- ఏప్రిల్ మొదటి వారంలో పైలట్ ప్రాజెక్ట్
- నిషేధిత జాబితాలోని గజం స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసినా కఠిన చర్యలు తప్పవు
- ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలి
- రెవెన్యూ ,హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: ప్రజలకు సమర్ధవంతంగా, సులువుగా , పారదర్శకంగా అవినీతి రహితంగా మరింత మెరుగైన సేవలందించేలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ (New Slot Booking System) తో పాటు బయోమెట్రిక్ విధానాన్ని తీసుకురాబోతున్నామని రెవెన్యూ ,హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సోమవారం సచివాలయంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రాషన్ శాఖపై దాదాపు మూడు గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సెక్రెటరీ జ్యోతి బుద్ధప్రకాష్, సిసిఎల్ఎ సెక్రటరీ మంధా మకరంద్, ఐటీ సెక్రటరీ బావేష్, ఆరు జోన్ల డిఐజీలు, ఉమ్మడి జిల్లాల జిల్లా రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కు కనీసం 45 నిమిషాల నుంచి గంటకు పైగా సమయం పడుతుందని, ఈ స్లాట్ బుకింగ్ విధానం (New Slot Booking System) ద్వారా 10 నుంచి 15 నిమిషాలలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ స్లాట్‌బుకింగ్ విధానాన్ని ఏప్రిల్ మొదటివారంలో పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలుచేయబోతున్నామని వెల్లడించారు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం సామాన్యులు నిరీక్షించే పరిస్ధితి లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నామని ప్రకటించారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, చాట్ బోట్స్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
స్లాట్ బుకింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను రీ ఆర్గనైజేషన్ చేయాలని అధికారులకు సూచించారు. నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్ రిజిస్ట్రార్‌లు రిజిస్ట్రేషన్ చేయకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, భూ భారతి తరహాలో ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను ఏర్పాటు చేసి నిషేధిత ఆస్తుల వివరాలను అందులో పొందుపరచి రెవెన్యూశాఖకు అనుసంధానం చేయాలని సూచించారు. నిషేధిత జాబితాలో ఉన్న గజం స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులలో గజం భూమిని రిజిస్ట్రేషన్ చేసిన క్షణంలోనే తన కార్యాలయంతోపాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డిస్ ప్లే అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. లక్షలాది కుటుంబాలకు మేలుచేసే ఎల్ఆర్ఎస్. ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
జిల్లా రిజిస్ట్రార్‌లు ప్రతిరోజు దీనిపై సమీక్షించాలని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ఏమైనా సందేహాలుంటే సబ్ రిజిస్ట్రార్లు ఉన్నతాధికారులతో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకొని సమస్యను పరిష్కరించాలే తప్ప దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకూడదు. ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు రెండు మూడు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారని వారి ఆవేదన అర్థం చేసుకొని నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తులు పరిష్కరించాలి. కానీ తప్పుచేసి ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. జిల్లా సబ్ రిజిస్ట్రార్లు ఆఫీసుకే పరిమితం కాకుండా ప్రతివారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సందర్శించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.