానీ, ఏదైనా ఒక జీవి జనాభా విపరీతంగా పెరిగితే అది పర్యావరణంపైనా ప్రభావం చూపుతుంది. పావురాల సంఖ్య పెరగడం పర్యావరణంలో అసమ తుల్యతకు సంకేతం. పావురాలు స్థానిక జాతులే. ఇళ్లలో పెంచుకోవడానికి పావురాలను మనుషులు అడవుల నుంచి గ్రామాలు, పట్టణాలకు తీసుకొచ్చారు. అంతకు ముందు అవి కొండా కోనల్లో తిరుగుతూ, పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య గూళ్లు పెట్టుకుని జీవించేవి. చిన్న చిన్న పురుగులు, పండ్లు తిని బతికేవి.
వీటి రెట్టల ద్వారా పండ్ల విత్తనాలు అడవి అంతటా వ్యాపించేవి. కానీ, ఇప్పుడు పక్షులకు అడవులలో తిండి సరిగా దొరకడం లేదు. పావురాలను డేగలు, గద్దలు వేటాడి చంపి తింటుంటాయి. తోడేళ్లు, నక్కలకు కూడా ఇవి చాలా ఇష్టమైన ఆహారం. తరచూ మనుషులు కూడా వీటిని వేటాడుతుంటారు. ఇంతకు ముందు ఈ పక్షులు అడవుల్లో చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు చాలా తగ్గాయి. నగరాల్లో వీటికి శత్రువులు పెద్దగా లేకపోవడం, రక్షణ ఎక్కువగా ఉండటం వాటి సంఖ్య పెరగడానికి కారణమైంది. పైగా ప్రజలు వాటికి తిండిగింజలు వేస్తూ వేటాడే శ్రమను తగ్గిస్తున్నారు. దీంతో సహజంగానే సంతానోత్పత్తి సులభమవుతోంది. పౌల్ట్రీలలో కోళ్లు పెరిగినట్లే, ఇక్కడ పావురాలు కూడా పెరుగుతున్నాయి. నగరాలు పెద్ద పౌల్ట్రీ ఫామ్ గా మారాయి. పావురాల సంఖ్య పెరిగేకొద్దీ ప్రకృతిలోని ఇతర జీవులపై దాని ప్రభావం పడుతుంది. ఇవి తమకంటే చిన్నసైజులో ఉండే పిచ్చుకల్లాంటి వాటిని వేధిస్తుంటాయి. అవి కట్టుకున్న గూళ్లను ఆక్రమిస్తుంటాయి. వాటి ఆహారాన్ని తినేస్తాయి. దీనివల్ల ఆహారపు కొరతతో చిన్నపక్షులు నశిస్తుంటాయి. ఒక్క పావురానిదే కాదు, ఏ పక్షి మల మూత్రాలైనా మన చుట్టూ ఎక్కువగా ఉంటే, అవి మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.
ఇక, పర్యావరణంలో పావురాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, అవి పెద్ద సంఖ్యలో పెరగడం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఏ ప్రదేశంలో ఎన్ని పక్షులు నివసించాలి అన్నదానిపై ఒక నిర్దిష్ట పరిమితి ఉంది. ఒక రకం జీవరాశి అధికంగా పెరిగితే, దానివల్ల ఇతర జీవులకు లభించే ఆహారం, నివాసం, ఎగిరే స్థలం తగ్గుతాయి. అది వాటి జనాభా విూద ప్రభావం చూపిస్తుంది. పావురాలు అన్ని పరిస్థితులను తట్టుకుంటాయి. కొన్ని ఇతర పక్షుల మాదిరిగా కాకుండా, ఏ సమయంలోనైనా గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేయగలవు. నివాసానికి అనుకూల స్థలం, పుష్కలంగా ఆహారం, వేటాడే జంతువులు లేకపోవడంలాంటివి పావురాలు విపరీతంగా పెరగడానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు నగరాలలో చాలా ప్రాంతాలను పావురాలు ఆక్రమించినట్లు కనిపిస్తుంది. వీటి కారణంగానే కాకులు, పిచ్చుకల్లాంటి కొన్ని పక్షులు కనిపించకుండా పోతున్నాయి. అయితే పావురాల సంఖ్య పెరగడం వల్లే ఇతర పక్షుల తగ్గిపోతున్నాయని చెప్పడం పూర్తిగా నిజంకాకపోవొచ్చు. పట్టణీకరణతోపాటు, మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా ఇలాంటి పక్షులు కనుమరుగవుతున్నాయి. ఈ రెండింటిలో ఏది ఎంత వరకు కారణమన్నదాన్ని పరిశోధించాల్సి ఉంది.