గిగ్ వర్కర్లకు సంక్షేమ బోర్డు.. పారిశుద్ధ్య కార్మికులకు ఎప్పుడు?

“గిగ్ కార్మికుల సంక్షేమానికి ప్లాట్‌ఫారమ్ సంస్థల నుంచి వాటా తీసుకోవాలన్న నిర్ణయం వెనుక ఉన్న సూత్రం పారిశుద్ధ్య కార్మికులకూ వర్తిస్తుంది. వారి శ్రమతో మొత్తం సమాజం ప్రయోజనం పొందుతున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు వారి సంక్షేమానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. ప్రత్యేక సంక్షేమ బోర్డులో కార్మికుల ప్రతినిధులకు స్థానం కల్పించాలి. వేతన బకాయిలు, అకారణ తొలగింపులు, పని ప్రదేశంలో ప్రమాదాలు, రక్షణ పరికరాల కొరతపై ఫిర్యాదులను పరిష్కరించే అధికారం బోర్డుకు ఇవ్వాలి. కార్మికుల పిల్లల చదువుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి. విద్య, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం కల్పించాలి. ఇందిరమ్మ ఇళ్లలో ప్రత్యేక కోటా కేటాయించి, అర్హులైన కుటుంబాలకు విడతలవారీగా ఇళ్లు మంజూరు చేయాలి..”

ప్రజారోగ్యాన్ని కాపాడుతున్న కార్మికులకు ఉద్యోగ భద్రత, గౌరవప్రదమైన వేతనాలు, ప్రత్యేక సంక్షేమ నిధి కల్పించాలి

గిగ్ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు, నిధి ఏర్పాటు చేయడం హర్షించదగ్గ పరిణామం. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు కార్మికుల సేవలతో ఆదాయం ఆర్జిస్తున్నప్పుడు, వారి సామాజిక భద్రతకు కూడా బాధ్యత వహించాలి. ఆ బాధ్యతను చట్టబద్ధం చేస్తూ ప్లాట్‌ఫారమ్ సంస్థల నుంచి సెస్ వసూలు చేసి సంక్షేమ నిధికి జమ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం. కార్మిక సంఘాలు, పౌరసమాజం చేసిన నిరంతర కృషి కూడా ఈ నిర్ణయం వెనుక ఉంది. గిగ్ కార్మికులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకున్న సందర్భంలో మరో ప్రశ్న ముందుకొస్తున్నది. ఊరూరా, వాడవాడలా ప్రజారోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇటువంటి భద్రత ఎప్పుడు కల్పిస్తారు?

తెలంగాణ ప్లాట్‌ఫారమ్ ఆధారిత గిగ్ కార్మికుల నమోదు, సామాజిక భద్రత, సంక్షేమ బిల్లును 2026 మార్చి 30న అసెంబ్లీ ఆమోదించింది. నవంబర్ 14న జీవో నంబర్ 18 ద్వారా చట్టాన్ని అమలులోకి తెచ్చినట్లు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్న సభలో ప్రకటించారు. గిగ్ కార్మికుల కోసం రూ.5 లక్షల ప్రమాద బీమా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య రక్షణ, ప్రసూతి ప్రయోజనాలు, పిల్లల చదువుకు ప్రోత్సాహం వంటి ఏర్పాట్లను ప్రతిపాదించారు. ఉపాధి భద్రతకు రక్షణలు కల్పించడంతో పాటు వృద్ధాప్య భద్రతకు అవసరమైన చర్యలను సిఫారసు చేసే అవకాశం కూడా కల్పించారు. ఈ ప్రయోజనాలను అందించడానికి నిధి, అమలును పర్యవేక్షించడానికి బోర్డు ఏర్పాటు చేయడం ఈ చట్టంలో ముఖ్యమైన అంశం.

మన ఇళ్ల ముందు చెత్తను తొలగించేవారు, మురుగు కాలువలను శుభ్రం చేసేవారు, రోడ్లపై పేరుకుపోయిన వ్యర్థాలను ఎత్తేవారు రోజూ ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారో మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఒక్కరోజు వారు పనికి రాకపోతే మన వీధులు, ఊళ్లు, నగరాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. అధికారులు, పాలకులు పర్యటనకు వచ్చే ప్రాంతాలను కంటికింపుగా తీర్చిదిద్దేది ఈ కార్మికులే. అయినా వారి వేతనాలు, పని పరిస్థితులు, ఆరోగ్యం గురించి పాలకుల సమీక్షల్లో ఎంత ప్రస్తావన వస్తున్నది? మన ఇళ్ల నుంచి చెత్త సమయానికి తీసుకెళ్లాలని పట్టుబట్టే మనం, దాన్ని తీసుకెళ్లేవారికి రక్షణ పరికరాలు ఉన్నాయా అని ఎప్పుడైనా అడుగుతున్నామా?

