“విద్యార్థి ఉద్యమాల నుంచి ఎదిగిన నాయకుల చిత్రాలను కార్యాలయాల్లో పెట్టుకునే అధికారులు, నేటి విద్యార్థులు తమ ముందుకు తెచ్చే ప్రశ్నలను ఏ దృష్టితో చూస్తున్నారు? శాంతియుతంగా ప్రశ్నించిన విద్యార్థులపై పోలీసు కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్న ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించాలి. అటువంటి బెదిరింపుల ప్రభావం ఒక విద్యార్థికే పరిమితం కాదు. సమస్య తెలిసినా మాట్లాడితే ఇబ్బంది ఎదురవుతుందనే భావన అతని సహచరుల్లోనూ ఏర్పడుతుంది. భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం, శాంతియుతంగా సంఘటితం కావడం రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామిక స్వేచ్ఛల్లో భాగం. నిరసన సందర్భంగా ఏదైనా నిర్దిష్ట ఉల్లంఘన జరిగిందని పాలకవర్గం భావిస్తే, దానిపై ఆధారాలతో విచారణ జరిపి సంబంధిత విద్యార్థుల వివరణ వినాలి..”
వసతి, ఫీజులు, పరీక్షల సమస్యలపై విద్యార్థుల గొంతు వినాలి. ప్రశ్నించే స్వేచ్ఛను కాపాడాలి.
నలంద, తక్షశిల వంటి ప్రాచీన విద్యాకేంద్రాల నుంచి నేటి విశ్వవిద్యాలయాల వరకు జ్ఞానాన్వేషణలో చర్చకు, పరిశోధనకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ వంటి విశ్వవిద్యాలయాలు విద్యా, సామాజిక రంగాల్లో నిర్మాణాత్మక పాత్ర పోషించాయి. వాటి ప్రాంగణాల్లో సాగిన చర్చలు విద్యార్థులకు సమాజాన్ని అర్థం చేసుకునే అవకాశం ఇచ్చాయి. విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగిన అనేకమంది తర్వాత రాష్ట్ర, దేశ రాజకీయాల్లో నాయకత్వం వహించారు. తమ చుట్టూ ఉన్న సమస్యలను గమనించడం, వాటిపై స్పందించడం, పరిష్కారం కోసం ఇతరులతో కలిసి పనిచేయడం వారికి విశ్వవిద్యాలయ జీవితంలోనే అలవడింది. ఆ సంప్రదాయం నేడు ఎంతవరకు కొనసాగుతున్నదో పరిశీలించుకోవాలి.
విశ్వవిద్యాలయంలో విభిన్న భావజాలాలు సహజం. వాటి మధ్య చర్చ జరిగినప్పుడే విద్యార్థులకు ఒక సమస్యను అనేక కోణాల నుంచి పరిశీలించడం అలవడుతుంది. తమ అభిప్రాయానికి ఆధారాలు చూపడం, ఎదుటివారి వాదన వినడం, తప్పు తెలిసినప్పుడు సరిదిద్దుకోవడం కూడా విద్యలో భాగమే. తరగతిలో పరిశోధనా ప్రశ్నను స్వాగతించే గురువులు, ప్రాంగణంలో విద్యార్థి లేవనెత్తే ప్రశ్ననూ అదే శ్రద్ధతో వినాలి. వసతిగృహంలో చోటు దొరకని విద్యార్థి తన సమస్యను అధికారుల ముందుంచినప్పుడు, అతనితో వారు వ్యవహరించే తీరు కూడా అతనికి ఒక పాఠమే. ఆ అనుభవం అతనిలో ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పెంచుతున్నదా, అధికారం ముందు మౌనంగా ఉండటం నేర్పుతున్నదా అన్నది అధ్యాపకులు ఆలోచించాలి.
సమస్యను పాలన దృష్టికి తెచ్చేదెవరు?
అధ్యాపకులు తమ సమస్యలను సంఘాల ద్వారా పాలకవర్గం దృష్టికి తీసుకెళ్తారు. విద్యార్థులకూ తమ సమస్యలను సమష్టిగా చెప్పుకునే అవకాశం ఉండాలి. వసతి గదులు సరిపోవడం లేదని వినతిపత్రం ఇచ్చినా, ఫీజులపై స్పష్టత కోరుతూ శాంతియుతంగా ధర్నా చేసినా, అందులో ప్రస్తావించిన అంశాలే అధికారుల పరిశీలనకు రావాలి. ఎవరు వినతిపత్రం ఇచ్చారు, ఎవరు కార్యాలయం ముందు నిలబడ్డారు అన్నదే చర్చగా మారితే పరిష్కారం పక్కకు పోతుంది. విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా విశ్వవిద్యాలయానికి అవసరమైన నిధులు, సదుపాయాల అంశాలను ప్రజల ముందుకు తీసుకురాగలవు. పాలకవర్గం ప్రత్యక్షంగా గుర్తించలేని లోపాలను కూడా అవి వెలుగులోకి తేగలవు.
విద్యార్థి ఉద్యమాల నుంచి ఎదిగిన నాయకుల చిత్రాలను కార్యాలయాల్లో పెట్టుకునే అధికారులు, నేటి విద్యార్థులు తమ ముందుకు తెచ్చే ప్రశ్నలను ఏ దృష్టితో చూస్తున్నారు? శాంతియుతంగా ప్రశ్నించిన విద్యార్థులపై పోలీసు కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్న ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించాలి. అటువంటి బెదిరింపుల ప్రభావం ఒక విద్యార్థికే పరిమితం కాదు. సమస్య తెలిసినా మాట్లాడితే ఇబ్బంది ఎదురవుతుందనే భావన అతని సహచరుల్లోనూ ఏర్పడుతుంది. భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం, శాంతియుతంగా సంఘటితం కావడం రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామిక స్వేచ్ఛల్లో భాగం. నిరసన సందర్భంగా ఏదైనా నిర్దిష్ట ఉల్లంఘన జరిగిందని పాలకవర్గం భావిస్తే, దానిపై ఆధారాలతో విచారణ జరిపి సంబంధిత విద్యార్థుల వివరణ వినాలి.
వసతి నుంచి హాల్‌టికెట్ వరకు
నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వసతిగృహాల కోసం విద్యార్థులు నిరసనలకు దిగారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో వసతి సమస్యతో పాటు హాల్టికెట్లలో పేర్ల నమోదు తప్పులను సరిచేయాలనీ, స్వయం ఆర్థిక కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలనీ కోరారు. జేఎన్టీయూలో అర్హులకు వసతి కల్పించాలని, ఫీజుల వసూలులో పారదర్శకత ఉండాలని, అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కో ప్రాంగణంలో సమస్య వేరైనా, ఆయా ఫిర్యాదులను పరిశీలించి విద్యార్థులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకవర్గానిదే. హాల్‌టికెట్‌లో పేరు తప్పుగా నమోదైతే పరీక్ష గడువులోగా దాన్ని సరిచేయాలి. వసతి కొరత ఉంటే ఎన్ని గదులు అందుబాటులో ఉన్నాయో, ఎంతమంది అర్హులు ఎదురుచూస్తున్నారో వెల్లడించాలి.
దూర ప్రాంతాల నుంచి వచ్చి చదివేవారికి వసతి దొరుకుతుందా అన్నది ప్రవేశ నిర్ణయాన్నే ప్రభావితం చేస్తుంది. ఒక కోర్సు విద్యార్థులకు వసతిగృహ సదుపాయం కల్పించలేమని ముందే తెలిస్తే, ఆ వివరాన్ని వెబ్ ఆప్షన్ల దశలోనే వెల్లడించాలి. సీటు ఖరారై, ఫీజు చెల్లించిన తర్వాత వసతి లేదని చెబితే అద్దె, ప్రయాణ ఖర్చులను ఆ కుటుంబం ఎలా భరించాలి? ఒక కోర్సుకు వసతి ఇచ్చి మరో కోర్సుకు ఇవ్వకపోతే అందుకు వర్తించే నిబంధనలు ఏమిటో వివరించాలి. విశ్వవిద్యాలయం ఏర్పడి దశాబ్దాలు గడిచినా వసతి కోసం విద్యార్థులు పదేపదే ఆందోళన చేయాల్సి వస్తున్నదంటే, ప్రవేశాల సంఖ్యకు తగిన మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఎక్కడ లోపం ఉందో సమీక్షించాలి.
స్వయం ఆర్థిక కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలన్న డిమాండ్‌పై కూడా కారణాలతో కూడిన సమాధానం ఇవ్వాలి. ఫీజు ఎంత, దాన్ని ఏ ప్రాతిపదికన నిర్ణయించారు, విద్యార్థికి ఏ సదుపాయాలు అందుతాయి అనే సమాచారం ప్రవేశానికి ముందే అందుబాటులో ఉండాలి. నిధుల కొరత వాస్తవమైతే, ఎంత మొత్తం అవసరమో, ఏ పనులు పెండింగ్‌లో ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. నిధులు కోరుతూ సమర్పించిన ప్రతిపాదనల స్థితినీ విద్యార్థులకు తెలియజేయాలి. పాలకవర్గం ఆ వివరాలను వెల్లడిస్తే, సమస్యకు పరిష్కారం విశ్వవిద్యాలయం పరిధిలో ఉందా, ప్రభుత్వ నిర్ణయం అవసరమా అన్న స్పష్టత వస్తుంది. ప్రజా నిధులతో నడిచే సంస్థల్లో ఈ పారదర్శకత పాలనపై విశ్వాసాన్ని పెంచుతుంది.
అధ్యాపకులకూ విద్యార్థులకూ ఒకే ప్రమాణం
ఉపకులపతికి మద్దతుగా లేదా ప్రభుత్వ జోక్యంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధ్యాపకులు ర్యాలీ నిర్వహించగలిగితే, తమ వసతి, ఫీజులు, పరీక్షల సమస్యలపై విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ చేయడాన్ని ఎలా తప్పుపడతారు? ప్రభుత్వంతో విభేదాలు తలెత్తినప్పుడు ఉపకులపతులు తమ వివరణను నేరుగా ఇవ్వగలరు. ప్రధానాచార్యుడు, రిజిస్ట్రార్, ఉపకులపతి ఎవరూ కలవడానికి సమయం ఇవ్వని విద్యార్థికి మాత్రం తన సమస్యను ఎవరి ముందుంచాలో తెలియదు. వినతిపత్రం స్వీకరించినట్లు రసీదు ఇచ్చి, దాన్ని పరిశీలించే అధికారి ఎవరో, ఎప్పటిలోగా సమాధానం వస్తుందో తెలపడం పాలకవర్గం చేయగల కనీస పని. విద్యార్థి ప్రతినిధులను నిర్దిష్ట వ్యవధిలో కలిస్తే పరిష్కారం కోసం వారు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తగ్గుతుంది.
విద్యార్థి సంఘాలకూ బాధ్యత ఉంది. తాము ప్రస్తావించే సమస్యకు సంబంధించిన వివరాలను సేకరించాలి. విద్యార్థులందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచాలి. చర్చకు అవకాశం వచ్చినప్పుడు తమ డిమాండ్లను స్పష్టంగా చెప్పాలి. అదే సమయంలో పాలనపై విమర్శ చేసిన సంఘాన్ని వ్యతిరేక వర్గంగా ముద్ర వేయడం అధికారులకు తగదు. అధ్యాపకుల మధ్య విభేదాలు, పాలనా పదవుల చుట్టూ జరిగే వివాదాలు విద్యార్థుల సమస్యలను మరుగున పడేయకూడదు. ఫిర్యాదుపై ప్రాథమిక పరిశీలన జరిపి వాస్తవాలు వెల్లడించాల్సిన చోట పరస్పర ఆరోపణలకు దిగితే విశ్వవిద్యాలయ ప్రతిష్ఠే దెబ్బతింటుంది. వ్యక్తుల పట్ల విధేయతను బట్టి విద్యార్థికి తలుపులు తెరుచుకునే సంస్కృతి విద్యాసంస్థలో పెరగకూడదు.
విద్యార్థుల సంఖ్యకు తగిన వసతి కల్పించడం, ప్రవేశ నిబంధనలను ముందుగానే వెల్లడించడం, పరీక్షల సంబంధిత ఫిర్యాదులకు గడువులోగా స్పందించడం వంటి పనులు పాలకవర్గం చేతిలోనే ఉన్నాయి. వసతి కేటాయింపుపై అభ్యంతరం ఉంటే ఎవరికి అప్పీలు చేయాలో విద్యార్థికి తెలియాలి. ఫీజు వసూలుపై సందేహం ఉంటే సంబంధిత ఉత్తర్వు అందుబాటులో ఉండాలి. ఫిర్యాదు చేసిన విద్యార్థికి తర్వాత ఇబ్బందులు ఎదురైతే వాటిని విచారించే మార్గం కూడా ఉండాలి. ఇలాంటి ఏర్పాట్లు అమలులో ఉన్నప్పుడే విద్యార్థి తన సమస్యను చెప్పుకోవడానికి వ్యక్తిగత పరిచయాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. సమస్యల పరిష్కారంలో అధ్యాపకులు, విద్యార్థి ప్రతినిధులు పాల్గొంటే పాలన నిర్ణయాలకు జవాబుదారీతనం పెరుగుతుంది.
విశ్వవిద్యాలయం నేర్పాల్సిన విలువలు దాని పాలనలోనే కనిపించాలి. విద్యార్థి తప్పును ఎత్తిచూపితే దాన్ని పరిశీలించడం, విమర్శకు సమాధానం ఇవ్వడం, లోపం ఉంటే సరిదిద్దుకోవడం ద్వారా గురువులు ప్రజాస్వామ్యాన్ని ఆచరణలో నేర్పగలరు. పదవిలో ఉన్నవారి మెప్పు పొందడమే ఎదుగుదలకు మార్గమనే భావన విద్యార్థుల్లో ఏర్పడితే, దాని ప్రభావం ప్రాంగణం దాటిన తర్వాత కూడా ఉంటుంది. ప్రశ్న అడిగిన విద్యార్థికి మాట్లాడే అవకాశం, వినిపించిన సమస్యకు సమాధానం, అన్యాయం జరిగితే పరిష్కారం లభించే వాతావరణాన్ని విశ్వవిద్యాలయాలు కల్పించాలి. అటువంటి ప్రాంగణాల్లోనే సమాజ సమస్యలను స్వతంత్రంగా అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి బాధ్యత తీసుకునే నాయకత్వం ఎదుగుతుంది.
జవ్వాజి దిలీప్
వ్యవస్థాపక అధ్యక్షుడు, స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం
పరిశోధక విద్యార్థి, జేఎన్టీయూ హైదరాబాద్ · 7801009838





