మాన‌వ అక్ర‌మ ర‌వాణా నిరోధానికి స‌మష్టి కృషి

– డాక్ట‌ర్ సునీతా కృష్ణ‌న్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 30:  ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బి.వి.ఆర్.ఆర్. తెలంగాణ పోలీస్ అకాడమీలో “మానవ అక్రమ రవాణా మరియు సురక్షిత వలస” అంశంపై పద్మశ్రీ డా. సునీతా కృష్ణన్, ప్రజ్వల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, అవగాహన సదస్సులో ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న సంఘటిత నేరమని, లైంగిక దోపిడి, బాల కార్మికత్వం, బలవంతపు భిక్షాటనం, అవయవాల అక్రమ రవాణా, సైబర్ మోసాలు, నకిలీ విదేశీ ఉద్యోగాల పేరుతో జరిగే అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా పిల్లలను లక్ష్యంగా చేసుకునే ఆన్‌లైన్ గ్రూమింగ్, సీఎస్ ఏఎం వంటి సైబర్ ముప్పులను వివరించి, బాధితుల రక్షణ, పునరావాసం, సమర్థవంతమైన దర్యాప్తు కోసం నివార‌ణ‌, ర‌క్ష‌ణ‌, శిక్షించ‌డం, భాగ‌స్వామ్యం అనే నాలుగు సూత్రాలను సమిష్టిగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, ఐపీఎస్ మాట్లాడుతూ పోలీసు యూనిఫామ్‌పై ప్రజలకు అపార విశ్వాసం ఉందని, ప్రతి పోలీసు అధికారి ఆ విశ్వాసాన్ని నిజాయితీ, వృత్తి నైపుణ్యం, మానవీయ దృక్పథంతో నిలబెట్టాలని అన్నారు. మానవ అక్రమ రవాణాను ఆధునిక బానిసత్వంగా అభివర్ణిస్తూ, బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించడం, సమన్వయంతో పనిచేయడం, సోషల్ మీడియా వినియోగంలో బాధ్యతతో పాటు వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడం అత్యంత అవసరమని సూచించారు.ఈ సందర్భంగా సునీత కృష్ణన్ ను అకాడమీ డైరెక్టర్ జ్ఞాపిక తో సన్మానించారు. కార్యక్రమంలో అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ జి.కవిత, అసిస్టెంట్ డైరెక్టర్ వేమా శ్రీనివాసరెడ్డి ఇతర అధికారులు ప్రొబేషనరీ డి ఎస్ పి లు,ఇతర ట్రైనీ అధికారులు పాల్గొన్నారు.

—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *