ప్రజావైద్యానికి బకాయిల ఉరితాడు!

హైదరాబాద్‌ ప్రముఖ ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానకు వైద్య పరికరాల సరఫరాదారులు సాధారణ సరఫరాలను నిలిపివేసి, కేవలం అత్యవసర అవసరాలకు మాత్రమే పరిమితం చేశారనే వార్త తీవ్ర ఆందోళన కలిగించేది . తెలంగాణ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక్క ఎంఎన్‌జే హాస్పిటల్ కే సుమారు రూ.130 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానలకు ఆరోగ్యశ్రీ సంబంధిత బకాయిలు రూ. 600 కోట్లు దాటగా, అందులో హైదరాబాద్ పరిధిలోని హాస్పిటల్స్  బకాయిలే రూ. 250 కోట్ల వరకు ఉన్నాయని తెలుస్తుంది . పేద ప్రజలకు అత్యాధునిక క్యాన్సర్ చికిత్సను ఉచితంగా అందించే ఒక ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థలో ఇటువంటి నిలిపివేతలు చోటుచేసుకోవడం రాష్ట్ర వైద్యారోగ్య రంగం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభానికి అద్దం పడుతున్నది . క్యాన్సర్ చికిత్సలో నిరంతరాయంగా మందులు, శస్త్రచికిత్స పరికరాలు, ప్రత్యేక వైద్య సామగ్రి అందుబాటులో ఉండాలి. సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడితే పేద రోగుల చికిత్స ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకంలో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ సరఫరాదారులకు క్షేత్రస్థాయిలో సరఫరాదారులకు చెల్లింపులు జరగకపోవడానికి, బకాయిలు పేరుకుపోవడానికి బడ్జెట్ నిర్వహణలో, పరిపాలనా విధానంలో ఉన్న కొన్ని ముఖ్యమైన సాంకేతిక, వ్యవస్థాగత లోపాలే ప్రధాన కారణం. ప్రభుత్వం బడ్జెట్‌లో ఒక రంగానికి నిధులు “కేటాయించడం” వేరు, ఆర్థిక శాఖ నుండి వాస్తవంగా “నగదు విడుదల” చేయడం వేరు. బడ్జెట్ ఆమోదం పొందినప్పటికీ, ప్రభుత్వ ఖజానాలో తగినంత నగదు లభ్యత లేనప్పుడు ఆర్థిక శాఖ బిల్లుల విడుదలను హోల్డ్‌లో పెడుతుంది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కోసం నిధులను నేరుగా హాస్పిటల్స్  కు ఇవ్వదు; “రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్”కు విడుదల చేస్తుంది. ఈ నిధులు ముందుగా ప్రభుత్వ బోధనా హాస్పిటల్స్  ఖాతాలకు వెళ్తాయి. అక్కడ హాస్పిటల్  అభివృద్ధి సొసైటీలు అంతర్గత పరిపాలనా ఖర్చులు, ఇతర అత్యవసర మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇచ్చి, సరఫరాదారుల పాత బిల్లులను క్లియర్ చేయడంలో ఆలస్యం చేస్తున్నాయి. తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్ఐడీసీ) ద్వారా జరిగే మందులు, పరికరాల కొనుగోళ్లకు సంబంధించి నిధులు విడుదలైనా.. బిల్లుల వెరిఫికేషన్, క్వాలిటీ చెకింగ్, ఆడిటింగ్ ప్రక్రియల్లో తీవ్రమైన రెడ్ టేపిజం, పరిపాలనా ఆలస్యం  వల్ల సరఫరాదారుల చేతికి డబ్బులు చేరడం లేదు.

ప్రభుత్వ తాజా స్పందనలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) లేదా లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ)లను వేగంగా ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ, ఇవి కేవలం ప్రత్యేకంగా సిఫార్సు చేయబడిన ఒకరిద్దరు రోగుల తక్షణ చికిత్సకు మాత్రమే పనికొస్తాయి తప్ప, గత రెండేళ్లుగా సరఫరాదారులు పెండింగ్‌లో పెట్టిన కోట్ల రూపాయల బల్క్ బిల్లులను క్లియర్ చేయడానికి ఈ నిధులు సరిపోవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసే నిధులు ప్రస్తుత అవసరాలకే సరిపోతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా (2022 లేదా 2024 నుండి) పెండింగ్‌లో ఉన్న బకాయిలను ఒకేసారి క్లియర్ చేయడానికి ప్రత్యేకమైన నిధుల విడుదల జరగకపోవడంతో పాత బకాయిలు అలాగే పేరుకుపోతున్నాయి.

