సృష్టిలో సగం మహిళ అనే వాస్తవాన్ని అర్థనారీశ్వరుడే స్పష్టం చేస్తున్నాడు. మాటల్లో ఆమెను ఆకాశానికి ఎత్తి వేస్తున్నాం, ఆచరణలో మాత్రమే అదమమే. ఉద్యోగాలు, ఉపాధులు, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటున్నది. అసమానతల విష వలలో ఆమె బందీ అవుతున్నది. ఆమె వంటిల్లు దాటడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్ట సభల్లో 26.9 శాతం వరకు మహిళలు ఉన్నట్లు తెలుస్తున్నది.
ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ అధ్యయనాల ప్రకారం దిగువ సభల్లో మహిళల శాతం పరంగా 193 దేశాల జాబితాలో భారత్‌కు 149వ స్థానం దక్కడం విచారకరం. స్వీడెన్, నార్వే, దక్షిణాఫ్రికా దేశాల్లో మహిళల ప్రాతినిధ్యం 45 శాతం కన్న అధికంగాఉండడం గమనించాలి. భారత స్వాతంత్య్రం రాకముందే 1946లో ఏర్పడిన రాజ్యాంగ పరిషత్/అసెంబ్లీలో ఉన్న 389 మంది సభ్యుల్లో 15 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. చట్టసభలో మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంతో నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత రానున్న ఎన్నికల్లో పార్లమెంట్‌లో కనీసం 33 శాతం మహిళా సభ్యులు రానున్నారు. మహిళా రిజర్వేషన్లు 15 ఏళ్ల పాటు అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.
లోకసభలో మహిళా ప్రాతినిధ్యం
1952లో ఏర్పడిన తొలి పార్లమెంట్‌లో 489 మంది ఎంపీల్లో 22 మంది (4.5 శాతం) మాత్రమే మహిళలు ఉన్నారు. 2024లో ఏర్పడిన 18వ లోకసభలో 543 మంది ఎంపీల్లా 74 మంది మహిళలు (13.6 శాతం), రాజ్యసభలోని 224 మంది సభ్యుల్లో 24 మంది మాత్రమే మహిళలు ఉండడం విశేషం. 1957లో ఏర్పడిన 2వ లోకసభలో 494 మంది ఎంపీల్లో 5.5 శాతం, అనగా 27 మంది మహిళా ఎంపీలు మాత్రమే సేవలు అందించడం చూసాం. 1962, 1967లో లోకసభలో మహిళా సభ్యులు 6 శాతం, 1977లో 4 శాతం, 2009లో 11 శాతం, 2014లో 12 శాతం మంది మహిళలు మాత్రమే సేవలు అందించారు. 2019లో ఎన్నికైన 17వ లోకసభలో 543 మంది సభ్యుల్లో 14.4 శాతం, అనగా 78 మంది మహిళలు ఉన్నారు. రాజ్యసభలో సరాసరి 10 శాతం మంది మహిళా ఎంపీలు మాత్రమే ఉంటూ వస్తున్నారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళా సభ్యుల సంఖ్య 10 శాతం కంటే తక్కువగానే ఉంటున్నది.
రాజకీయ పార్టీల మహిళా సభ్యులు
పార్లమెంట్‌లోనే కాకుండా రాజకీయ పార్టీల్లో కూడా మహిళలకు ప్రాధాన్యం తక్కువగా ఉండడం గమనిస్తున్నాం. 2024లో భాజపా పార్టీ తరపున 15.7 శాతం మంది మహిళలకు, 2019లో 12.6 శాతం మంది మహిళలకు మాత్రమే టికెట్లు ఇవ్వడం జరిగిందని గమనించాలి. కాంగ్రేస్ పార్టీ పక్షాన 2019, 2024 లోకసభ ఎన్నికల బరిలో 12.3 శాతం మంది మహిళలను దించడం జరిగింది. భాజపా పక్షాన గెలిచిన మహిళా సభ్యులు 2019లో 74.6 శాతం ఉండగా 2024లో ఎన్నికల్లో 44.9 శాతానికి పడిపోయింది. కాంగ్రేస్ నుంచి పోటీలో ఉన్న మహిళలు 2019లో 11.5 శాతం గెలువగా, 2024లో 18.8 శాతం విజేతలు అయ్యారు. 2024 పార్లమెంట్‌లో తృణముల్ కాంగ్రేస్ సభ్యుల్లో 37.9 శాతం, భాజపా సభ్యుల్లో 12.9 శాతం, కాంగ్రేస్ సభ్యుల్లో 13.1 శాతం మహిళా ఎంపీలు ఉన్నారు.
2047 నాటికి భారత్ అభివృద్ధి చెంది అగ్ర దేశాల సరసన నిలవడానికి చట్ట సభల్లో మహిళల పాత్ర అత్యంత ప్రధానమని తెలుసుకోవాలి. నిరక్షరాస్యత, రాజకీయ సంకల్పం లేకపోవడం,చిన్నచూపు, పితృస్వామ్య పోకడలు, లింగ అసమానతలు, గృహ పనుల్లో నిమగ్నం కావడం, పిల్లల పెంపకం బాధ్యత మీద పడడం, బహిరంగ మార్కెట్‌లో మహిళల భద్రత కొరవడడం లాంటి పలు కారణాలతో మహిళలు వెనుకంజ వేయడం కొనసాగుతున్నది. ఇప్పటికైనా మహిళ పరాశక్తిగా సామాజిక బంధనాలను చేదించుకొని చట్ట సభల్లో తమ శక్తియుక్తులను ప్రదర్శించి దేశాభివృద్ధిలో అర్థ భాగం కావాలని ఆశిద్దాం. పురుష సమాజం పౌరుషానికి పోకుండా ‘ఆమె’ను అందలం ఎక్కించాలని కోరుకుందాం.
-డా.బుర్ర మధుసూదన్ రెడ్డి





