కౌశిక్ రెడ్డిపై కేసు దుర్మార్గం
కేసులతో ప్రతిపక్షాలను బెదిరించే యత్నం
మండిపడ్డ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్
ఎఇఇ సివిల్ ఉద్యోగుల జాబితా విడుదల చేయండి : టీఎస్‌పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి కెటిఆర్ ఫోన్
సిరిసిల్లలో నేత కార్మికుడు పల్లె యాదగిరి ఆత్మహత్య కాదు..ప్రభుత్వ హత్యేనన్న కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3 : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుపట్టారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు భయపడరన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా పాలనంటే ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టటమేనా..? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యలను జడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావటమే కౌశిక్ రెడ్డి చేసిన నేరమా.. అని కేటీఆర్ ప్రశ్నించారు. నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలతోపాటు తరగతి గదులలో పారిశుద్ధ్య నిర్వహణ, వసతుల కల్పనపైన మండల విద్యాధికారితో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించటం తప్పా అని ప్రశ్నించారు. ఈ సమావేశానికి ఎందుకు హాజరయ్యారంటూ మండల విద్యాధికారులకు డీఈవో అక్రమంగా నోటీసులు ఇవ్వటమేమిటని అన్నారు. ప్రభుత్వాధికారి అయిన డీఈవో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగ వ్యవహరిస్తున్నారనే అంశాన్ని జడ్పీ సమావేశంలో కౌశిక్ లేవనెత్తారని కేటీఆర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేగా తనకున్న అధికారాల మేరకు సమావేశం నిర్వహించటానికి కూడా హక్కు లేదా..? అని ప్రశ్నించారు. దళిత బంధు చెక్కుల పంపిణీతో పాటు, ప్రభుత్వ హాస్పిటల్‌లో కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, మహిళల కోసం అదనంగా ప్రభుత్వ హాస్పిటల్‌లో గైనకాలజిస్టును నియమించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ అడిగారని, ఇది కూడా నేరమేనా..అంటూ కేటీఆర్ నిలదీశారు.
జడ్పీ సమావేశంలో కలెక్టర్ పట్టించుకోక పోవటంతో నిరసన తెలిపే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక ప్రజా ప్రతినిధికే నిరసన తెలిపే హక్కు లేదా అని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేసిన అంశాలపై దృష్టి పెట్టాల్సింది పోయి ప్రతిపక్షాల నోరు మూయించాలనే కుట్రతో అక్రమ కేసులకు తెరతీస్తున్నారన్నారని విమర్శించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఈ కేసు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించటం దుర్మార్గ పూరిత చర్య అని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే కేసును ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కౌశిక్ రెడ్డి నియోజకవర్గం లోనే ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారని, ప్రభుత్వ పెద్దల అవినీతి బాగోతం, అక్రమాలను బయటికి తెస్తున్నారని, అందుకే కేసుల ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రశ్నించే వి•డియా, ప్రజాప్రతినిధులపై కేసులు పెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అంటే ఇదేనా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి ఎన్ని బెదిరింపులకు పాల్పడినా సరే బీఆర్‌ఎస్ ప్రజా గొంతుకగా ఉంటుందని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కుంటామన్నారు. ఇప్పటికైనా ప్రతీకార చర్యలు మాని ప్రజలకు మేలుచేసే పనులు చేయాలని సూచించారు.
ఎఇఇ సివిల్ ఉద్యోగుల జాబితా విడుదల చేయండి : టీఎస్‌పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి కెటిఆర్ ఫోన్
టీఎస్‌పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేశారు. ఏఈఈ సివిల్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ఎంపిక జాబితాను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌ను నందినగర్‌లోని ఆయన నివాసంలో ఏఈఈ (సివిల్) రాసిన అభ్యర్థులు కలిశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫై చేసిన 1180 పోస్టులకు పరీక్షలు జరిగాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరీక్షకు సంబంధించిన ఎంపిక జాబితాను పెండింగ్‌లో పెట్టింది. ఇదే విషయాన్ని అభ్యర్థులు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కేటీఆర్.. విషయానికి సంబంధించి టీఎస్‌పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో మాట్లాడారు. సెలక్షన్ జాబితాను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. ఈ విషయమై కేటీఆర్ ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఏఈఈ (సివిల్) పరీక్షకు సంబంధించి 1180 పోస్టులకు ఎంపిక జాబితాను ప్రకటించటంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆ ప్రకటనలో ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు తుది జాబితాను విడుదల చేయటం లేదని పేర్కొన్నారు. అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే జాబితా ప్రకటించాలని కేటీఆర్ కోరారు.
సిరిసిల్లలో నేత కార్మికుడు పల్లె యాదగిరి ఆత్మహత్య కాదు..ప్రభుత్వ హత్యేనన్న కెటిఆర్
కాంగ్రెస్ సర్కారు పరిపాలనా వైఫల్యం వల్లనే సిరిసిల్లలో మరో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక ఉరి వేసుకుని పల్లె యాదగిరి అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం పట్ల ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో చేనేతకు అందించిన చేయూతను అర్దాంతరంగా నిలిపివేయడంతోనే ఈ రంగంలో మరణమృదంగం మోగుతుందని ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.