– మీరాకుమార్ అధ్యక్షతన కార్యక్రమం
– వోటర్ల జాబితాల సవరణపై ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాల ప్రశ్నలు
– రేపు రామ్‌లీలా మైదాన్‌లో భారీ సభ
– ప్రదర్శనకు అనుమతి కోరలేదన్న దిల్లీ పోలీసులు
దిల్లీ, ప్రజాతంత్ర ప్రత్యేక వార్త | అక్టోబర్ 31: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇండి కూటమి శనివారం దిల్లీలో ప్రతీకాత్మక ప్రజా అభిశంసన కార్యక్రమాన్ని నిర్వహించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధికారిక నివాసమైన 10, రాజాజీ మార్గ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షత వహించారు. జ్ఞానేశ్ కుమార్‌పై ఆరు ఆరోపణలను ప్రతిపక్షాలు ముందుంచి, ఆయనను అభిశంసించాలనే ప్రతీకాత్మక తీర్మానాన్ని ఆమోదించాయి.వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎన్నికల సంఘం స్వతంత్రత, వోటర్ల నమోదు ప్రక్రియలో పారదర్శకత, ప్రజల వోటు హక్కు పరిరక్షణ వంటి అంశాలను కార్యక్రమంలో ప్రస్తావించాయి. ఖర్గే ప్రవేశపెట్టిన తీర్మానంలో వోటర్ల జాబితాల నిర్వహణ, పేర్ల చేర్పులు–తొలగింపులు, ఎన్నికల సంఘం నిర్ణయాలపై జవాబుదారీతనం వంటి అంశాలను ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఎన్నికల ప్రక్రియలో అధికార దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ జ్ఞానేశ్ కుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ దేశద్రోహం కింద విచారణ జరపాలని కూడా ప్రతిపక్షాల తీర్మానం చేశాయి. మాక్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇండి కూటమి ఎంపీలు, నేతలు పాల్గొన్నారు.
రేపు దిల్లీలో భారీ బహిరంగ సభ 
నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో జరగనున్న నిరసన సభకు హాజరుకావాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం మరోసారి ప్రజలకు పిలుపునిచ్చారు. మింటో రోడ్–కన్నాట్ ప్లేస్ కూడలి నుంచి మధ్యాహ్నం ప్రదర్శనగా రామ్‌లీలా మైదాన్‌కు చేరుకోవాలని ప్రతిపక్షాల ప్రణాళిక. అయితే రామ్‌లీలా మైదాన్‌లో సభ నిర్వహించేందుకు అనుమతి ఉన్నప్పటికీ, అక్కడికి వెళ్లే రహదారి ప్రదర్శనకు అనుమతి కోరలేదని దిల్లీ పోలీసులు తెలిపారు.దిల్లీ పోలీసు అధికారుల ప్రకారం, న్యూ దిల్లీ, సెంట్రల్ జిల్లాల పోలీసులకు ప్రతిపాదిత ప్రదర్శనపై అధికారిక సమాచారం అందలేదు. పరిస్థితిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.ఇండియా కూటమి తీర్మానంలో ఎస్ఐఆర్ కారణంగా 13.2 కోట్ల మంది వోటర్ల పేర్లు ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపించింది. తీర్మానంలో ప్రతిపక్షాలు చేసిన ఆరు ప్రధాన ఆరోపణలీవిధంగా వున్నాయి. బీజేపీకి అనుకూలంగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే కుట్రలో భాగస్వామ్యం, ఎస్ఐఆర్ ద్వారా అర్హులైన వోటర్ల పేర్లను తొలగించడం,పార్లమెంటరీ పర్యవేక్షణ లేకుండా ఫారం–6 నిబంధనలను మార్చడం, ఈఆర్వోనెట్, ఈసీఐనెట్ వ్యవస్థల ద్వారా వోటర్ల జాబితాల నియంత్రణను కేంద్రీకరించడం,ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం,రాజ్యాంగబద్ధమైన స్వతంత్రతను కాపాడకుండా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ సీఈసీ జ్ఞానేష్‌కుమార్‌పై ఆరోపణలు చేశారు.
