
సామాజికవేత్త,విశ్లేషకులు. సెల్ : 9949194327.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమం ఎన్నో త్యాగాలకు, ఎన్నో పోరాటాలకు ప్రతీక. ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు తమ జీవితాలను పణంగా పెట్టి ఉద్యమించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాల్లో మార్పు వస్తుందని, తమ త్యాగాలకు గుర్తింపు లభిస్తుందని ఉద్యమకారులు ఆశించారు.అయితే రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యమకారుల సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదనే ఆవేదన ఇప్పటికీ వినిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్న వారిలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. మరికొందరు కేసులు ఎదుర్కొన్నారు.ఇంకొందరు తమ కుటుంబాలను, ఉపాధిని పక్కనపెట్టి ఉద్యమంలో పాల్గొన్నారు. అనేక మంది విద్యార్థులు తమ చదువును వదిలి ఉద్యమ బాట పట్టారు. ఉద్యమ సమయంలో ఎదురైన లాఠీచార్జీలు, అరెస్టులు, కేసులు, నిర్బంధాలు, ఆర్థిక ఇబ్బందులు వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపాయి.ఇంతటి త్యాగాలు చేసిన ఉద్యమకారులకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తగిన గుర్తింపు, గౌరవం, సంక్షేమం లభించలేదనే అభిప్రాయం అనేక వర్గాల్లో ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారుల్లో కొత్త ఆశలు చిగురించాయి. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వారు ఆశించారు. ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమం, ఆర్థిక భద్రత, ఉపాధి అవకాశాలు, వైద్య సదుపాయాలు, కుటుంబాల సంక్షేమం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని వారు కోరుతున్నారు.అయితే ఉద్యమకారులకు న్యాయం చేయడం అంటే కేవలం సన్మానాలు చేయడం లేదా జయంతి, వర్ధంతి కార్యక్రమాల్లో స్మరించుకోవడం మాత్రమే కాదు. వారి త్యాగాలను అధికారికంగా గుర్తించి, అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి స్పష్టమైన సంక్షేమ పథకాలను అమలు చేయాలి. ఉద్యమంలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు పారదర్శకమైన విధానం ఉండాలి. అర్హత నిర్ధారణలో రాజకీయ జోక్యం, పక్షపాతం లేకుండా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఉద్యమకారుల ప్రధాన డిమాండ్లలో గుర్తింపు కార్డులు, పెన్షన్, ఉచిత లేదా మెరుగైన వైద్య సదుపాయాలు,కుటుంబాలకు ఆర్థిక భరోసా, ఉపాధి అవకాశాలు, విద్యా సదుపాయాలు వంటి అంశాలు ఉన్నాయి. ఉద్యమంలో పాల్గొని కేసులు ఎదుర్కొన్న వారికి చట్టపరమైన సహాయం, కేసుల పరిశీలన, అర్హత ఉన్న చోట కేసుల ఉపసంహరణ వంటి అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఉంది.
అదేవిధంగా ఉద్యమకారుల కుటుంబాల పరిస్థితిని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. ఉద్యమంలో పాల్గొన్న కారణంగా కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నవారికి, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రత్యేక సహాయక చర్యలు అవసరం. ఉద్యమ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా పాఠ్యాంశాలు, స్మారక చిహ్నాలు, డాక్యుమెంటేషన్ వంటి కార్యక్రమాలు కూడా చేపట్టాలి.ఉద్యమకారుల సమస్యల పరిష్కారంలో మరో ముఖ్యమైన అంశం స్పష్టమైన ప్రభుత్వ విధానం.ఉద్యమకారుల సమస్యలను పరిశీలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ని ఏర్పాటు చేసి, అందులో చైర్మన్ మరియు కమిటీ సభ్యులు విశ్వవిద్యాలయాల్లో పనిచేసినటువంటి విద్యార్థి ఉద్యమకారులు,కళాకారులు, ప్రజా సంఘాలు,స్వచ్ఛంద సంస్థలు,జిల్లాల వారీగా అర్హులైన ఉద్యమకారుల సూచనలను,వివరాలను, గత నెల రోజుల నుండి పరిగణలోకి తీసుకుంటున్నారు.వారి సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి, ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.అప్పుడే ఉద్యమకారుల్లో ఉన్న అనుమానాలు, అసంతృప్తి తొలగే అవకాశం ఉంటుంది.జార్ఖండ్ తరహాలో ఉద్యమకారులకు లభించే అటువంటి అన్ని పాలసీ విధానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
“తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఒక రాజకీయ విజయమే కాదు.. అది ప్రజల దీర్ఘకాల పోరాటానికి, ఉద్యమకారుల త్యాగాలకు, విద్యార్థుల ఆవేశానికి, ఉద్యోగుల సమ్మెకు, కళాకారుల గళానికి, మహిళల భాగస్వామ్యానికి, అమరవీరుల ప్రాణత్యాగాలకు లభించిన ఫలితం..”– డాక్టర్ మోటె చిరంజీవి
తెలంగాణ ఉద్యమం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదు.అది కోట్లాది ప్రజల ఆకాంక్ష.అందువల్ల ఉద్యమకారుల గౌరవం, గుర్తింపు, సంక్షేమం కూడా రాజకీయాలకు అతీతంగా ఉండాలి.ఉద్యమంలో ఎవరు ఏ పార్టీకి చెందినవారు అన్నది కాకుండా, నిజంగా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత.తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేది దశాబ్దాల పోరాటం, ఎన్నో త్యాగాలు, మరెన్నో నిర్బంధాలు, కేసులు, లాఠీచార్జీలతో కూడిన ప్రజా ఉద్యమం. ప్రత్యేక తెలంగాణ కోసం విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు తమ జీవితాలను పణంగా పెట్టారు. చివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఉద్యమకారులు తమ త్యాగాలకు తగిన గుర్తింపు, గౌరవం, సంక్షేమం లభిస్తుందని ఆశించారు.
