అంతరాళాల్లోకి దూసుకెళ్ళే కవిత కలకాలం బ్రతుకుతుంది. ఆలోచనలను కలిగించి ఎదల్ని కదలించే కవిత్వానికి సార్థకత దక్కుతుంది. తాడేపల్లి హనుమత్ ప్రసాద్ పదిహేడేళ్ల చిన్నతనంలోనే కవితా రచనను ప్రారంభించి సంకీర్తనా స్రవంతి, ధన్య జీవి మా నాన్న, మా మంచి అమ్మ, మేలుకొలుపు, గగనం తాకుతు ఎగిరింది అన్న రచనలను తెలుగు సాహిత్యానికి అందించారు. అంతరంగ ప్రభలు పేరుతో ఆయన వెలువరించిన 70 కవితల కవితా సంకలనంలో వాడి, వేడి పదాల ద్వారా అనేక అంశాలపై ఆలోచింపజేసే భావ వ్యక్తీకరణ చేశారు.
ధనము – మనము అన్న తొలి కవితలో దానవత్వ విరుగుడుతో / సమానత్వ చరణముతో/ మానవత్వ మనుగడతో జగతి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నవ శకానికి నాందీ ప్రస్థానకుడవు కమ్మని విద్యార్థికి పిలుపునిచ్చారు. కుటుంబ భారాన్ని మోసే మహిళను సబలగా, మార్గదర్శినిగా చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కవితలో ఆ విద్యామందిరం మానవామృత విద్యామాతృకగా వికసించాలన్నారు. విమల చరితగా, విభవ సహితగా భువికి రమ్మని ఉగాదికి ఆహ్వానం పలికారు. ఆడపిల్లకు ఆంక్షలు, అవధులు ఎందుకని ప్రశ్నించి ఆమెను విజ్ఞాన సముద్రంతో పోల్చారు. మానవతకు మార్గదర్శిగా, పూర్ణక్రాంతిగా రమ్మని సంక్రాంతిని కోరారు. బతుకు దివ్వెలను వెలిగించేలా అరుదెంచమని దీపావళికి స్వాగతం చెప్పారు. సమతామమతలే భారతీయ జీవనంలోని విశిష్టతలన్నారు. బిచ్చగానిలోని మచ్చలేని తనమే లోకంలో అనంతమైన ఆదర్శమని అభిప్రాయపడ్డారు. మనశ్శక్తి తిరుగులేనిదని చెప్పారు.
కాలానుగుణమైన అనుభవాలతో మానవకోటి ప్రశాంతతను పొందాలని సూచించారు. కష్టసుఖాలు జీవిత పరమ పద సోపానాలు అన్నారు. కండలు పెంచడం కాదని, జాతి గుండెలను రగిలించడమే నిజమైన శక్తి అని చెప్పారు. భావ దాస్యం వదిలి బ్రతుకమన్నారు. మొక్కలది త్యాగ భావన అని తెలిపారు. జీవితం పలువురికి అనుసరణీయంలా సాగాలని చెప్పారు. దేహ బాధకన్నా దేశ బాధ గొప్పదని తెలిపారు. సంపాదన ఎంత అన్నది కాదు సంతర్పణ, సమర్పణ గుణం ఉందా అన్నది ముఖ్యమని చెప్పారు. లక్ష్యసాధనతో బాధలను మరచిపోతామని తెలిపారు. వర్తమానంలో ఉండాల్సింది లక్ష్యసిద్ధి అన్నారు. కలతల కుళ్ళును కడిగే కన్నీళ్ళున్న కళ్లు కావాలని చెప్పారు. ఆత్మబలమే మనిషిని నడిపిస్తుందని తెలిపారు. చేవ నిండిన చేతులుండాలన్నారు. ఆర్తిని ఆదరించమని అర్థించారు. నిరీక్షణలో అసిధారా వ్రతమున్నదని చెప్పారు.
భారతీయతలోని గొప్పతనాన్ని తెలుసుకొమ్మని అన్నారు. ప్రగతి గీతిలోనే జన జాగృత సుగతి ఉందని భావించారు. బేటీ పడావో, బేటీ బచావోలోని అంతరార్థాన్ని గమనించమని తెలిపారు. షష్ఠిపూర్తి ఒక జీవిత జ్ఞాపిక అని చెప్పారు. తన భావ సముద్రంలోని అపురూపాలను అక్షర రత్నాలుగా మలచి కవి వెలిగించిన ఈ అంతరంగ ప్రభలు జీవన మార్గదర్శనపు చంద్రికలు.
– డా. తిరునగరి శ్రీనివాస్
9441464764