రాష్ట్రంలోని 12,999 గ్రామపంచాయతీల్లో 49,456 మంది బహుళ విధుల కార్మికులు పనిచేస్తున్నారు. 141 పట్టణ స్థానిక సంస్థల్లో 29,804 మంది సిబ్బంది ఉండగా, వారిలో 22,533 మంది పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్నారు. మిగిలినవారు వీధి దీపాలు, నీటి సరఫరా తదితర సేవల్లో ఉన్నారు. పట్టణ పారిశుద్ధ్య సిబ్బందిలో అత్యధికులు పొరుగుసేవల ప్రాతిపదికన పనిచేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 900 మంది శాశ్వత సిబ్బంది ఉండగా, పొరుగుసేవల ఉద్యోగులు 18,357 మంది ఉన్నారు. గ్రామపంచాయతీల్లో సర్పంచ్ లేదా అధికారితో విభేదం తలెత్తితే ఉపాధి పోతుందేమోనన్న భయంతో చాలామంది పనిచేస్తున్నారు. ప్రజలకు ప్రతిరోజూ అవసరమైన సేవను అందించే కార్మికుల ఉపాధి స్థానిక పాలకుల ఇష్టాయిష్టాలపై ఆధారపడే పరిస్థితి మారాలి.

గ్రామపంచాయతీ కార్మికులకు నెలకు రూ.9,500 చెల్లిస్తున్నారు. ముప్పై రోజులకు లెక్కిస్తే రోజుకు సుమారు రూ.317. మురుగు, చెత్త మధ్య పనిచేస్తూ ఆరోగ్యాన్ని పణంగా పెట్టేవారికి ఈ వేతనంతో కుటుంబ పోషణ ఎలా సాధ్యం? ఇతర పొరుగుసేవల ఉద్యోగులకు వర్తించే జీవో నంబర్ 60 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకూ విధుల వారీగా రూ.15,600 నుంచి రూ.22,750 వరకు వేతనాలు చెల్లించాలి. బహుళ విధుల పేరుతో వేర్వేరు పనులను ఒకే వేతన శ్రేణిలో ఉంచుతున్న జీవో నంబర్ 51ను సవరించాలి లేదా రద్దు చేయాలి. ఒప్పంద, పొరుగుసేవల సిబ్బందికి వేతన సవరణలు చేసినప్పుడల్లా పంచాయతీ కార్మికులనూ పరిగణనలోకి తీసుకోవాలి. నిరంతరంగా అవసరమయ్యే పారిశుద్ధ్య పనుల్లో ఉన్నవారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి.

ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందే అవకాశం అర్హత ఉన్న కుటుంబాలకు ఇప్పటికే ఉంది. పారిశుద్ధ్య కార్మికులు వృత్తిరీత్యా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు ప్రత్యేక వైద్య ఏర్పాట్లు అవసరం. పని చేసే చోట తగిన రక్షణ పరికరాలు అందించాలి. కార్మికులకు ప్రతి వారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్సను ప్రభుత్వమే అందించాలి. కార్మికుడికి ప్రమాద బీమాతో పాటు కుటుంబానికి సమగ్ర వైద్య రక్షణ కల్పించాలి. అనారోగ్యం కారణంగా పనికి దూరమైనప్పుడు ఆదాయం కోల్పోకుండా చూడాలి. పదవీ విరమణ తర్వాత కూడా వైద్య సదుపాయాలు, వృద్ధాప్య భద్రత కొనసాగాలి. ఏళ్ల తరబడి మురుగు, వ్యర్థాల మధ్య పనిచేసిన ప్రభావం ఉద్యోగ విరమణతో ముగిసిపోదు.