గత కెసిఆర్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పలువురికి రాజకీయంగా, ప్రభుత్వంలోని వివిధ నామినేటెడ్ పదవుల్లో అవకాశం లభించింది.ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న నాయకులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించడం ద్వారా వారి సేవలను గుర్తించినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యమకారుల కుటుంబాల్లోని కొందరికి కూడా రాజకీయ, సామాజిక అవకాశాలు లభించాయి.అయితే ఉద్యమకారులందరికీ ఒకే విధమైన సమగ్ర సంక్షేమ పథకం అమలు కాలేదనే విమర్శలు కూడా ఉన్నాయి.ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అధికారిక గుర్తింపు కార్డు,నెలవారీ పెన్షన్, ఉచిత వైద్యం,ఇళ్ల స్థలాలు లేదా భూమి, కుటుంబాలకు ప్రత్యేక ఆర్థిక భరోసా వంటి అంశాలపై స్పష్టమైన, సమగ్ర విధానం అవసరమని ఉద్యమకారులు పలుమార్లు డిమాండ్ చేశారు.రాష్ట్ర సాధన కోసం పోరాడినప్పటికీ, తమకు తగిన గుర్తింపు, సంక్షేమం అందలేదని కొంతమంది ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఉద్యమకారులు అందరూ ఒకే స్థాయిలో ఉన్నవారు కాదు. కొందరు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. కొందరు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పోరాడారు. మరికొందరు రాజకీయ, ప్రజా సంఘాల ద్వారా ఉద్యమించారు. ఇంకొందరు జైలు శిక్షలు, కేసులు, నిర్బంధాలు ఎదుర్కొన్నారు. కాబట్టి నిజమైన ఉద్యమకారులను గుర్తించేందుకు పారదర్శకమైన ప్రమాణాలు అవసరం. ఈ గుర్తింపు ప్రక్రియ స్పష్టంగా లేకపోవడం కూడా ఉద్యమకారుల సమస్యలకు ఒక కారణంగా మారింది.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్రను చరిత్ర ఎన్నటికీ మరచిపోదు.కానీ చరిత్రలో వారి పాత్రను గుర్తించడం మాత్రమే సరిపోదు.వారి ప్రస్తుత జీవితాల్లో కూడా ప్రభుత్వం అండగా నిలవాలి. ఉద్యమకారులకు న్యాయం అంటే గతాన్ని గౌరవించడం మాత్రమే కాదు. వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడం.కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల సమస్యలపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించి, అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి న్యాయం చేస్తే అది తెలంగాణ ఉద్యమ చరిత్రకు నిజమైన గౌరవం అవుతుంది. మాటలు, హామీలు దాటి కార్యాచరణ మొదలైనప్పుడే.“ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందా?” అనే ప్రశ్నకు సమాధానం లభిస్తుంది.తెలంగాణ కోసం పోరాడిన వారిని గుర్తించడం ప్రభుత్వ బాధ్యత. వారికి గౌరవంగా జీవించే అవకాశాన్ని కల్పించడం ప్రభుత్వ ధర్మం.తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఒక రాజకీయ విజయమే కాదు.. అది ప్రజల దీర్ఘకాల పోరాటానికి, ఉద్యమకారుల త్యాగాలకు, విద్యార్థుల ఆవేశానికి, ఉద్యోగుల సమ్మెకు, కళాకారుల గళానికి, మహిళల భాగస్వామ్యానికి, అమరవీరుల ప్రాణత్యాగాలకు లభించిన ఫలితం.


– డాక్టర్ మోటె చిరంజీవి 