బీజేపీ ఎదురు దాడి
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తొలగింపును కోరుతూ ప్రతిపక్ష ఇండియా కూటమి శనివారం నిర్వహించిన ప్రతీకాత్మక ప్రజా అభిశంసనపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. కాంగ్రెస్ రాజ్యాంగ సంస్థలను అవమానిస్తోందని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర విమర్శించారు. మరోవైపు, వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పూర్తయినప్పటికీ అర్హులైన పౌరులు తమ పేర్లను తిరిగి చేర్పించుకునే అవకాశం కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జ్ఞానేశ్ కుమార్‌పై ఆరు ఆరోపణలతో ప్రతీకాత్మక తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం సంబిత్ పాత్ర దిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
ప్రతిపక్షాల నమూనా పార్లమెంటు ఒక రాజకీయ నాటకమని విమర్శించారు. దేశంలో తొలిసారిగా వోటు చోరీకి పాల్పడింది మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూయేనని, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ను ప్రధాని కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు ఎస్ఐఆర్పై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని పాత్ర విమర్శించారు. వోటర్ల జాబితాల్లో కనిపించని నమోదులన్నీ అక్రమంగా తొలగించిన అర్హులైన వోటర్లవేనని చెప్పలేమని వాదించారు.
ఎస్ఐఆర్ ముగిసినా పేర్లు చేర్చుకోవచ్చు: సుప్రీంకోర్టు
ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయినంత మాత్రాన వోటర్ల జాబితాలు శాశ్వతంగా మూసివేయబడవని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది.
ఉత్తరప్రదేశ్, కేరళ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనల ధర్మాసనం విచారించింది.ఎస్ఐఆర్ గడువును పొడిగించేందుకు ధర్మాసనం నిరాకరించింది. అయితే అర్హులైన వ్యక్తుల పేర్లను వోటర్ల జాబితాల్లో చేర్చడం నిరంతర ప్రక్రియ అని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లో ఫారం–7 దరఖాస్తులను పెద్దసంఖ్యలో స్వీకరించడంలో కొన్ని అవకతవకలు జరిగినట్లు ఎన్నికల సంఘం అంగీకరించిందని, సంబంధిత అధికారులపై చర్యలు ప్రారంభించినట్లు సంఘం తెలిపింది.కేరళలో ఇంకా 24 లక్షల మంది వోటర్లు జాబితాలకు వెలుపల ఉన్నారని సీపీఎం తరఫున వాదనలు వినిపించగా, సంబంధిత వివరాలను ఎన్నికల సంఘానికి అందించాలని న్యాయస్థానం సూచించింది.
రాహుల్, రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు శనివారం కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేశారు. దిల్లీలో వోటు చోరీకి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్లడాన్ని ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు.అ యితే అక్టోబర్ 9న కేటీఆర్ స్వయంగా జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్లో అవకతవకలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరారు.
ప్రజా అభిశంసనకు పౌరసంఘాల మద్దతు 
ఖర్గే నివాసంలో జరిగిన కార్యక్రమంలో స్వరాజ్ ఇండియా నాయకుడు యోగేంద్ర యాదవ్ ప్రతిపక్షాల ప్రజా అభిశంసన ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.ఎన్నికల సంఘం విశ్వసనీయత దెబ్బతింటోందని ఆయన ఆరోపించారు.సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ, తన వోటు హక్కును నిర్ధారించుకోవడానికి రెండుసార్లు విచారణకు హాజరుకావాల్సి వొచ్చిందని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు మహిళలు కూడా అవసరమైన పత్రాలు సమర్పించినప్పటికీ తమ పేర్లు తొలగిపోయాయని కార్యక్రమంలో ఆరోపించారు.
రేపటి దిల్లీ ప్రదర్శనపై అనిశ్చితి
నవంబర్ 1న మధ్యాహ్నం 12 గంటలకు కన్నాట్ ప్లేస్ సమీపంలోని మింటో రోడ్ కూడలి నుంచి అజ్మేరీ గేట్ మీదుగా రామ్‌లీలా మైదాన్‌కు ప్రదర్శన నిర్వహించాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. అయితే రామ్‌లీలా మైదాన్ సభకు పోలీసు అనుమతి ఉన్నప్పటికీ, రహదారిపై ప్రదర్శన నిర్వహించేందుకు ప్రత్యేక దరఖాస్తు అందలేదని దిల్లీ పోలీసులు తెలిపారు.సభ భద్రత కోసం సుమారు 3,500 మంది పోలీసులను మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. రామ్‌లీలా మైదాన్‌ను 14 భద్రతా విభాగాలుగా విభజించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