పారిశుద్ధ్య శ్రమ పట్ల ఉన్న చులకనను కుల వివక్ష నుంచి విడదీసి చూడలేం. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఈ పనుల్లో మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొన్ని కులాలవారే తరతరాలుగా మురుగును తొలగించాలి అనే భావన సమాజంలో ఎంత లోతుగా పాతుకుపోయిందో వారి పట్ల మన ప్రవర్తనలో కనిపిస్తుంది. గ్రామంలో ఒక పారిశుద్ధ్య కార్మికుడు చనిపోతే, అతని పని పరిస్థితుల గురించి గానీ, కుటుంబం ఎలా బతుకుతుందనే ప్రశ్న గానీ ఎంతమంది లేవనెత్తుతారు? ప్రజల హక్కుల కోసం మాట్లాడే పౌరసంఘాలు కూడా ఈ కార్మికుల వేతనాలు, భద్రత, గౌరవాన్ని తమ కార్యాచరణలో భాగం చేసుకోవాలి.

గిగ్ కార్మికుల సంక్షేమానికి ప్లాట్‌ఫారమ్ సంస్థల నుంచి వాటా తీసుకోవాలన్న నిర్ణయం వెనుక ఉన్న సూత్రం పారిశుద్ధ్య కార్మికులకూ వర్తిస్తుంది. వారి శ్రమతో మొత్తం సమాజం ప్రయోజనం పొందుతున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు వారి సంక్షేమానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. ప్రత్యేక సంక్షేమ బోర్డులో కార్మికుల ప్రతినిధులకు స్థానం కల్పించాలి. వేతన బకాయిలు, అకారణ తొలగింపులు, పని ప్రదేశంలో ప్రమాదాలు, రక్షణ పరికరాల కొరతపై ఫిర్యాదులను పరిష్కరించే అధికారం బోర్డుకు ఇవ్వాలి. కార్మికుల పిల్లల చదువుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి. విద్య, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం కల్పించాలి. ఇందిరమ్మ ఇళ్లలో ప్రత్యేక కోటా కేటాయించి, అర్హులైన కుటుంబాలకు విడతలవారీగా ఇళ్లు మంజూరు చేయాలి.

స్వచ్ఛత కార్యక్రమాల్లో చీపురు పట్టే ప్రజాప్రతినిధులు కొద్దిసేపటి పనికే రక్షణ పరికరాలు ధరించడం చూస్తాం. అదే పని రోజూ చేసే కార్మికులకు ఆ పరికరాలు అందుతున్నాయో లేదో చూడటం వారి బాధ్యత. కార్మికుల పాదాలు కడిగి గౌరవం ప్రకటించే నాయకత్వం, వారి వేతనాలు పెంచడానికి, ఉద్యోగాలను క్రమబద్ధీకరించడానికి, కుటుంబాలకు భద్రత కల్పించడానికి కూడా నిర్ణయాలు తీసుకోవాలి. అభివృద్ధిలో పొరుగు రాష్ట్రాలతో పోటీ పడుతున్నామని చెప్పే తెలంగాణ ప్రభుత్వం, పారిశుద్ధ్య కార్మికులకు గౌరవప్రదమైన వేతనాలు, మెరుగైన పని పరిస్థితులు కల్పించడంలోనూ ముందుండాలి. అప్పుడే మన నగరాల అభివృద్ధిలో వాటిని శుభ్రంగా ఉంచే కార్మికులకు తగిన భాగం దక్కుతుంది.

చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేయడం, ఇంటి వ్యర్థాలను వేరు చేయకుండా బయటకు పంపడం వంటి అలవాట్లు కార్మికుల పనిని మరింత కష్టతరం చేస్తాయి. మనం సృష్టించే ప్రతి వ్యర్థాన్నీ చివరికి ఎవరో ఒకరు సేకరించి తరలించాల్సిందే. ఆ శ్రమను గుర్తించడం మన ఇంటి దగ్గరే మొదలవుతుంది. పారిశుద్ధ్య పనిని గౌరవప్రదమైన ఉపాధిగా తీర్చిదిద్దితేనే అది కొన్ని కులాలవారి విధి అన్న భావనను ప్రశ్నించగలం. మన పరిసరాల పరిశుభ్రత కోసం పనిచేసే ప్రతి మనిషికీ సురక్షితమైన పని వాతావరణం, స్థిరమైన ఆదాయం, కుటుంబ భద్రత కల్పించాలి. గిగ్ కార్మికుల కోసం తీసుకున్న నిర్ణయం నుంచి స్ఫూర్తి పొంది, పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు, నిధి ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.

దిలీప్ వి.
మానవ హక్కుల కార్యకర్త, తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *