మహిళలపై యథాలాపంగా నా వ్యాఖ్యలు

  • ఇప్పటికే విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన చేశా
  • మహిళా కమిషన్‌ ‌ముందు హాజరైన బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌
  • ‌రాష్ట్రంలో మహిళల సమస్యలపై కమిషన్‌కు ఫిర్యాదు
  • రాఖీలు కట్టి పెద్ద మనసు చాటుకున్న మహిళా కమిషన్‌ ‌సభ్యులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ‌తాను మహిళలలపై యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే విచారం వ్యక్తం చేశానని బిఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌తెలిపారు. శనివారం మహిళా కమిషన్‌ ‌ముందు విచారణకు హాజరైన అనంతరం ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్‌ ‌నేతలు కమిషన్‌ ‌కార్యాలయం వద్దకు వొచ్చి రాజకీయం చేశారన్నారు. బిఆర్‌ఎస్‌ ‌మహిళా నేతలపై దాడి చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అనుసరిస్తున్న వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలను గౌరవించాలని విచారణకు వొచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలోని సమస్యలను కమిషన్‌ ‌దృష్టికి తీసుకెళ్లామన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, వసతి గృహాల్లో పిల్లల సమస్యలపై ప్రస్తావించినట్లు కేటీఆర్‌ ‌తెలిపారు.

అంతకుముందు విచారణ సందర్భంగా కేటీఆర్‌కు మహిళా కమిషన్‌ ‌సభ్యులు రాఖీలు కట్టారు. మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చేందుకని ఆయన వస్తే.. మహిళా కమిషన్‌ ‌సభ్యులు పోటీలు పడి మరీ రాఖీలు కట్టడం ఒకింత ఆశ్చర్యంగా అనిపించింది. విచారణకు పిలిచి కేటీఆర్‌కు రాఖీ కట్టి సోదర అనుబంధాన్ని మహిళా కమిషన్‌ ‌సభ్యులు చాటుకున్నారు. అనంతరం ఉచిత బస్సు ప్రయాణ విషయంలో మహిళలపై తాను చేసిన కామెంట్స్ ‌యథాలాపంగా చేసినవేనని కేటీఆర్‌ ‌వివరణ ఇచ్చారు. మహిళలంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై ఇటీవల జరిగిన దాడులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ ‌కోరారు. నెల 15వ తేదీన తెలంగాణ భవన్‌లో స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ ‌కార్యకర్తల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌.. ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంలో మంత్రి సీతక్క ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై కొంతమంది చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్‌ ‌కౌంటర్‌ ఇచ్చారు. బస్సుల్లో మహిళలు బ్రేక్‌ ‌డాన్స్, ‌రికార్డింగ్‌ ‌డాన్సులు చేసినా తాము ఏమంటామని అంటూ వ్యంగ్యంగా కేటీఆర్‌ ‌మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. హిళలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ ‌వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేస్తూ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మహిళల గురించి వివాదాస్పద కామెంట్స్ ‌చేశారని మహిళా కమిషన్‌ ‌సుమోటోగా స్వీకరించి నోటీస్‌ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇవాళ కేటీఆర్‌ ‌మహిళ కమిషన్‌ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *