– ప్రభుత్వంతో ఎంవోయు చేసుకున్న రీజెనరాన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : అత్యున్నతస్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన ట్యాలెంట్ పూల్ అందుబాటులో ఉండటం వల్ల ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ గ్లోబల్ సామర్థ్య కేంద్రాల (జీసీసీ) ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంటున్నాయని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. జీసీసీల రాకతో మన ఐటి ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. న్యూయార్క్‌లోని ట్యారిటౌన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయోటెక్ దిగ్గజం రీజెనరాన్ అమెరికా వెలుపల మొదటి జీసీసీని ఏర్పాటు చేయడానికి మన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవడం మన ప్రతిష్ఠను మరింత పెంచుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేసారు. రీజెనరాన్ సీనియర్ వైస్ ప్రెసిడెండ్ బ్యారీ కోవల్ ఆధ్వర్యంలో ఓ ప్రతినిధి బృందం మంత్రి శ్రీధర్‌బాబుతో సచివాలయంలో మంగళవారం భేటీ అయింది. ఈ సందర్బంగా మంత్రి సమక్షంలో జీసీసీ¾ఏర్పాటుకు సంబంధించి బ్యారీ కోవల్. తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈవో సర్వేశ్‌సింగ్‌లు అవగాహన పత్రాల (ఎంఓయు)ను మార్చుకున్నారు. అనంతరం శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రెజెనరాన్‌కు ఐర్లాండ్, యూకే, జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో కార్యాలయాలు, ఉత్పత్తి కేంద్రాలు ఉన్నప్పటికీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జీసీసీ ప్రత్యేకమైన గ్లోబల్ హబ్‌గా పనిచేస్తుందని తెలిపారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలను సమన్వయం చేస్తూ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ, అధునాతన డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరింగ్, కమర్షియల్ అనలిటిక్స్ వంటి అత్యున్నతస్థాయి డిజిటల్ సేవలను అందిస్తుందని చెప్పారు. జీసీసీల కేంద్రంగా ముంబయి, దిల్లీ, చెన్నైలను అధిగమించి హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డిజిటల్ టెక్నాలజీల రంగాల్లో ఉన్న బలమైన ఎకో సిస్టం ప్రపంచ కంపెనీలను ఆకర్షిస్తోందన్నారు. జీనోమ్ వ్యాలీ విస్తరణ, త్వరలో ఏర్పాటు కానున్న గ్రీన్ ఫార్మా సిటీ వంటివి రాష్ట్ర లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. ప్రపంచంలో ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థల్లో ఒకటైన రెజెనెరాన్ ఇప్పటికే అనేక ఔషధాలను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. సమావేశంలో రెజెనెరాన్ జీసీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ ఓనాట్, సంస్థ ప్రతినిధులు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




