” బతుకమ్మ సంబురాలలో… తెలంగాణ స్త్రీలు తొమ్మిది రోజులు బతుకమ్మ పూలను పేర్చినట్టే, మన ఆడోళ్లు తీరొక్కతీరుగ ఒక్కొక్క నగ ఏసుకుంటూ సింగారించుకుంటేనే పండుగకు పానం వస్తుంది .అదే మన తెలంగాణ సంస్కృతి గొప్పతనం!.బతుకమ్మ పండుగ దగ్గర పడుతాంది. తెలంగాణ పల్లె పల్లెన రంగురంగుల పూలు పల్కరించేటి సంబురం. కట్లఫూల కాన్నించి గుమ్మడి పూల సంబురం. పూల పండుగ అనేదోటి వున్నదంటే మన తెలంగాణలనే! బతుకమ్మ పండుగచ్చిందంటె సాలు ఎంగిలిపూల బతుకమ్మ నుంచి మొదలు మన ఆడోళ్ళ అలంకారాలు శెప్పవశం గాదు.”
మొగానికి అందం
నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు, తలల నిండా పూలు, జడల పొడుగూతా బంతిపూలు, ముక్కుకు మెరిసేటి ముక్కుపుడక. ఇది లేకుంటే తెలంగాణ ఆడిబిడ్డ అలంకారం పూర్తే కాదు.
మెడల అందాలు – ఆభరణాలు
– *నల్లపూసలు:* ప్రతి ముత్తైదువ మెడల తప్పనిసరిగా ఉండేది. పెనిమిటీ ఆయుష్షు కోసం.
– *కాసుల పేరు:* బంగారు కాసులతోని చేసిన పెద్ద హారం. పండుగ నాడు మెడలేసుకుంటే లక్ష్మీదేవిలా కనిపిస్తారు.
– *చంద్రహారం, సూర్యహారం:* ఎదమీద జిలుగులీనుతుంటాయి.
నడుముకి, చేతులకు
– *వడ్డాణం:* సన్నటి నడుముకి వడ్డాణం పెడితే ఆ సొగసే వేరు. మన కవులు వర్ణించింది ఈ అందాన్నే!
– *గాజులు, కడియాలు:* చేతుల నిండా ఎరుపు, ఆకుపచ్చ గాజులు, మట్టి గాజులు గలగలమంటుంటేనే పండుగ సందడి.
– *మట్టెలు, కడాలు:* కాళ్ళకు మట్టెలు, కాలి కడియాలు.
చీరలు, రవికెలు
పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట పట్టు చీరలు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల చీరలకు కుచ్చుల రవికెలు, అద్దాల రవికెలు. ఈ అలంకారాలకు తోడు ఒకనాటి అలంకారాల వివరాలు తోడయితే బతుకమ్మ సంబురాలు సూడతరం గాదుల్లా! మునుపు మన తెలంగాణ పల్లె పట్నాల పొంటి అవ్వల్ దర్జాగ ఎలిగే కాలంల గోల్కొండ తాన రత్నాలు బజాట్ల కుప్పలు బోషి అమ్మేదట! తీరొక్క ముత్యాలంటే మన తాన చార్మినార్ అంగటికి అచ్చేటోళ్ళంట! ఎక్కువ, తక్కువ లేకుంట అన్ని కులపోళ్ళ పండుగలత్తె తీరొక్క నగలు యేసుకునుట్ల జరంత షాన్ గనే వుండేటోళ్ళంట! గీ నగల ముచ్చట జెప్పుకునుడంటే ఒల్లెక్కాల కత గాదు! గాటి పేర్లన్ని జెప్పుడు యెవలి వశం గాదుల్లా!
ముక్కు పుడ్క ముచ్చట్లు
ముక్కుకు బెట్టుకునేటి ముత్తెంతదాన్ని ముప్పయితీర్ల పుసుక్కున గిట్ల లేకుంటే పబోజనం పోవుడే లేదంట. ఇంట్ల, బయిట యె సొంటి పబోజనమైనా ముక్కుపోగు లేకుండా అది జేస్తే అవ్వ కూకోదట. ముక్కుకు ముక్కెర ఉండాలనేది రివాజు! ఈ కాలం షాన్ బడేటోళ్ళు ముక్కుపుడక, ముక్కుపోగు అని పిల్వబట్టిండ్లు. ముక్కుకు బులాకీలు ఘ ఉండేయట.
జడ, కొప్పు నగలు
ఎంటికలున్న అవ్వ యెసొంటి కొప్పేసిన అందంగ ఉంటది మాగనే గని, కొప్పెక్కి కూసునే నాగరం, శిగబిళ్ళ, సూర్యచంద్రులు, రాకిడి, చంద్రవంక, పింపిణి, జడకుచ్చులు, జడ బంగారు సవరకుప్పె, బంగారు మొగ్గలు, రాళ్ళు పొదిగిన పాపిట బొట్టు పేరు, హంస పిన్నులు ఇంక శాన్నే ఉండేటి యంటరు.
చెవుల నగలు
చెవులకు బుగిడీలు, బావులీలు, తణుకులు, గువ్వపోగులు, కమ్మలు, గంటీలు, గున్నాలు, చెంపసవరాలు, ముత్యాల గొలకలు ఉండేయి. చెవులు సల్లగుండ, చెవు కాన్రాకుంట తీరొక్క వన్నెలుండేటియి.

చేతుల నగలు
వజ్రాలు, కెంపులు, చేతులకు కడియాలు, కంకణాలు, వొడి గొలుసులు, పోంచీలు, గిలిగాజులు జరంత వున్నోళ్ళింట కానచ్చేటియి. సరించి రవ్వలు, ముత్యాలు పొదిగిన గాజులు, ఉంగరాలు, ముంజేతుల పైకి వొంకు, దండ కడియాలు, నాఫణి, చేతి పురులు, చౌకట్టు, ఒడ్డె కొంకులు ముఖ్డెం.
నడుము, కాళ్ళ నగలు
నడుముకు వొడ్డాణం, గజ్జెలు, గంటలు, బిళ్ళలతో సింగారిచ్చుకునేటోళ్ళు. గాటిమీద శాందారు నగీషి పనితనం ఉండేది. మొలకట్లని, మొలనూళ్ళని వీటిని పిలిచేదట! మన వొయ్యిలల్ల కవులు దునియా మొత్తంల మనతాన ఆడోళ్ళ నడుం సన్నగుండేదని, గాళ్ళు అందంగా కానచ్చేది గిట్ల నడుంకు బెట్టె వడ్డాణాల జేబట్టేనని గా కాలం కవులు రాసిన వర్ణనలు మస్తుగుండేది. కాళ్ళకు కడియాలు, కాకరకాయ, తుమ్మకాయ గొలుసులు, పాంజీబులు, తొడాలు ఉండేవి. వివాహితులు మాత్రం కాలి రొండో యేలికి మట్టెలు తొడుగుతారు. ఎంత లేమయినా కనీసం కంచువైనా సరే మట్టెలు బరాబరి ఉండేటియట! పెండ్లి గాని ఆడిపిలగాండ్లు పెద్దేలికి తగిలించే నగను ‘పిల్లాండ్లు’ అంటరు.
మెడమీదీ ఆభరణాలు
అభరణాల్లో మెడలేసుకునేటియంటే జోరుగనే జెప్పుకోవాలె! పెండ్లికి ముందు అమ్మాయికి మెడలో ‘తీగ’ పెట్టి వాళ్ళ పిల్లని అనిపించుకుంటరు. అదే ‘కంటె’ అంటే రాళ్ళకంటె, ముత్యాల కంటె, బంగారు కంటె అన్ని రకాలు. మళ్ళ బంగారు కంటెలో రకాలు: ‘తుస్సె’ – ఇది బంగారు గజ్జెలు చుట్టిన నగిషీ బిళ్ళలు అమర్చిన నగ. ఇంకా నగ, నాను, పట్టెడ, జోమాలదండ, యాకళ్ళరం, పచ్చట దండ, ఒంటి గజ్జె, ముత్యాల హారాలు, తాయిత్తలు, చిలుకలపేరు, నవరత్నాల దండ, కాసుల పేరు, బన్సరం, పొట్లపూస దండ, చంద్రహారం, సూర్యహారం, గుండ్లటెక్కి, గుండ్ల పేరు, చింతాకు పతకం, లవంగాల దండ, గుమ్మడి గింజల పేరు, జతగుండ్లు, మొగ్గలదండ, తావళం, నానుపతకం, ఇవన్నీ బంగారు కంఠాభరణాలు. సిరి గల్లోళ్ళు రత్నాభరణాలు, వజ్రాల పొదుగులు, తలచిక్కులు, కొప్పు గొలుసులు వాడేవారు. ఉన్నోళ్ళు లేనోళ్ళనేది లేకుంట ముత్తయిదువలందరూ తప్పనిసరిగా ధరించేది నల్లపూసల దండ. గదేసుకుంటే పెనిమిటి ఆయుషు మంచిగుంటదని మనతాన నమ్మకం. గదింకా మన తెలంగాణా ప్రాంతాలల్ల ఇంకా వున్నది.
చీరెలు, రైకల ముచ్చట్లు.
నిజాం రాజ్జానికి ముందునుంచే మన తాన పట్టు చీరలకు మన తెలంగాణ పెట్టింది పేరు. పీతాంబరం, ముత్యాల పందిళ్ళు, శ్రీ వన్నాలు, దూకూలాలు, మగ్గాండు చీరలు, గువ్వకన్నంచులు, రుద్రాక్ష అంచులు, బొమ్మంచులు, అత్తకోడల్ల చీరలు, కళావతులు, ఉడ్తపట్టెలు, జింక చాళ్ళు, పులిచాళ్ళు, కలినేతలు, జలతారు మళ్ళు, కోలుకొమ్మలు, బిల్లసాల్లు, చిలుకల వన్నెలు, గంగసరాలు, అంచపట్టులు, మెకాలవేటలు, జరీపూలు, చుక్కల చీరలు, అద్దకాల చీరలు, గట్టెఅంచులు, సంహాసనాలు, సింహాసనాలు (ఇవి పూర్తిగా జరీముద్దలు). అంచు ఒకవైపు బంగారుపూత పూసిన వెండి జరీ, మరోవైపు పట్టుమాత్రమే కానత్తది.
రైకల ముచ్చట్లు జెప్పుకుంటే గనుక తీరొక్క నగిషీల దారాలు, అద్దాల, శెమ్కీల రవికెలతోని ఆ కాలం ఆడోళ్ళ షాన్ అవ్వల్ గుండేది. అద్దాల రవికెలు, పోత రవికెలు, కసీదు కట్టు రవికెలు, జంగణ్ణ రెక్కలు కుట్టిన రవికెలు, పూసల రవికెలు, చాళ్ళు, అంచులు, హంసలు, చిలుకలు, వరుసలు, అషరిణీలు, అక్షింత కుట్లు… కుట్టిన అపురూపమైన తీరొక్క రైకలెన్నో తెలంగాణ ఆమ్మలక్కల పండుగ సంబురాలను జూపుతయి. గీ తొమ్మిది దినాలు ఆడోళ్ళను మందలిచ్చే వశం గాదుల్లా! ఆడోళ్ళ పండుగ గీ తీర్గ దునియా మొత్తంల యేడ కాన్రాదు.. దేనికైనా పండుగ పబ్బాలల్లనే కాదు ఆడోళ్ళను గౌరవిచ్చేటి సాంప్రదాయం మనకాడనే వుంటది..





