పాలన అంటే ఫామ్‌హౌస్ చుట్టూ రాజకీయాలేనా?

“ప్రతిపక్ష నాయకుడిని రాజకీయంగా విమర్శించడం వేరు. అతని ఇంటిని ముట్టడించడం వేరు.అధికార బలం ప్రజాస్వామ్య హుందాతనాన్ని మించకూడదు. అరెస్టులు, నిరసనలు, పరస్పర ఆరోపణలతో రాజకీయ వేడి పెంచడం కంటే ప్రజల సమస్యలపై సమాధానాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ స్థాయి మరింత పెరుగుతుంది. ముఖ్యమంత్రి స్థాయి అంటే ప్రత్యర్థిని ఎంతగా ఇబ్బంది పెట్టామన్నది కాదు. ప్రజలకు ఎంత మంచి పాలన అందించామన్నదే.తెలంగాణ కోరేది రాజకీయ యుద్ధం కాదు.. పాలన!..”

-జీడిపల్లి రాంరెడ్డి
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
9666680051

తెలంగాణ రాజకీయాలు మరోసారి ప్రజా సమస్యల నుంచి వ్యక్తుల ఆస్తులు, ఫామ్‌హౌస్‌లు, భూముల వైపు మళ్లుతున్నాయా? అన్న ప్రశ్న ఇప్పుడు సహజంగానే తలెత్తుతోంది. 22-ఏ భూముల సమస్యపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ పరిధిలోని భూములపై సమగ్ర విచారణకు ఆదేశించారు. సుమారు 700 ఎకరాల పరిధిలో భూముల చట్టబద్ధత, అందులో ప్రభుత్వ భూమి ఎంత ఉందన్న అంశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఆరోపణలు నిజమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు. కాకపోతే ఈ ప్రమాణం ఒక్క కేసీఆర్‌ కుటుంబానికే కాకుండా రాష్ట్రంలోని ప్రతి రాజకీయ నాయకుడికి, ప్రతి ప్రభావశీల కుటుంబానికీ సమానంగా వర్తించాలి.

ఫామ్ హౌజ్ జీవితం వ్యక్తిగతం
తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌ ప్రస్తుతం ఒక ప్రధాన రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నారు. హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రాంతాల్లో నివాసం ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఎర్రవల్లి వంటి గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకుని వ్యవసాయంపై మక్కువతో అక్కడి ఫామ్‌హౌస్‌లో జీవించడం ఆయన వ్యక్తిగత జీవన విధానానికి సంబంధించిన విషయం. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి గ్రామీణ వాతావరణంలో ఉంటూ వ్యవసాయంతో అనుబంధంగా జీవిస్తే, దానినే పదేపదే రాజకీయ విమర్శలకు, దుష్ప్రచారానికి కేంద్రంగా మార్చడం ఎంతవరకు సమంజసం? ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ భూమి, అక్రమ ఆక్రమణలు లేదా చట్టవిరుద్ధ లావాదేవీలు జరిగాయని ఆధారాలు ఉంటే ప్రభుత్వం విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలి. కానీ ఒక నాయకుడు ఫామ్‌హౌస్‌లో నివసిస్తున్నాడని, వందఎకరాలు కబ్జా చేసాడని ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి తర్వాత అసెంబ్లీలో జరిగిన చర్చలో కెసిఆర్, ఆయన సతీమణి శోభలకు కేవలం 63 ఎకరాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. కేసీఆర్‌ కుటుంబ భూములపై విచారణ జరగాలంటే జరగాలి. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన ఆస్తులు, భూములు, లావాదేవీలపై ఏవైనా ఆరోపణలు ఉంటే అవి కూడా స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ పరిధిలోకి రావాలి.

చట్టం అందరికీ ఒక్కటే
కేసీఆర్‌ కుటుంబంపై విచారణకు ప్రభుత్వం సిద్ధమైతే, రేవంత్‌రెడ్డి కుటుంబ ఆస్తులపైనా అదే స్థాయి పారదర్శకత ఉండాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికార–ప్రతిపక్ష నేతలు—ఎవరైనా సరే, భూముల విషయంలో చట్టం ఒకే విధంగా పనిచేయాలి. సీలింగ్ చట్టం ను కెసిఆర్ కుటుంబం కు వర్తించాలి అంటే అది తెలంగాణ మొత్తం వర్తించాలి కదా! ధరణి కాలంలో జరిగిన లావాదేవీలైనా, ప్రస్తుత భూభారతి వ్యవస్థలో జరిగిన లావాదేవీలైనా, 22-ఏ జాబితాలో ఉన్న భూములైనా, ప్రభుత్వ భూములైనా—రికార్డులను ఒకే ప్రమాణంతో పరిశీలించాలి. వ్యక్తులు మారినా చట్టం మారకూడదు.ప్రభుత్వాలు మారినా ప్రమాణం మారకూడదు. అధికారం మారినా న్యాయం మారకూడదు. రాష్ట్రవ్యాప్తంగా 22-ఏ జాబితాలో చిక్కుకున్న భూముల కారణంగా రిజిస్ట్రేషన్లు, అమ్మకాలు, బ్యాంకు రుణాలు, కుటుంబ అవసరాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఉన్నారు. వారికి కావాల్సింది ఎవరి ఫామ్‌హౌస్‌లో ఎన్ని ఎకరాలున్నాయనే రాజకీయ చర్చ కాదు. తమ భూమి సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందో చెప్పే స్పష్టమైన కార్యాచరణ. అసెంబ్లీ చర్చ “కేసీఆర్‌కు ఎంత భూమి ఉంది?” అనే ప్రశ్న దగ్గరే ఆగిపోకుండా— 22-ఏలో ఉన్న ప్రతి భూమికి అసలు హక్కుదారు ఎవరు? ప్రభుత్వ భూమి ఏది? ప్రైవేట్‌ భూమి ఏది?చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూమి ఏది?ఎక్కడ అక్రమం జరిగింది?ఎవరికి అన్యాయం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాలి.

ఎవరిపై ఆరోపణలున్నా విచారణ జరగాలి
భూములపై ఆరోపణలు ఎవరిపై వచ్చినా విచారణ జరగాలి. ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకోవాలి. ఆధారాలు లేకుండా వ్యక్తులను రాజకీయంగా లక్ష్యంగా చేసుకోవడం కూడా సరికాదు. ఒకే రకమైన ఆరోపణకు ఒకరిపై విచారణ, మరొకరిపై మౌనం ఉంటే ప్రజల్లో ప్రభుత్వ చర్యలపై అనుమానాలు కలగడం సహజం. అందుకే భూముల వ్యవహారాల్లో రాజకీయ అనుబంధం కాకుండా రికార్డులు, చట్టం, ఆధారాలే ప్రమాణాలుగా ఉండాలి.

డైవర్షన్‌ పాలిటిక్స్‌ ఇంకెన్నాళ్లు?
ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలను ప్రజల ముందుంచిన కాంగ్రెస్‌ పార్టీ, వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. 2023 తుక్కుగూడ సభలో ఆరు గ్యారెంటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలుపై ప్రజల్లో నిరంతర చర్చ కొనసాగుతూనే ఉంది. హామీలు ఇవ్వడం రాజకీయ ప్రకటన కావచ్చు. కానీ ఇచ్చిన హామీని నెరవేర్చడం పాలనకు అసలైన కొలమానం. ప్రజలకు కావాల్సింది ఫామ్‌హౌస్‌ భూములపై ప్రతిరోజూ కొత్త రాజకీయ చర్చలు కాదు. రైతుకు సాగునీరు కావాలి.వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ కావాలి.యువతకు ఉద్యోగాలు కావాలి.విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కావాలి.మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కావాలి.పేదలకు ఇళ్లు కావాలి.22-ఏ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి.ప్రతిపక్షాలపై రాజకీయ విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో సహజమే. ప్రభుత్వం ప్రతిరోజూ ప్రతిపక్ష నేతల ఆస్తులు, ఫామ్‌హౌస్‌లు, పాత వ్యవహారాల చుట్టూ రాజకీయ  చర్చను నడిపితే ప్రజా సమస్యలు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది.

