మళ్ళీ మొదలైన సవాళ్ళ పర్వం

అధికార ప్రతిపక్ష పార్టీలమద్య మరోసారి సవాళ్ళపర్వం మొదలైంది. నువ్వు ఒకటంటే నేను రెండంటా అన్నట్లుగా ఈ పార్టీల నాయకులు ఛాలెంజీలు విసురుకుంటున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒకపక్క హాట్‌హాట్‌గా కొనసాగుతుండగా, వీరి ఛాలెంజీలిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశాలయ్యాయి. రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధిపేట తాజా పర్యటన ఈ రాజకీయ వేడికి కారణమైంది. సిద్ధిపేట సభకూడా ఇంతకుముందు నిర్వహించిన సిరిసిల్ల సభకు ఏమాత్రం తీసిపోనివిధంగానే సాగింది. యధావిది ప్రసంగం. అదే దూకుడు. ఆదే ఆక్రోశం. అవే శాపనార్ధాలు. సభ ఉద్దేశ్యాన్ని లేదా తమ పాలనావిధాన వివరణకన్నా ప్రతిపక్షాలను దోషులుగా నిలబెట్టడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్కువ సమయాన్నికేటాయించిన విషయం తెలియందికాదు. అదే విషయాన్ని సిద్ధిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్‌రావు గుర్తుచేస్తూ, రేవంత్‌రెడ్డి తనతోపాటు కెసిఆర్‌, ‌కెటిఆర్‌ ‌పేర్లను 140 సార్లు ఉచ్చరించి దూషించడం పట్ల ఘాటుగా స్పందించారు.
ప్రతిపక్షాన్ని అధికారపక్షం విమర్శించడమన్నది సహజమే అయినప్పటికీ ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి స్థాయిలోఉన్న రేవంత్‌రెడ్డి వాడిన భాషపైనే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చజరుగుతున్నది. వాస్తవంగా ఇందిరాగాంధి జన్మదినాన్ని పురస్కరించుకుని ‘ఇందిరమ్మ బీమా పథకాన్ని’ ఆవిష్కరించే కార్యక్రమంలో భాగమే ఈసభ. కొత్తగా ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ బీమా  పథకం గురించి ప్రజలకు వివరించడానికన్నా ఎక్కువ సమయాన్ని ఆయన బిఆర్‌ఎస్‌ అ‌గ్రనేతలను విమర్శించడానికే కేటాయించారన్న విమర్శ సర్వత్రా వినిపిస్తున్నది. ముఖ్యంగా సాగునీటి విషయంపైన మాట్లాడుతున్నప్పుడు ‘తాను తెలంగాణ బిడ్డనని, నీటి విషయంలో ఎన్నటికీ అన్యాయం చేయనని’ చెబుతున్న క్రమంలో ఆయన వాడిన పదజాలం  ముక్కున వేలేసుకునేదిగా ఉంది.
‘తూ.. మీదో బతుకా… మెడకు బండకట్టుకుని నీళ్లులేని బావిలోపడి చావండి’ అంటూ బిఆర్‌ఎస్‌ ‌నాయకత్వంపైన తనకున్న ద్వేషాన్ని , ఆక్రోశాన్ని వెళ్ళగక్కడమన్నది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి తగిందికాదన్న విషయంపైన అటు రాజకీయ వర్గాల నుండి ఇటు సామాన్యప్రజల వరకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలన్నప్పుడు ఒకదాన్ని ఒకటి విమర్శించుకోవడంలో తప్పులేదు. కాని, ప్రతిపక్ష నేతల మరణం కోరుకోవడమన్నది సభ్యతకాదు.. ఈ మాటలపై స్పందించిన హరీష్‌రావు రేవంత్‌రెడ్డిని (పర్వర్టెడ్‌) ‌వికృత మనస్థత్వం ఉన్నవాడిగా పోల్చారు. వోటుకు నోటు కేసును ఉద్ఘాటిస్తూ (కోవర్టు) శత్రువుతో చేతులు కలిపినవాడు. వ్యవస్థనుభ్రష్టు పట్టించినవాడిగా పేర్కొన్నారు. అంతేకాదు సొంత  పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలే రేవంత్‌రెడ్డి పాలనకు అద్ధం పడుతున్నాయన్నారు.
