నేటి నుంచే వివరాల సేకరణకు సన్నాహాలు
కఆస్తులు, అప్పులు మొదలు కుటుంబ వివరాల సేకరణ
కవివరాలను గోప్యంగా కంప్యూటరీకరణకు చర్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5: రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేను బుధవారం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్లి మొత్తం 56 ప్రధాన ప్రశ్నలు వేస్తారు. వాటిలో కొన్నింటికి ఉప ప్రశ్నలు వేసి ప్రతి కుటుంబం నుంచి సమగ్రంగా సమాచారాన్ని సేకరించాలని ప్రభుత్వం గణకులకు నిర్దేశించింది. సర్వేలో కుటుంబ యజమాని, సభ్యుల వివరాలను నమోదు చేయడంతో పాటు కుటుంబంలోని ప్రతిఒక్కరి ఫోన్ నంబరు, వారుచేసే వృత్తి లేదా ఉద్యోగ వివరాలను సేకరిస్తారు. ఇందులో భాగంగా ఆస్తులెన్ని.. అప్పులెన్ని.. ఆదాయమెంత.. ఇంట్లో ఎంతమంది ఉంటారు.. ఎవరైనా విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లారా.. ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా.. ఇలా మొత్తం 75 రకాల ప్రశ్నలతో గణకులు వివరాలను సేకరించేలా ప్రశ్నావళిని రూపొందించారు. ఉన్నత చదువు లేదా ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి లేదా ఇతర అవసరాలకు వెళ్లారా.. అని కుటుంబ యజమానిని అడుగుతారు. విదేశాల్లో యూకే, అమెరికా, గల్ఫ్, ఆస్ట్రేలియా, కెనడాలతో పాటు ఐరోపా దేశాలకు వెళ్లినట్లు చెబితే ఒక్కో దేశానికి ఒక ప్రత్యేక కోడ్ నమోదు చేస్తారు. మరే దేశానికి వెళ్లినా ఇతర దేశం అనే కోడ్ నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ నుంచి ఎందరు వలస వెళ్లారు.. ఏ కారణంతో బయటకు వెళ్లారనే సమగ్ర సమాచారం సేకరించడానికి ఈ ప్రశ్నలు రూపొందించినట్లు తెలుస్తోంది.
ప్రజలు తీసుకున్న రుణాలపై ప్రత్యేకంగా మూడు ప్రశ్నలు అడుగుతారు. గత ఐదేళ్లలో ఏమైనా అప్పులు తీసుకున్నారా.. ఎందుకు తీసుకున్నారు.. ఎక్కడి నుంచి రుణం పొందారు.. అనే ప్రశ్నలను ప్రతి కుటుంబాన్ని అడగాలని నిర్ణయించారు. బ్యాంకులు, స్వయంసహాయక సంఘాల నుంచే కాకుండా వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్నారా అనే వివరాలను కూడా చెప్పాలి. కుటుంబ సభ్యులందరి స్థిర, చరాస్తుల వివరాలన్నీ చెప్పాలి. చరాస్తుల వివరాలను వేర్వేరుగా నమోదు చేస్తారు. వీటిలో బ్కెకు, స్కూటర్, సొంత అవసరాలకు వాడే కారు, కిరాయికి తిప్పుతున్న కారు వంటివి ఉన్నాయా? వాషింగ్ మిషన్, ఫ్రిజ్, ఏసీ, టీవీ, స్మార్ట్‌ఫోన్ ఇలా మొత్తం 18 రకాల చరాస్తుల వివరాలన్నీ చెప్పాలి. ఒక కుటుంబంలోని సభ్యులందరికీ కలిపి ఇవన్నీ ఎన్ని ఉన్నాయి.. వాటి విలువ ఎంత అనేది తెలపాలి. మీ ఇల్లు ఎన్ని గజాల్లో.. ఏ ప్రాంతంలో ఉంది? ఇంటిలో ఉన్న మొత్తం గదులెన్ని.. బాత్‌రూం, మరుగుదొడ్డి ఉన్నాయా ఇలాంటి వివరాలన్నీ చెప్పాలి. మీకు ఎంత భూమి, ఎన్ని ఎకరాల్లో ఉంది.. అది పట్టా భూమా? లేదా ప్రభుత్వం ఇచ్చిన ఎసైన్డ్ లేదా పట్టాలేని అటవీ భూమా.. వంటి వివరాలు కూడా సేకరిస్తారు. గత ఐదేళ్లలో ఏమైనా సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందారా? ఆ పథకాల పేర్లు ఏమిటి? వంటి వివరాలు సేకరిస్తారు. కుటుంబంలో ఎవరైనా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా.. ఎన్నికైతే రిజర్వేషన్‌లోనా, ఎన్ని పర్యాయాలు అనేది చెప్పాలి. రాష్ట్రపతి, ప్రధాని తప్ప మిగతా ఏ హోదాలో ప్రజాప్రతినిధిగా పనిచేసినా వివరాలు చెప్పాలి. వార్డు సభ్యుడి నుంచి కేంద్రమంత్రి, గవర్నర్, సీఎం దాకా ఏ పదవి పొందినా సరే నమోదు చేయించాలి.
స్పష్టమైన సమాచార సేకరణ
సర్వే సమయంలో గణకులు కుటుంబాల నుంచి స్పష్టమైన సమాచారాన్ని తీసుకోవాలి. ప్రతి ఇంట్లో నివసించే కుటుంబసభ్యుల సంఖ్య తీసుకోవాలి. సర్వే ఫారంలో ఇంటి నంబరు, యజమాని పేరు వంటి వివరాలు నమోదు చేయాలి. సర్వే పూర్తయిన ఇంటిగోడపై స్టిక్కర్ అతికించాలి. సర్వే చేసిన తర్వాత ఫారాల్లో నమోదు చేసిన వివరాలను కంప్యూటర్లో నిక్షిప్తం చేయాలి. ఈ పక్రియ చాలా కీలకం. డేటాఎంట్రీ సమర్థంగా నిర్వహిస్తేనే విశ్లేషణ కచ్చితత్వం సాధిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రణాళికశాఖ జిల్లా, మండలాల్లో అవసరమైన డేటాఎంట్రీ ఆపరేటర్లను గుర్తించి, వారికి శిక్షణ పూర్తిచేసింది. ప్రతిరోజూ గణకులు తీసుకువచ్చిన వివరాల్ని నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఆపరేటర్లు నమోదు చేస్తున్న వివరాలను సూపర్‌వైజర్ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.సర్వే సమయంలో కుటుంబం నుంచి తీసుకున్న సమాచారం విషయంలో గోప్యత పాటించాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. ఈ విషయాన్ని గణకులు ముందుగానే యజమానికి వివరిస్తారు. ఎక్కడా ఈ సమాచారం బయటపెట్టరని హామీ ఇస్తారు. ఫారంలోని వివరాలన్నీ నింపిన తర్వాత వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తారు. గణకులు వివరాలను డేటాఎంట్రీ కేంద్రంలోని ఆపరేటర్‌కు ఇచ్చి వాటిని పూర్తిచేయిస్తారు. ఆ సమయంలోనూ ఫారాలను గోప్యంగా ఉంచడంతో పాటు ఆ డేటాను ఇతరులతో పంచుకోకుండా జాగ్రత్త వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. రోజువారీ నిర్వహించిన సర్వే వివరాలు, పురోగతిని సాయంత్రం 6 గంటల్లోపు ప్రణాళిక శాఖకు పంపించాలి. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే అంటే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయడానికి శాసనసభ తీర్మానం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి అవసరమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలు మెరుగు పరిచేందుకు, అన్నివర్గాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపింది. ఈ సర్వేకు ప్రణాళిక శాఖ నోడల్ విభాగంగా వ్యవహరిస్తోంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ సర్వే జరగనుంది. జిల్లా, మండల నోడల్ అధికారులు.. ఎన్యూమరేషన్ బ్లాక్(ఈబీ)ల గుర్తింపు, గణకుల నియామకం, ఇళ్ల జాబితా, డేటా ఎంట్రీతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. సెన్సెస్ డ్కెరెక్టరేట్ నుంచి ఈబీ మ్యాపులు తీసుకోవడం, లేనిప్రాంతాల్లో కొత్తవాటిని రూపొందించాల్సి ఉంటుంది.దాదాపు 80 వేల మంది ఉద్యోగులు సర్వేలో పాల్గొంటారు. వీరిలో విద్యాశాఖ నుంచి 48,229 మంది ఉంటారు. ఉపాధ్యాయులే కాకుండా ఇతర కేటగిరీల ఉద్యోగులను సైతం వీలును బట్టి సర్వేకు వినియోగిస్తారు.సర్వే చేయడానికి ఇళ్లను ఈబీలుగా విభజిస్తారు. ఒక గ్రామంలో కనీసం 175 కుటుంబాలుంటే మొత్తంగా దాన్ని ఒకే ఈబీగా నిర్ణయించి ఒక గణకుడికి అప్పగిస్తారు. అంతకన్నా ఎక్కువ కుటుంబాలుంటే వాటిని చిన్న యూనిట్లుగా.. కనీసం ఒక్కో ఈబీలో 150 ఇళ్లు ఉండేలా విభజించి గణకులను నియమించి సర్వేను సకాలంలో పూర్తిచేస్తారు. ఈ నెలాఖరుకల్లా సర్వే పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.




