ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం వొచ్చే ఆలయాలన్నీ దేవాదాయశాఖ పరిధిలోకి..
•అసెంబ్లీలో మంత్రి కొండా సురేఖ వెల్లడి
హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి18: యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. 18 మంది సభ్యులతో వైటీ-డీ బోర్డు ఉంటుందని చెప్పారు. బోర్డు పదవీకాలం రెండు సంవత్సరాలుగా నిర్ణయించామని, బోర్డు ఛైర్మన్, సభ్యులకు ఎలాంటి జీత భత్యాలు ఉండవన్నారు. వైటీడీ బోర్డు కూడా విద్యా సంస్థలను స్థాపించవచ్చు, నిర్వహించవచ్చన్నారు.
దీనికి ఆ స్వేచ్ఛ ఉంటుందన్నారు. యాదగిరి గుట్టలో ఆధ్యాత్మిక, వేద విద్యా సంస్థలను స్థాపించవచ్చని కూడా అన్నారు. వైటీడీకి బడ్జెట్ ఆమోదం ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది. ఐఏఎస్ అధికారి ఈవోగా ఉంటారు. గతంలో యాదగిరిగుట్టలో భక్తులకు సరైన వసతులు లేవు. ఈ ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి వసతులు కల్పించింది. ఇంకా మెరుగుపరిచేందుకే యాదగిరిగుట్ట పాలక మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. సమర్థమైన పాలక మండలిని నియమించి యాదగిరిగుట్ట క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం వొచ్చే ఆలయాలన్నీ దేవాదాయ శాఖ పరిధిలోకి వొస్తాయని మంత్రి కొండా సురేఖ తెలిపారు.