ఇటీవల కాంగ్రెస్‌ ‌పాలనపై ఆపార్టీ జడ్‌చర్ల ఎమ్మెల్యే  అనిరుధ్‌రెడ్డి బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేసారు. తమ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో పైసలిస్తేనే పనులు అవుతున్నాయంటూ ఆయన చేసినకామెంట్‌ ‌ప్రభుత్వ పాలనా తీరుకు అద్దంపడుతున్నది. అయన తాజాగా మరో కామెంట్‌ కూడా చేసారు. తాను ప్రజల పక్షమని, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతాననడం పాలనావ్యవస్థలోని లోపాలను చెప్పకనే చెప్పినట్లు అయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పై చాలాకాలంగా అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే  ‌కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా సిద్ధిపేటలో సిఎం మాట్లాడిన తీరుపై స్పందించారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు హూందాగా మాట్లాడాలని రేవంత్‌రెడ్డిని పరోక్షంగా కార్నర్‌ ‌చేశారు. అధికారం ఉందికదా అని అహంకారంతో ఇష్టం వొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు హర్షించరని, అదృష్టం కొద్ది దొరికిన అధికారంతో అవినీతికి పాల్పపడి దుర్మార్గపు పాలన సాగిస్తే చరిత్ర క్షమించదంటూనే తమ మునుగోడుకు అభివృద్ది నిధులు కేటాయించకపోతే రాష్ట్రం కురుక్షేత్రంగా మారుతుందని ఆయన చేసిన హెచ్చరిక ఇప్పుడు కాంగ్రెస్‌ ‌పార్టీని కుదిపేస్తున్నది.
ఇదిలా ఉంటే ఇదే సిద్ధిపేటసభలో రానున్న ఎన్నికల్లో హరిష్‌రావుపై గెలిచివొచ్చే తమపార్టీ నాయకుడెవరైనా సరే వారికి మంత్రిపదవి కట్టబెడతానని ప్రకటించారు రేవంత్‌రెడ్డి. దీనిపై తీవ్రంగా స్పందించిన హరీష్‌రావు, వేరే కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరో ఎందుకు నిజంగా దమ్ముంటే నువ్వే(రేవంత్‌రెడ్డి) పోటీ చేసి గెలువాలంటూ మీడియా సమావేశంలో బాహాటంగా ప్రతిసవాల్‌ ‌విసిరారు. వాస్తవానికి సిద్దిపేట నియోజక వర్గం నుంచి వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యే గ  అప్రతిహతంగా తన విజయ పరంపర కొనసాగిస్తున్న హరీష్ రావు ముందు పోటీకి నిలవడం అంటే పోచమ్మ కు మేకపోతును బలి ఇవ్వడమే అని స్థానికుల ధీమా ..! అంతకు ముందు జరిగిన సిరిసిల్ల సభలో కూడా రేవంత్‌రెడ్డి ఇలాంటి ప్రకటనే చేసిన విషయం తెలియందికాదు.
అక్కడకూడా కెటిఆర్‌ను ఓడించి వొచ్చిన అభ్యర్థి ఎవరైనా సరే వారికి మంత్రి పదవి ఖాయమని చెప్పాడు. ఇదిలాఉంటే బిజెపి నాయకత్వం పైన కూడా రేవంత్‌రెడ్డి ఇలాంటి ఛాలెంజీనే మరొకటి చేసారు. ముస్లింల విషయంలో ముఖ్యంగా ఎంఐఎం విషయంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాన్ని సవాల్‌చేస్తూ, దమ్ముంటే కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా, ఎంఐఎం పార్టీనేత, ఎంపీ అయిన అసదుద్దీన్‌ ఒవైసీపై పోటీచేసి గెలువాలని మరో సవాల్‌ ‌విసిరారు. తెలంగాణలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌ ‌మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న విషయం తెలియందికాదు. దానికి ముక్తాయింపుగా హిందూ ముస్లిం వోట్లకోసమే తప్ప ఈ రెండు పార్టీల మధ్య  తేడా లేదంటారు ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *