కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు అవమానకరం
మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం, 41శాతం రాష్ట్రలకు ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సెస్సులు, సర్ చార్జీలు విధించడం వల్ల రాష్ట్రాలకు వొచ్చే పన్నుల వాటా చాలా తగ్గిపోతున్నదని అన్నారు. జనాభా నియంత్రణ చేస్తూ, ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు మరింత వృద్ధి చెందేలా చేయూత ఇవ్వాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తే “చోటి సోచ్” అని అవమానించడం సిగ్గుచేటని అన్నారు. ఈ వ్యాఖ్యలు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చోటి సోచ్ కి నిదర్శనమని విమర్శించారు. చెబుతున్నది 41శాతం అయినా, రాష్ట్రాలకు నిజంగా అందుతున్నది మాత్రం 30 శాతమే అని అన్నారు.
రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం వొస్తే, రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రం ఖర్చు చేసే వీలుంటుందని, కాని సెస్ రూపంలో వసూలు చేసి కేంద్రం తన ఇష్టం వొచ్చిన రీతిలో, అంటే తమకు ఇష్టమైన రాష్ట్రాలకు ఇవ్వడం, తమకు అనుకూలంగా లేని రాష్ట్రాలకు మొండి చేయి చూపడం చేస్తోందని ఆరోపించారు. ఇలా ఆర్థిక అధికారాలు తమ దగ్గర పెట్టుకుని రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తోంది. రాష్ట్రాలు కేంద్రం వద్ద మోకరిల్లాలని చూస్తోంది.
ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమని అన్నారు. మరోవైపు పన్నుల్లో వాటా పెంచామని ప్రచారం చేసుకుంటూ, కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రాల వాటాను పెంచడం, వివిధ కేంద్ర ప్రాయోజిత ప్రభుత్వ పథకాలను కుదించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రకాలుగా నష్టపోతున్నదని అన్నారు. రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడితే అవమానకరంగా మాట్లాడటం స్థాయికి తగదని, . పీయూష్ గోయల్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు అన్నారు.