ప్రభుత్వాలు బడ్జెట్లలో వైద్య రంగానికి భారీగా నిధులు కేటాయించామని ప్రకటించడం మాత్రమే సరిపోదు. ఆ కేటాయింపులు సకాలంలో విడుదలై, క్షేత్రస్థాయిలో సరఫరాదారులకు అందుతున్నాయా లేదా అన్నది పర్యవేక్షించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంది. ఎంఎన్‌జే వంటి ప్రత్యేక హాస్పిటల్స్ కు  నిరుపేదలు, మధ్యతరగతి రోగులు దూరప్రాంతాల నుండి ప్రాణాల మీద ఆశతో వొస్తుంటారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు ఇచ్చే కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలు లేదా శస్త్రచికిత్సలకు అవసరమైన మందులు, సర్జికల్ పరికరాల సరఫరాలో చిన్న అంతరాయం ఏర్పడినా అది నేరుగా రోగుల ప్రాణాల మీదకు వొస్తుంది. సరఫరాదారులు కేవలం అత్యవసర సేవలకు మాత్రమే పరికరాలు ఇస్తామని చెప్పడం తాత్కాలిక ఉపశమనమే కావొచ్చు కానీ, దీర్ఘకాలికంగా ఇది వైద్య సేవలను కుంటుపరుస్తుంది. సాధారణ వైద్యం కోసం వేచి చూసే రోగుల పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది.

ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 600 కోట్లు దాటడం అనేది కేవలం అంకెలకు సంబంధించిన విషయం కాదు, అది వేలాది మంది రోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించిన సమస్య. నిధుల కొరత నెపంతో సరఫరాదారులు చేతులెత్తేస్తే, ప్రభుత్వ దవాఖానా లు  మందులు లేని ఖాలీ  భవనాలుగా మారే ప్రమాదం ఉంది. నిధులు విడుదల కాకపోవడానికి, బడ్జెట్ కేటాయింపులు కాగితాలకే పరిమితం కావడానికి గల కారణాలను ప్రభుత్వం తక్షణమే సమీక్షించాలి. అత్యవసర చికిత్సలకు అవసరమైన పరికరాల నిల్వలు ప్రస్తుతం హాస్పిటల్స్ లలో ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి? ఒకవేళ కొరత ఏర్పడితే ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఏమిటి? అనే అంశాలపై వైద్యారోగ్య శాఖ శ్వేతపత్రం విడుదల చేయాలి.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సరఫరాదారుల సంఘంతో అత్యవసర చర్చలు జరపాలి. పెండింగ్ బకాయిల పరిష్కారానికి ఒక స్పష్టమైన కాలపరిమితిని (టైమ్ లైన్) ప్రకటించాలి. బకాయిల్లో కనీసం సగభాగాన్ని తక్షణమే విడుదల చేసి, మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా చెల్లించేలా హామీ ఇవ్వడం ద్వారా సరఫరాదారులలో నమ్మకాన్ని పునరుద్ధరించవొచ్చు. అప్పుడే హాస్పిటల్స్ కు  సాధారణ సరఫరాలు యథావిధిగా పునరుద్ధరించబడతాయి. ప్రజారోగ్యం అనేది ప్రభుత్వాల ప్రాథమిక విధి. ఆర్థిక మేనేజ్‌మెంట్ లోపాలు పేదవాడి ప్రాణ సంకటంగా మారకూడదు. ముఖ్యమంత్రి, ఆర్థిక , వైద్యారోగ్య శాఖ మంత్రులు ఉమ్మడిగా దృష్టి సారించి ఎంఎన్‌జే , ఇతర ప్రభుత్వ దవాఖానల  బకాయిల సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజాస్వామ్య సమాజం కోరుకుంటున్నది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *