– ఆ రెండూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయ్
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : రాష్ట్రంలో గతంలో పాలించిన బీఆర్‌ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండూ ఎంఐఎం (మజ్లిస్) కనుసన్నల్లో నడుస్తూ హైదరాబాద్ నగర ప్రజలను తీవ్రంగా మోసం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూకట్‌పల్లి బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలోని ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్, బీఆరఎస్‌ల తీరును ఎండగట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో గరీబోళ్లను నిలువునా ముంచితే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు అంటూ అదే తరహాలో ప్రజలను వంచిస్తోందని మండిపడ్డారు. నివేదికల పేరుతో కాలయాపన చేస్తూ రెండు పార్టీలు కూడా నగరంలోని పేదలకు తీవ్ర అన్యాయం చేశాయని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ పరిధిని విభజించి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనే ఆలోచన కేవలం మజ్లిస్ పార్టీ ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. మూడు భాగాలుగా విడగొడితే తప్ప మజ్లిస్ గెలవలేని పరిస్థితి ఉందని, అందుకే వారి కోసం జీహెచఎంసీని అశాస్త్రీయంగా మూడుగా విభజించారని ఆయన విమర్శించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జిల్లాల విభజనలో ఒకే అసెంబ్లీ నియోజకవర్గం మూడు జిల్లాల్లోకి పోయేలా గందరగోళం సృష్టించారని, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని ధ్వజమెత్తారు. అధికారులను మ్యాప్ అడిగితే వారి వద్ద ఎలాంటి స్పష్టత లేదని, ఎక్కడ ఏ సరిహద్దు వస్తుందో తెలియకుండానే నగరాన్ని ముక్కలు చేయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా పడకేసిందని రామచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు, నాలుగు రోజులకు ఒకసారి కూడా నీళ్లు రాక ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారని, జలమండలి తీవ్రంగా విఫలమైందని విమర్శించారు. మరోవైపు వర్షం వస్తే బస్తీలన్నీ మునిగిపోయే పరిస్థితి ఉందని, బీఆర్‌ఎస్ హయాంలో వరదలు వస్తే ఇళ్లల్లో నీళ్లు చేరిన వారిలో కొంతమందికి ఇచ్చిన రూ.10 వేల సాయం కూడా ఆ పార్టీ నేతల జేబుల్లోకి పోయిందని గుర్తు చేశారు. రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు. హిల్ట్ పాలసీ పేరుతో కాలుష్యకారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించాలనే నెపంతో లోపల ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను రెసిడెన్షియల్ జోన్లుగా మార్చి భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. పరిశ్రమల తరలింపు వల్ల ఎంతమంది ఉపాధి కోల్పోతారు.. ఎంతమందికి కొత్తగా ఉద్యోగాలు వస్తాయి అనే అంశంపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత లేదన్నారు. గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కమీషన్ల శాతాన్ని 30% నుండి 40%కి పెంచి బిల్డర్లను వేధిస్తోందని, దీంతో నగరంలో కొత్త వెంచర్లు రాక రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిన్నదని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ను సుందర నగరంగా, విశ్వనగరంగా మార్చడం కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. స్మార్ట్ సిటీ, అమృత్ సిటీ వంటి స్కీమ్స్ నిధులతో తెలంగాణలో కేంద్రం అభివృద్ధి చేస్తోందని తెలిపారు. పర్యాటక రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు వాగ్దానం చేశారు. తమ స్వప్రయోజనాల కోసం హైదరాబాద్ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న మజ్లిస్, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నగర ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పి బీజేపీని గెలిపించాలని రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