సీఎం స్థాయి మరింత హుందాగా ఉండాలి
ముఖ్యమంత్రి అనేది ఒక పార్టీకి మాత్రమే చెందిన పదవి కాదు. రాష్ట్రానికి నాయకత్వం వహించే అత్యున్నత రాజకీయ బాధ్యత. ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష ప్రధాన నాయకుడి ఇంటి ముట్టడికి అధికార పార్టీ శ్రేణులు పిలుపునిచ్చిన సందర్భంలో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మరింత సంయమనంతో వ్యవహరించి, అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని తన పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశం ఇవ్వడం ప్రజాస్వామ్య సంస్కృతికి బలం చేకూరుస్తుంది.ప్రతిపక్ష నాయకుడిని రాజకీయంగా విమర్శించడం వేరు. అతని ఇంటిని ముట్టడించడం వేరు.అధికార బలం ప్రజాస్వామ్య హుందాతనాన్ని మించకూడదు. అరెస్టులు, నిరసనలు, పరస్పర ఆరోపణలతో రాజకీయ వేడి పెంచడం కంటే ప్రజల సమస్యలపై సమాధానాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ స్థాయి మరింత పెరుగుతుంది.ముఖ్యమంత్రి స్థాయి అంటే ప్రత్యర్థిని ఎంతగా ఇబ్బంది పెట్టామన్నది కాదు. ప్రజలకు ఎంత మంచి పాలన అందించామన్నదే.తెలంగాణ కోరేది రాజకీయ యుద్ధం కాదు.. పాలన! రాజకీయాల్లో అధికార పక్షం మారుతుంది. ప్రతిపక్షం అధికారంలోకి వస్తుంది. అందుకే నేడు ఒకరిపై ఉపయోగించిన ప్రమాణం రేపు మరొకరిపై కూడా వర్తించేలా వ్యవస్థ ఉండాలి.కేసీఆర్‌ భూములపై విచారణ జరగాలి అంటే—జరగాలి.రేవంత్‌రెడ్డి కుటుంబ ఆస్తులపై ఏవైనా ఆరోపణలు ఉంటే—అవీ నిష్పాక్షికంగా పరిశీలించాలి.
మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధుల భూములపై ఆరోపణలు ఉంటే—అవీ విచారణ పరిధిలోకి రావాలి.
అదే నిజమైన పారదర్శకత.

పాలనకు అర్థం వుండాలి
ఎవరి భూమి చట్టబద్ధం?ఎక్కడ అక్రమం జరిగింది?ప్రజల భూమి సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది?ఇచ్చిన హామీల్లో ఏవి అమలయ్యాయి?మిగిలినవి ఎప్పుడు అమలు చేస్తారు?అన్నదే ప్రజలకు కావాల్సిన సమాధానం. హామీలను ప్రకటించినప్పుడు వేదికలపై కనిపించిన ఉత్సాహాన్ని, వాటిని అమలు చేసే సమయంలోనూ ప్రభుత్వం చూపాలి. ప్రజలు రాజకీయ ప్రసంగాలను కాదు—ఫలితాలను చూస్తారు.ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫామ్‌హౌస్‌ రాజకీయాల నుంచి పాలనా రాజకీయాల వైపు దృష్టి మళ్లించాలి. ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, మొత్తం తెలంగాణకు ముఖ్యమంత్రిగా హుందాగా వ్యవహరించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి పెరిగితే ప్రభుత్వ స్థాయి పెరుగుతుంది.ప్రభుత్వ స్థాయి పెరిగితే ప్రజల విశ్వాసం పెరుగుతుంది.తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఎవరి ఫామ్‌హౌస్‌లో ఎంత భూమి ఉందనే చర్చ కాదు—తమ జీవితాల్లో ఎంత మార్పు వచ్చిందనే సమాధానం.ప్రచారం ఎంత గొప్పగా ఉన్నా..హామీలు ఎన్ని ఇచ్చినా.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినప్పుడే పాలనకు అర్థం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *