- జలాల పంపిణీలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏపీకి సహకారం
- తెలంగాణ వాటాను తేల్చేందుకు కేంద్రంతో పోరాటం
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కృష్ణా జలాశయాల్లో తెలంగాణ వాటాను వదులుకునే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. న్యాయమైన వాటా కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. శనివారం రాష్ట్ర శాసనసభలో బిఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి లేవనెత్తిన అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుగుణంగా పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం తోడ్పాటు నందించిందని ఆయన మండిపడ్డారు. కృష్ణా జలాల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నాటి బిఆర్ఎస్ పాలకులు పూర్తిగా సహకరించారని, 811 టిఎంసిల నీటిలో ఆంధ్రప్రదేశ్ కు 511 టి.యం.సి లు తెలంగాణకు 299 టిఎంసిలను కేటాయించిన రోజునే బిఆర్ఎస్ నిర్వాకం బట్టబయలు అయిందని ఆయన ఎద్దేవా చేశారు. పైగా కృష్ణా బేసిన్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తుంటే వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆయన దుయ్యబట్టారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అందుకు నిదర్శనమన్నారు. కృష్ణా జలాశయాలలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఆయన గణాంకాలతో వివరించారు.
కేఆర్ఎంబీ లెక్కల ప్రకారం 2014 లో బిఆర్ఎస్ పార్టీ పాలనా పగ్గాలు చేపట్టిన రోజు నుంచి 2021 వరకు కృష్ణా జలాశయాలలో ఆంధ్రప్రదేశ్ 64 శాతం వినియోగిస్తే తెలంగాణ కేవలం వాడుకున్న నీటి శాతం కేవలం 36 శాతం మాత్రమే నన్నారు. బిఆర్ఎస్ పాలకుల పాలనలో ఇదే కృష్ణా జలాశయాలలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు 44,000 క్యూసెక్కుల నుంచి 2023 నాటికి 92,600 క్యూసెక్కుల పెంచుకున్నారని, అదే విధంగా ఆర్ఎల్ఐసి, వెలిగొండ ప్రాజెక్టు ల నిర్మాణాన్ని అడ్డుకోలేక పోయారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలు తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బిఆర్ఎస్ పాలనలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం దగ్గర పోరాడుతుందన్నారు. ఉభయ రాష్ట్రాలలో ఎవరు ఎంత నీరు వినియోగిస్తున్నారో అన్నది తెలుసుకునేందుకు వినియోగించాల్సిన టెలిమెట్రి పరికరాలను అమర్చడంలో కూడా బి.ఆర్.ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం టెలిమెట్రి పరికరాలను అమర్చేందుకు నిర్ణయం తీసుకుందని ఇందుకయ్యే ఖర్చులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటా మొత్తాన్ని ఇవ్వకపోయినా తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతో ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అంతే గాకుండా కృష్ణా జలాశయాలలో తెలంగాణ వాటాను తేల్చేందుకు కేంద్రం వద్ద పోరాడుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.





