దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని డిజిపికి ఆదేశం
న్యూదిల్లీ, ప్రజాతంత్ర జూలై 4 : మియాపూర్‌లో రియల్ ఎస్టేట్ కార్యాలయంలో పనిచేస్తున్న యువతిపై అత్యాచారయత్నం జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. పారదర్శకంగా విచారణ జరిపి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని డీజీపీ రవిగుప్తాను ఆదేశించింది. బాధితురాలికి మెరుగైన వైద్య పరీక్షలు ఉచితంగా అందించాలని లేఖలో కమిషన్ పేర్కొంది. నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తున్న యువతిపై అదే కంపెనీ ఉద్యోగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు మత్తు మందు ఇచ్చి గ్యాంగ్ రేప్ చేశారు. జూన్ 30న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని కడప జిల్లాకు చెందిన ఓ యువతి(25) ఉద్యోగం కోసం ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌కు వచ్చింది. ఉప్పల్‌లో విమెన్స్ హాస్టల్‌లో ఉంటున్నది. ఉద్యోగం కోసం వెతుకుతున్న క్రమంలో మియాపూర్‌లోని జేఎస్‌ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా అవకాశం వచ్చింది.
దీంతో గత నెల 29న అక్కడ జాబ్ లో జాయిన్ అయింది. అదే కంపెనీలో జహీరాబాద్‌కు చెందిన సంగారెడ్డి, ఏపీలోని కర్నూల్ జిల్లాకు చెందిన జనార్దన్ పని చేస్తున్నారు. వీళ్లిద్దరూ ఆమెతో పరిచయం పెంచుకున్నారు. గత నెల 30న యాదగిరిగుట్టలో కంపెనీ మీటింగ్ ఉండగా, దానికి తీసుకెళ్తామని చెప్పారు. యువతిని 30న ఉదయం సన్ సిటీలో కలిశారు. అక్కడి నుంచి మియాపూర్‌లోని శ్రీలక్ష్మి హాస్టల్ కు తీసుకొచ్చి, అక్కడ ఫ్రెషప్ కావాలని చెప్పారు. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం హాస్టల్ కు వచ్చి కారులో యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. కంపెనీ మీటింగ్ ముగిసేసరికి రాత్రి 9 గంటలైంది. ఆ తర్వాత కారులో ముగ్గురూ హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే మార్గమధ్యలో రాత్రి 10:30 గంటల ప్రాంతంలో కారు బ్రేక్‌డౌన్ అయినట్టు సంగారెడ్డి, జనార్దన్ నటించారు. నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ వద్ద కారును నిలిపివేశారు.
కారు స్టార్ట్ కావడం లేదని నమ్మించారు. తినడానికి ఏమైనా తేవాలా? అని యువతిని అడిగారు. ఆమె వద్దన్నా.. జనార్దన్ దగ్గర్లోని షాప్‌కి వెళ్లి స్వీట్స్, కూల్‌డ్రింక్ తీసుకొచ్చాడు. అప్పటికే తమ వద్ద సిద్ధంగా ఉంచుకున్న మత్తు మందును కూల్‌డ్రింక్‌లో కలిపి యువతికి ఇచ్చారు. దీంతో ఆమె నిద్రలోకి జారుకుంది. ఆ తర్వాత సంగారెడ్డి, జనార్దన్ కారులోనే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. ఈ నెల 1న తెల్లవారుజామున 3 గంటల వరకు లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని మియాపూర్ లోని హాస్టల్ వద్ద దించి వెళ్లిపోయారు. బాధితురాలు స్పృహలోకి వచ్చిన తర్వాత ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఆ కేసును మియాపూర్ పీఎస్ కు ట్రాన్స్ ఫర్ చేశారు.