రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం టౌన్ , ప్రజాతంత్ర, మార్చి 19 : పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లింల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు…ఆత్మీయత, మతసామరస్యానికి ప్రతీక అని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy ) అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణపురంలో గల టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్ లో మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గ ముస్లింలకు బుధవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హాజరైన ఇఫ్తార్ దావత్ లో నియోజకవర్గంలోని సుమారు 1500మందికి పైగా ముస్లింలు, మత పెద్దలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… ముస్లింలు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. రంజాన్ పండుగ వారి జీవితాలలో సుఖసంతోషాలను నింపాలని అల్లాహ్ ను కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాలేరు నియోజకవర్గంలో ఒక్కో మసీదుకు రూ.లక్ష : మంత్రి పొంగులేటి
మైనార్టీలు కోరిన అన్ని కోరికలు తీర్చేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి పొంగులేటి తెలిపారు. కోరిక చిన్నదైనా, పెద్దదైనా వాటిని చిత్తశుద్ధితో నెరవేరుస్తామని తెలిపారు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ యువ వికాసం అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఈ పథకంలో ముస్లిం మైనార్టీలకు కూడా న్యాయం జరుగుతుందని తెలిపారు.
పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో సుమారు 40నుంచి 45 మసీదులు ఉన్నాయని వాటి అభివృద్ధికి ఈనెల 30న జరుపుకునే రంజాన్ పండుగకు ముందుగానే ఒక్కో మసీదుకి రూ.లక్ష చొప్పున మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఖబరస్తాన్ ర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈద్గా ఏర్పాటుకు కూడా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం గత ఏడాది వొచ్చిన వరదల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రకాష్ నగర్ బ్రిడ్జి వంతనపై చిక్కుకున్న కొంతమంది వరద బాధితులను రక్షించిన సుభానీని ప్రత్యేకంగా అభినందించారు. అతనికి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తానని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.