మాకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకే వాకౌట్
రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగం సందర్భంగా ‘ఇండియా’ వాకౌట్‌పై ఖర్గే
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూలై 3 : అబద్ధాలు చెప్పడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం ప్రధాని మోదీకి అలవాటని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే విమర్శించారు. బుధవారం రాజ్య సభలో ప్రధాని మోదీ ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సందర్భంగా విపక్ష ఇండియా కూటమి పార్టీలు వాకౌట్ చేయడంపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఖర్గే మీడియాతో మాట్లాడుతూ…అబద్ధాలు చెప్పడం, ప్రజలను తప్పుదారి పట్టించడం, సత్యదూరమయిన విషయాలు చెప్పడం మోదీకి అలవాటన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగానికి వ్యతిరేకమని వారంటున్నారని, కాని వాస్తవంగా బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్, జన్ సంఘ్, వారి రాజకీయ పూర్వీకులు భారత రాజ్యాంగాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని, ఆ సమయంలో వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ దిష్టిబొమ్మలను సైతం దహనం చేశారని,
ఇది సిగ్గుచేటైన విషయమని అన్నారు. వాస్తవానికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత కాంగ్రెస్‌కే ఇచ్చారని ఖర్గే పేర్కొన్నారు. మోదీ తన ప్రజంగంలో అబద్ధాలు మాట్లాడుతన్నప్పుడు అభ్యంతరం చెప్పడానికి తమకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వనందునే తాము వాకౌట్ చేశామని ఖర్గే తెలిపారు. రాజ్యాంగానికి ఎవరు అనుకూలం..ఎవరు వ్యతిరేకమన్నాది తాను స్పష్టం చేయాలనుకుంటున్నానన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ 1950లో తమ పత్రిక ‘ఆర్గనైజర్’ సంపాదకీయంలో రాజ్యాంగంలో భారతదేశ చరిత్ర గురించి ఏమీ లేదని పేర్కొనడం ద్వారా వారు దానిని వ్యతిరేకించినట్టు స్పష్టమవుతన్నదని ఖర్గే అన్నారు.