ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు అన్యాయం జరగదు..
ఎస్సీ వర్గీకరణ పోరాట అమరులను ఆదుకుంటాం..
ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసంలో ప్రాధాన్యం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18 : సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇది అని హర్షం వ్యక్తం చేశారు. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. 1960 లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితుడిని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దళితుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. పంజాబ్ కేసు సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా కొనసాగింది.
మేం అధికారంలోకి వొచ్చాక ఏడుగురు జడ్జిల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా న్యాయవాదితో సుప్రీం కోర్టులో మన వాదనలు వినిపించాం. సుప్రీంకోర్టు తీర్పు వొచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగానే శాసనసభలో తీర్మానం చేశాం. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. న్యాయ నిపుణులను సంప్రదించి వన్ మెన్ కమిషన్ ను ఏర్పాటు చేశాం. వన్ మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను తూచ తప్పకుండా ఆమోదించాం. 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి 15 శాతం రిజర్వేషన్లు వారికి పంచాం.. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తాం.
వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్ధిస్తున్నారు. 2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రిజర్వేషన్లు పెంచడం వాటిని సహేతుకంగా పంచడం తమ బాధ్యత అని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం లో దళితులకు అన్యాయం జరగదని, రిజర్వేషన్లను పెంచి వాటిని అమలు చేసే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. బిల్లు ఆమోదానికి సహకరించిన అందరికీ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.



ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే