సియోల్‌లో మంత్రుల బృందం పర్యటన

చెత్త తరలింపు.. విద్యుత్‌ ఉత్పత్తిపై పరిశీలన
అతిపెద్ద మాపో రిసోర్స్ ‌రికవరీ ప్లాంట్‌ ‌పనీతిరుపై అధ్యయనం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌21: ‌దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే మాపో రిసోర్స్ ‌రికవరీ ప్లాంట్‌ను మంత్రుల బృందం సందర్శించింది. అలాగే అక్కడ చెత్త సేకరణ, మురికి నీటి నిర్వహణ తదితర పద్దతులను కూడా పరిశీలించింది.  సియోల్‌లో తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ‌పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ ‌రెడ్డి, హైదరాబాద్‌ ‌మేయర్‌ ‌గద్వాల విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌, ‌జీహెచ్‌ఎం‌సీ, మూసీ రివర్‌‌ఫ్రంట్‌ అధికారులు పర్య‌టించారు. మాపో ప్లాంట్‌లో రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్‌ ‌చేసి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. వ్యర్థాల రీసైక్లింగ్‌కు వేస్ట్ ‌టు ఎనర్జీ టెక్నాలజీని సియోల్‌ ‌నగరపాలక సంస్థ వాడుతోంది. పర్యావరణంపై దుష్ప్రభావం పడకుండా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది.

మరో 10 ఏళ్లలో పూర్తిగా భూ ఉపరితలం నుంచి తొలగించి భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్‌ను నిర్మించేందుకు సియోల్‌ ‌నగర పాలక సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మాపో ప్లాంట్‌ ‌పనితీరును అధ్యయనం చేసేందుకు తెలంగాణ మంత్రుల బృందం వెళ్లింది. ఈ సందర్భంగా దానకిషోర్‌ ‌మాట్లాడుతూ సియోల్‌, ‌హైదరాబాద్‌ ‌నగర నమూనాలు ఒకేలా ఉంటాయని తెలిపారు.

సియోల్‌లో సుమారు 10వేల మెట్రిక్‌ ‌టన్నుల చెత్తను సేకరించి నగరంలోని నాలుగు వైపులకు తరలిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో దాదాపు 8వేల మెట్రిక్‌ ‌టన్నులు సేకరించి ఒకే వైపునకు తీసుకెళ్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు నగరం చుట్టూ నాలుగు ప్రదేశాలను గుర్తించినట్లు వివరించారు. నగరంలోని చెత్తను నాలుగు వైపులకు పంపించడం ద్వారా రవాణా ఖర్చులు తగ్గుతాయన్నారు.  హైదరాబాద్‌ ‌నగరం, తెలంగాణ ప్రజల భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మూసీ నదిని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సియోల్‌లో చెయోంగ్‌ ‌గయ్‌ ‌చియోన్‌ ‌నదిని ఆయన పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *