– సాగునీటి లక్ష్యాలకు భంగం కలగకుండా పర్యావరణ ప్రభావాన్ని తగ్గించాలి
– వివిధ నీటి మట్టాల్లో ముంపు వివరాలతో సమగ్ర పటాలు సిద్ధం చేయాలి
– తుమ్మిడిహెట్టి అలైన్మెంట్లు, సాంకేతిక అంశాలపై మంత్రి ఉత్తమ్ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర వ్యక్తం చేస్తున్న ముంపు, పర్యావరణ సంబంధిత ఆందోళనలకు సాంకేతికంగా సమర్థమైన, ఆచరణసాధ్యమైన పరిష్కారాలు రూపొందించాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు సాగునీటి లక్ష్యాలకు భంగం కలగకుండా పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే ఇంజినీరింగ్ మార్పులను పరిశీలించాలని సూచించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల జరిగిన చర్చలకు కొనసాగింపుగా బ్యారేజీ సాంకేతిక అంశాలు, ప్రతిపాదిత అలైన్మెంట్లపై తన క్యాంప్ కార్యాలయంలో శనివారం సమీక్షించారు. వివిధ జలాశయ నీటిమట్టాల వద్ద ప్రభావితమయ్యే భూముల విస్తీర్ణాన్ని సమగ్రంగా అంచనా వేయాలని స్పష్టం చేశారు. వాస్తవంగా ఎంతమేర ముంపు ఏర్పడుతుందో నిర్ధారించేందుకు వివరమైన పటాలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. నదీగర్భ ప్రాంతాలు, అటవీ భూములు, పర్యావరణ సున్నిత మండలాలు, సంరక్షిత కోర్ ప్రాంతాలు, రెవెన్యూ భూములు, జనావాసాలను పటాల్లో స్పష్టంగా గుర్తించాలని సూచించారు. ఈ వివరాల ఆధారంగా మహారాష్ట్ర ఆందోళనలను పరిష్కరించే మార్గాలను పరిశీలించాలన్నారు. నీటి నిల్వను, వినియోగాన్ని మెరుగుపరిచేందుకు తుమ్మిడిహెట్టి పూర్తిస్థాయి జలాశయ నీటిమట్టాన్ని (ఎఫ్ఆర్ఎల్) 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ముంబయిలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఈనెల 26న జరిపిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించిన విషయం విదితమే. సుందిళ్ల బ్యారేజీ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుతో కూడిన సమగ్ర వ్యవస్థ ద్వారా 77 టీఎంసీల నీటిని మళ్లించి ఏడు జిల్లాల పరిధిలోని 5.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రస్తుతం ప్రతిపాదిత 148 మీటర్ల నీటిమట్టం వద్ద నిల్వ సామర్థ్యం 2.182 టీఎంసీలు కాగా, 152 మీటర్లకు పెంచితే అది 5.697 టీఎంసీలకు చేరుతుంది. తద్వారా నీటి నిల్వ సామర్థ్యం రెట్టింపునకు మించి పెరుగుతుంది. ప్రతిపాదిత 152 మీటర్ల నీటిమట్టం వద్ద కూడా ముంపు పరిమితంగానే ఉంటుందని ప్రాజెక్టు అంచనాలు సూచిస్తున్నాయి. తెలంగాణ, మహారాష్ట్రల్లో పునరావాసం, పునఃస్థాపనకు సంబంధించిన అవసరాలను పరిష్కరించవచ్చని ఈ అంచనాలు పేర్కొంటున్నాయి. సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, ఇంజినీర్ ఇన్ చీఫ్(జనరల్) ఓ.వి.రమేష్‌బాబు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




