సీఎం రేవంత్‌ ‌నిర్లక్ష్యానికి 42 మంది విద్యార్థులు బలి

గురుకులాల్లో కానరాని వసతులు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 20 : ‌నల్లగొండ జిల్లా కేతెపల్లి మండల పరిధిలోని బీసీ గురుకులంలో ఓ విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో పాము కాటుకు గురై మరో గురుకుల విద్యార్థి హాస్పిటల్‌ ‌పాలైన వార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. కాంగ్రెస్‌ ‌పాలనలో బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు ప్రాణాపాయ స్థితిలో దవాఖానల్లో చేరుతుండడం సిగ్గుచేటన్నారు. గురుకులాల్లో కుక్కకాట్లు, ఎలుక కాట్లు, పాము కాట్లు తరచూ జరుగుతుండడం దురదృష్టకరమన్నారు.

విద్యాశాఖ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు తన వద్దనే ఉన్నా ముఖ్యమంత్రి ఏనాడూ సమీక్ష చేయడని హరీష్‌రావు మండిపడ్డారు. పురుగుల అన్నం తినలేక విద్యార్థులు ఆకలితో అలమటించినా పట్టించుకోడు… ఫుడ్‌ ‌పాయిజన్‌తో విద్యార్థులు హాస్పిటల్‌ ‌పాలైన పట్టించుకోడు. టీచర్లు కావాలంటూ విద్యార్థులు రోడ్డెక్కినా పట్టించుకోడు… పాముకాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లు, కరెంటు షాకులతో హాస్పిటల్‌ల పాలైనా పట్టించుకోడని విమర్శించారు.

మీ 11నెలల కాలంలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని,  ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకోవడం లేదని హరీష్‌ ‌రావు ధ్వజమెత్తారు.  రేవంత్‌ ‌రెడ్డి నిర్లక్ష్యం ఖరీదు 42 మంది విద్యార్థుల ప్రాణాలన్నారు. విద్యాశాఖ ప్రక్షాళన అంటూ ప్రగల్భాలు పలకడం కాదు.. గురుకులాల్లో కనీస సౌకర్యాలు కల్పించి, విద్యాబోధన జరిగేలా చూడండి. అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలు కాపాడండి అని హరీష్‌ ‌రావు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page