విచ్ఛిన్న‌క‌ర‌ శక్తులతో కాంగ్రెస్ ధర్నాలు సిగ్గుచేటు

– ప్రభుత్వాన్ని రద్దు చేసి బ్యాలెట్ ఎన్నికలకు రావాలి
– రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : దేశానికి స్వాతంత్య్రం తెచ్చామని జబ్బలు చరుచుకునే కాంగ్రెస్ పార్టీ విదేశీ నిధులతో నడుస్తున్న సంస్థలు, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న శక్తులతో కలిసి పనిచేయడం సిగ్గుచేటని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మీరు ఏ దేశానికి భక్తులు.. ఏ దేశం కోసం పనిచేస్తున్నారు అని కాంగ్రెస్ నేతలను నిలదీశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, ‘సర’ ఇన్‌చార్జి బండారి శాంతికుమార్, రాష్ట్ర నాయకుడు డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, అధికార ప్రతినిధులు జె.సంగప్ప, సునీత తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈవీఎంలపై విషప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలకు రావాలని బండి సవాల్ విసిరారు. ఈ సవాల్‌ను స్వీకరిస్తే బ్యాలెట్ ఎన్నికలు జరిగేలా తాను కూడా కృషి చేస్తానని స్పష్టం చేశారు. 140 కోట్ల ప్రజల ఆశీస్సులున్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏమీ చేయలేదని సంజయ్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ‘సర్‌’ ప్రక్రియను పూర్తి చేస్తామని, త్వరలోనే ఎనఆర్సీ, మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

అరాచక శక్తులతో పొత్తా..

బంగ్లాదేశ్ తరహాలో భారత్‌లోనూ అల్లర్లు సృష్టించి మోదీ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్న ఐసా అధ్యక్షురాలు నేహా బోరా, పాకిస్థాన్ నిధులతో పనిచేస్తున్న సీజేపి నాయకుడు అశుతోష్ రంకా, విదేశీ నిధులతో బొద్దింకల పార్టీ పెట్టిన అభిజీత్ దీప్కే వంటి అరాచక శక్తులతో కాంగ్రెస్ కలిసి ధర్నాలు చేయడం వెనుక ఏ రకమైన దేశభక్తి ఉందో సమాధానం చెప్పాలన్నారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై స్పష్టత

ఈవీఎంలు, ‘సర్‌’ ప్రక్రియపై కాంగ్రెస్ విషం చిమ్ముతోందని ఆరోపించారు. ‘సర’ అంటే అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించి మరణించిన వారిని, ఒకటికి మించిన చోట్ల నమోదైన దొంగ ఓట్లను, అక్రమ వలసదారులను ఓటర్ల జాబితా నుండి తొలగించడమేనని వివరించారు. 1952 నుండి 2025 వరకు 12 సార్లు ఈ ప్రక్రియ జరిగితే అందులో పదిసార్లు కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే సుకుమార్ సేన్ సోదరుడు అశోక్ సేన్, ఆర్.కె. త్రివేది, వి.ఎస్.రమాదేవి, టి.ఎన్.శేషన్, ఎం.ఎస్.గిల్, నవీన్ చావ్లా వంటి మాజీ సీఈసీలకు రాజకీయ లబ్ది చేకూర్చారని గుర్తు చేశారు. ప్రస్తుత సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెడతామనడం పెద్ద జోక్ అని కొట్టిపారేశారు.

దొంగ ఓట్ల తొలగింపుపై బాధ ఎందుకో?

దేశంలో 13 కోట్ల ఓట్లను తొలగించారని కాంగ్రెస్ ప్రచారం చేయడం అబద్ధమని, అది కేవలం ముసాయిదా మాత్రమేనని చెప్పారు. అందులో 2.8 కోట్ల మంది మరణించిన వారు, కోటికిపైగా డూప్లికేట్ ఓటర్లు, 6.30 కోట్ల మంది నివాస స్థలాలు మారిన వారు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోనే 2004 నుండి ఇప్పటివరకు 18.07 లక్షల మంది మరణించారని, పాత బస్తీ, మహేశ్వరం వంటి ప్రాంతాల్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అక్రమ వలసదారుల ఓట్లు ఉన్నాయని, మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు ఓటు కూడా ఇంకా జాబితాలో ఉండటం విడ్డూరమని అన్నారు. ఇలాంటి ఓట్లను తొలగించవద్దా అని ప్రశ్నించారు.

కరువు మండలాలపై నిర్లక్ష్యం

రాష్ట్ర ప్రభుత్వం కేవలం 365 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. అనేక మండలాల్లో తాగు, సాగునీరు లేక, విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజల దృష్టి మళ్లించే డ్రామాలు ఆడుతోందని విమర్శించారు.

ప్రత్యేక బుక్‌లెట్ ఆవిష్కరణ

‘సర’ ప్రక్రియపై కాంగ్రెస్, ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం… అరాచకాన్ని తరిమికొడదాం’ పేరుతో బీజేపీ రూపొందించిన ప్రత్యేక సమాచార బుక్‌లెట్‌ను బండి ఆవిష్కరించారు. ఈ నిజాలను మేధావులు, జర్నలిస్టులు, విద్యావేత్తలు గమనించాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *