ప్రస్తుత రాజకీయాలు కులాల కుంపట్లు రగిలించడమే లక్ష్యంగా వేడెక్కుతున్నాయి. తాజాగా బిసి కులగణనే ఇందుకు నిదర్శనం. దేశంలో పౌరులంతా ఒక్కటే అన్న భావన రాకుండా రాజకీయ పార్టీలు చాలా తెలివిగా తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ప్రజల్లో కులమతాలు, వర్గ విభేదాలు లేకుండా అంతా భారతీయులమే అన్న భావన లేకుండా చేస్తున్న వారిలో విపక్షాలు ముందు వరసలో నిలుచున్నాయి. అందుకే వారు తమ వోటు బ్యాంక్ రాజకీయాలను ప్రయోగిస్తున్నారు. ప్రజలు ఎప్పటికీ ఒక్కటి కాకుండా చూసుకోవడం వాటి లక్ష్యంగా కని పిస్తోంది. ఉమ్మడి పౌరస్మృతి విషయంలో రాజకీయపార్టీలు అనుసరిస్తున్న తీరు దేశద్రోహ చర్యగానే భావించాలి. ఎందుకంటే ఏ దేశంలో అయినా ప్రజలందరికీ ఒకేరకమైన హక్కులు ఉంటాయి. ఒకే రకమైన చట్టాలు ఉంటాయి. కానీ ఏం దౌర్భాగ్యమో భారత్లో మాత్రమే ఇలా వేర్వేరుగా చట్టాలు ఉంటాయి. ఉండాలని కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీలు కోరుకుంటున్నాయి కూడా. చట్టాలు ఒకేరకంగా ఉండడానికి వీలులేదన్న కుత్సిత భావనలో రాజకీయపార్టీల నేతలు ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో కమ్యూనిస్టులంత గోడవాటం గాళ్లు ..దేశంలో మరొకరు ఉండరు. చ్కెనా, రష్యా, క్యూబా గురించి మాట్లాడుతున్న ఎర్ర జెండా వాళ్లకు భారత్లో మాత్రం ప్రజలందరి రక్తం ఒక్కటే అన్న సోయి ఉండదు. ఎవరి రక్తం వారిదే అన్న వాదనలో ఉంటారు. ఉపన్యాసాలు ఇచ్చే సమయంలో మాత్రం మనమంతా ఒక్కటే.. మనందరిలోని రక్తమంతా ఒక్కటే అంటారు. కులమతాల అడ్డుగోడలు తొలగాలనేది వారే.. కులమాతాలకు అనుగుణంగా చట్టాలు ఉండాల్సింది అని పట్టుబడేది వారే. ఇలా అయితే దేశం మరో వందేళ్లయినా అభివృద్ది చెందదని గుర్తించాలి. కమ్యూనిస్టులు.. వారిని అనుసరిస్తున్న వారు తమ ఆలోచనా ధోరణి బూజుపట్టిందన విషయం తెలుసు కోవడం లేదు. ఉమ్మడి పౌరస్మృతి విషయంలో వారు ఆడుతున్ననాటకాలు దేశాన్ని విచ్చిన్నం చేయడానికి తప్ప మరోటి కాదు.
మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ ఒకే చట్టం వర్తించాలన్నది బిల్లు లక్ష్యం. నిజానికి మతాచారాలు ఎవరికి వారు నిర్వహించుకోవొచ్చు. మర్డర్లు, రేపులు, దొంగతనాలు, పెళ్లిల్లు చేసుకునే సమయంలో చట్టం అందిరికీ ఒకేలా ఉండాలి. అంటే.. పెండ్లిళ్లు, విడాకులు, వారసత్వం, దత్తత, జీవన భృతి అంటే..భరణం, మనోవర్తి, ఇతరత్రా మొదల్కెన అన్ని అంశాల్లో కుల మత, వర్గాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలన్న విశాల దృక్పథాన్ని విపక్షాలు అడ్డుకుంటున్నాయని గుర్తించాలి. నిజానికి దేశంలో ఇప్పటి వరకు మతపరమైన చట్టాలే ఉన్నాయి. హిందూ వివాహ, వారసత్వ చట్టాలు, షరియా లాంటి ముస్లిం పర్సనల్ చట్టాలు అమలవుతున్నాయి. వీటివల్ల ఎన్ని గందరగోళాలు వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. అందరిదీ ఒకే రక్తం అంటున్న వారు అందరికీ ఒకే రకమైన న్యాయం, చట్టం ఉండాలన్న సోయిని మరచి వ్యవహరిస్తున్నారు. మన దేశం ఒక లౌకిక రాజ్యంగా ఉండాలని, సర్వమత సమానత్వాన్ని పాటించాలని, అన్ని భాషలను గుర్తించి గౌరవించాలని రాజ్యాంగంలో అనేక అంశాలను చేర్చారు. కానీ ఇన్నేళ్లయినా కుల మతాల కారణంగా ప్రజలందరూ భయం భయంగా బతికే వాతావరణం దేశంలో చూస్తున్నాం. కులమతాలు వారి ఆచార వ్యవహారాలు ఇంటికే పరిమితం కావాలి. చట్టం ముందు అంతా ఒక్కటే అన్న భావనరావాలి. అంటే ఉమ్మడి పౌరస్మృతి ద్వారానే ఇది సాధ్యం అవుతుంది. భారత దేశ సమగ్రతను, సమ భావాన్ని గౌరవించే వాళ్ళందరూ ఏకోన్ముఖంగా పౌరస్మృతిని కోరాల్సిందే. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత భారత దేశాన్ని ఐక్యంగా ఉంచాలని చేస్తున్నప్రయత్నాలకు అడుగడున్నా అడ్డుకుంటున్నారు.
రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని గగ్గోలు పెడుతున్నారు. వీరి మాటలు పట్టించుకుని ఉంటే కాశ్మీర్లో 370 రద్దయ్యేది కాదు. ఎందుకంటే వారికి వోట్లు తప్ప దేశం గురించి పట్టదు. దేశాన్ని ఎందుకు విడదీశారో..మతప్రాతిపదిక ఎందుకు ఆ పనిచేశారో చర్చ చేయరు. భారత దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా అమలు కావాలంటే ఏకభావన రావాలి. సమాన హక్కులు ఉండాలి. ప్రజలంతా ఒక్కటే అన్న భావన పాదుకొల్పాలి. ఇంకా పేదలను పేదలుగా, మైనార్టీలను ఇంకోరకంగా చూసే సంస్కృతి పోవాలి. దానిని వదిలి కులగణన చేయాలన్న తీరు సరికాదా. ప్రతి ఒక్కరూ మనమంతా ఒక్కటే అన్న భావన కోసం చేసే ఎలాంటి ప్రయత్నాన్ని అయినా స్వాగతించాల్సిందే. ప్రజా వ్యతిరేక చర్యలను రెచ్చగొడుతూ.. మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రజల మధ్య మతాల పేర్లతో వైషమ్యాలను సృష్టిస్తూ భౌతికంగా దాడులు చేసుకునే వాతావరణాన్ని దూరం చేయాలి. అనేక భాషల ప్రజలు, అనేక మత విశ్వాసాలతో ఉన్నవారంతా కలసి మెలసి ఒకే రాజ్యంలో సహజీవనం చేసే సత్ సాంప్రదాయం భారత ప్రజల మధ్య ఉన్నది. అది ఇక నిరంతరంగా సాగాలి. జాతీయోద్యమంలో చీలిక తెచ్చేందుకు బ్రిటిష్ పాలకులు విభజించి పాలించు సూత్రంలో భాగంగా భారతీయ ప్రజల మధ్య హిందూ, ముస్లిం మతాల పేరుతో ప్రజల్ని విభజించే కార్యక్రమం చేసింది. రాజకీయ నాయకుల పుణ్యమా అని నేటికీ అదే కొనసాగు తోంది. అది పోవాలంటే ప్రజలంతా ఒక్కటే అన్న భావన రావాలి. ప్రజల్లో చట్టాల పట్ల గౌరవం ఉండాలి. నీకో చట్టం..నాకో చట్టం అన్న భావన ఉండరాదు. ప్రజల మధ్య ఐక్యత, దేశ సమగ్రత కాపాడుకోవడానికై అన్ని మతాలను సమభావనతో చూసేలా చట్టాలు ఉండాలి. మతాల ఆధారంగా చట్టాలు ఉండరాదు. ప్రజల ఆధారంగా చట్టాలు ఉండాలి. రాజకీయ పార్టీలు కళ్లు తెరవకుంటే నష్టపోయేది ప్రజలే. ప్రజలు ఈ విషయం లో రాజకీయ పార్టీలను నిలదీయాలి.
-చరణ్





