ఇంటర్వ్యూ
తెలంగాణలో విద్యా విధానంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వ విద్య పటిష్టతకు గత మూడు దశాబ్దాలుగా పని చేస్తున్న సామాజిక కార్యకర్త ఆర్ . వెంకట్ రెడ్డితో నిర్వహించిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభుత్వ విద్య, కామన్ స్కూల్ సిస్టమ్, పట్టణ విద్య, ఉపాధ్యాయుల పాత్ర, విద్యలో సమానత్వం వంటి అంశాలపై ఆయన అభిప్రాయాలు.
ప్రశ్న: తెలంగాణలో ప్రభుత్వ విద్య ఎదురుకుంటున్న సవాళ్ళు ఏమిటి. క్లస్టర్ స్కూల్ విధానం ఏంటి? దీన్ని ఏ విధంగా చూడాలి?
జవాబు: ఒకప్పుడు తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా వేలాది గ్రామాల్లో పాఠశాలలే లేవు. సర్వశిక్ష అభియాన్, విద్యా హక్కు చట్టం వల్ల ప్రతి గ్రామానికి బడి చేరింది. బడి గ్రామానికి రావడం అంటే కేవలం ఒక భవనం రావడం కాదు. చదువు మీద విశ్వాసం గ్రామానికి రావడం.అలాగే చదివిచడానికి ప్రభుత్వం చట్ట బద్ద బాధ్యత తీసుకోవడం అని అర్థం. .స్కూళ్లు మూయడం క్లస్టర్ స్కూళ్లు తెరవడం కాదు చర్చ ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పునరుద్ధరించడమే అసలు సవాలు.
ప్రశ్న: సన్నగిల్లుతూ వచ్చిందా, లేదా సన్నగిల్లేలా చేశారా?
జవాబు: “సన్నగిల్లేలా చేశారు” అనడమే సరైనది. మౌలిక వసతులు, నాణ్యమైన బోధన, పిల్లల అవసరాల పట్ల శ్రద్ధ తగ్గినప్పుడు ప్రజల విశ్వాసం కూడా తగ్గింది. అదే సమయం లో విచ్చల విడిగా ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వమే అనుమతులు ఇవ్వడం తో సామాజికంగా ఆర్ధికంగా బలమైన వర్గాల పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లడం ప్రారంభించడంతో ప్రభుత్వ పాఠశాలలు క్రమంగా పేదల పాఠశాలలుగా మిగిలిపోయాయి.’మన పిల్లల పాఠశాల’ కాకుండా ‘మంది పిల్లల పాఠశాల’ గా మార్చి వేశాము. అప్పుడు విధాన నిర్ణేతల పిల్లల కోసం అయితే ఫలితాలు మరోలా ఉండేవి. కెదరియా విద్యాలయాలు ఆ కోవకు చెందినవే. అందుకే బాగా నడుస్తున్నాయి.
ప్రశ్న: సింగిల్ టీచర్ స్కూల్స్ పరిస్థితి గురించి?
జవాబు: తెలంగాణలో వేలాది సింగిల్ టీచర్ పాఠశాలలు ఉన్నాయి. ఒకప్పుడు ఇద్దరు, ముగ్గురు టీచర్లు ఉన్న స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిందనే కారణంతో పోస్టులను క్రమంగా తగ్గించారు. పిల్లలు తగ్గితే టీచర్లను తగ్గించడం, టీచర్లు తగ్గితే మరింత మంది పిల్లలు వెళ్లిపోవడం ఒక విష వలయంగా మారింది. ఒకే టీచర్ అనేక తరగతులను నిర్వహించే బహుళ తరగతి నిర్వహణ తో నాణ్యమైన విద్య అందించడం కష్టం.
ప్రశ్న: జీరో ఎన్రోల్‌మెంట్ స్కూల్స్ గురించి ఏం చెప్తారు? వాటిని మూసేయాలనే ప్రతిపాదన ఉంది కదా?
జవాబు: జీరో ఎన్రోల్మెంట్ అనేది ఎప్పుడూ పిల్లలు లేరని అర్థం కాదు. జీరో పిల్లలు ఉన్న ఆవాసం ఎప్పుడు ఉండదు. చాలాసార్లు అది నిర్వహణ, నాణ్యత సమస్యల ఫలితం.స్కూల్ మూసేయడం కాదు; ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో తెలుసుకుని పునరుద్ధరించాలి.తల్లిదండ్రులకు విశ్వాసం కలిగించాలి.
ప్రశ్న: ఇది హాస్పిటల్‌కు పేషెంట్లు రాకపోతే హాస్పిటల్ మూసేసినట్టేనా?
జవాబు: అవును మీరన్నది నిజం పేషంట్లు రాకపోతే హాస్పిటల్ మూయడం ఎంత తప్పో “పిల్లలు రావడం లేదు కదా, బడి ఎందుకు?” అనే ఆలోచనే తప్పు. మంటలు అంటుకోవడం లేదు కదా అని మనం ఫైర్ స్టేషన్ ను తీసేయం కదా? ఎందుకంటే అది ఒక ‘ఎమర్జెన్సీ’. స్కూల్ అనేది కూడా అటువంటి ఒక ఎమర్జెన్సీ వ్యవస్థే! బడిలో ఎప్పుడూ ఐదుగురు టీచర్లు సిద్ధంగా ఉంటేనే, పిల్లలు రావడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రశ్న: ప్రభుత్వ టీచర్లే తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో ఎందుకు చదివిస్తున్నారు? అనే వాదన పై
జవాబు: ఇది టీచర్ల వ్యక్తిగత సమస్య కాదు. ఇది మొత్తం సమాజంలో ఉన్నవిద్యా విధానానికి ప్రతిస్పందన.కనీసం అయిదు ఎకరాలలో అన్నీ వసతులతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయంలో ఏ గవర్నమెంట్ టీచరైనా తమ పిల్లలను జాయిన్ చేస్తారు. ఆ స్కూల్లో టీచర్లు ఉంటారు,అన్నీ వసతులు ఉంటాయి. మన ప్రభుత్వ విధానంలో స్కూల్ అనే నిర్వచనాన్నే తగ్గించేశాం కాబట్టి, టీచర్ పిల్లలైనా వేరే పిల్లలైనా అందరికీ తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే హక్కు ఉంది. దాన్ని మనం వక్రీకరించడానికి లేదు. మంచి స్కూల్ ఉంటే తల్లిదండ్రులు అప్లికేషన్ తో లైన్లలో నిలబడతారు.
ప్రశ్న: ఈ ధ్వంసరచన ఎక్కడి నుంచి మొదలైంది?
జవాబు: అత్యధిక శాతం పిల్లలందరినీ ప్రాథమిక స్థాయి వరకు బడికి తీసుకురావడంలో విజయం సాధించాం. కానీ పాఠశాలల నాణ్యతను మెరుగుపరచడంలో ఉన్నత పాఠశాల విద్యను అందించడం లో అదే స్థాయి శ్రద్ధ కనిపించలేదు. భవనాలు, మౌలిక వసతులు, ఉపాధ్యాయుల సంఖ్య, పిల్లలకు అనుకూల వాతావరణం వంటి అంశాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. సమాన విద్యను అందించాలనే రాజకీయ సంకల్పం బలహీనపడిన దగ్గర నుంచే సంక్షోభం మొదలైంది. . గిరిజన ప్రాంతాలలో. పట్టణ, మైదాన ప్రాంతాల ప్రణాళికలు కేంద్రీకృత విధాన నిర్ణయాలు ఈ సంక్షోభానికి మరింత దోహదం చేశాయి.
ప్రశ్న: 27,000 స్కూళ్ల నుంచి 23,000 స్కూళ్లను తీసేసి, 4,000 క్లస్టర్ స్కూళ్లుగా మార్చడం ప్రకటన వెనుక కారణాలు ఏంటి?
జవాబు: తల్లిదండ్రులు, సర్పంచులు సోషల్ మీడియాలో “మా స్కూల్‌కి రండి” అని పోస్టర్లు వేసుకుంటూ, ఓనర్‌షిప్ కలిగించే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇలాంటి ప్రకటన రావడం సరైంది కాదు అనిపించింది. ఒక స్కూల్‌ను నర్సరీ నుంచి 12వ తరగతి వరకు, 1,500 మంది పిల్లలకు సరిపడా అభివృద్ధి చేయాలంటే విద్యా కమిషన్ సూచన ప్రకారం 20 కోట్లు కావాలి. 4,000 స్కూళ్లకు 80,000 కోట్లు కావాలి. మన మొత్తం బడ్జెటే 25,000 కోట్లు. ఇప్పటివరకు ఆరుట్లలో ఒక్క స్కూల్ మాత్రమే పూర్తయింది. దానికే రెండున్నర సంవత్సరాలు పట్టింది. ఇది సంఖ్యల సమస్య కాదు; విద్యా విధానం గురించిన ప్రశ్న.ప్రస్తుతం ఉన్న పాఠశాలలను నాణ్యంగా అభివృద్ధి చేయకుండా వాటిని విలీనం చేసి కొద్ది పెద్ద పాఠశాలలు ఏర్పాటు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు.”ఎన్ని స్కూళ్లు మూసేస్తాం?” అనే చర్చ కంటే “ఎన్ని మంచి స్కూళ్లు నిర్మిస్తాం? ఎన్ని స్కూళ్లను బాగు చేస్తున్నాము ” అనే చర్చ జరగాలి.
“పట్టణ విద్యకు తగిన ప్రాధాన్యం దక్కలేదు.పట్టణ జనాభా పెరిగింది. ఈ నగరాన్ని నడిపేది లక్షలాది కార్మికులు. కానీ వారి పిల్లల విద్య గురించి తగినంతగా ఆలోచించడం లేదు. ప్రభుత్వ పాఠశాలలు పెరగలేదు. దాంతో లక్షలాది కుటుంబాలు తప్పనిసరిగా ప్రైవేట్ పాఠశాలలపై ఆధారపడుతున్నాయి. పట్టణ విద్యను ఒక మౌలిక ప్రజా సేవగా గుర్తించాల్సిన అవసరం ఉంది..”–
ప్రశ్న: మీరు యూరప్, అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో పర్యటించారు కదా అక్కడ స్కూల్ కన్సాలిడేషన్ విధానం గురుంచి చెప్పండి.
జవాబు: ఆ దేశాల్లో విజయవంతమైనది క్లస్టర్ విధానం కాదు; నైబర్‌హుడ్ స్కూల్ విధానం. ధనిక, పేద తేడా లేకుండా ఒకే ప్రాంతంలోని పిల్లలందరూ అదే ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు. ఇదే సామాజిక సమానత్వానికి పునాది. అక్కడ 95% మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకే వెళ్తారు, ఎల్‌కేజీ నుంచి 12వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్.కేరళ వంటి రాష్ట్రాలు కూడా మంచి ప్రభుత్వ పాఠశాలల ద్వారానే ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నాయి.
ప్రశ్న: తెలంగాణలో విద్య ఎందుకు వ్యాపారంగా మారింది?
జవాబు: విద్యపై ప్రజల డిమాండ్ పెరిగింది. కానీ ఆ డిమాండ్‌ను ప్రభుత్వ విద్యా వ్యవస్థ అందుకోలేకపోయింది. ఈ ఖాలీని ప్రైవేట్ విద్యా సంస్థలు భర్తీ చేశాయి. ఫలితంగా విద్య ఒక హక్కు నుంచి ఒక వస్తువుగా మారింది. విచిత్రం ఏంటంటే చట్టాలు చేసేవాళ్లకే స్కూళ్లు ఉన్నాయి. ప్రైవేటు కాలేజీలు స్కూళ్లు పెట్టినవాళ్లు రాజకీయ నాయకులుగాను రాజకీయాలలోకి వచ్చి కాలేజీలు పెట్టారు. పెడుతున్నారు. నాణ్యమైన ఉచిత విద్యను ప్రభుత్వం అందించగలిగితే విద్య వ్యాపారీకరణ చాలా వరకు తగ్గుతుంది.
ప్రశ్న: ఉపాధ్యాయులపై బోధనేతర పనుల ప్రభావం?
జవాబు: చాలా ప్రభావం చూపుతుంది.టీచింగ్ కాకుండా చాలా పనులు అప్పజెప్పారు. వాళ్ల నుంచి బోధించే హక్కునే లాక్కుంటున్నాం. యూనిసెఫ్ అధ్యయనం ప్రకారం, టీచర్లు తమ సమయంలో 30% బోధనేతర పనులకే వెచ్చిస్తున్నారు. టీచర్లకు ఉండాల్సిన స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తి మన దగ్గర లేదు. ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత బోధన. కానీ అనేక పరిపాలనా పనులు వారిపై మోపబడుతున్నాయి. దీని వల్ల బోధనకు కేటాయించాల్సిన సమయం తగ్గిపోతోంది. ఉపాధ్యాయులను పరిపాలనా యంత్రాంగంలో చివరి మెట్టుగా కాకుండా విద్యా వ్యవస్థకు కేంద్రంగా చూడాలి.ఉపాధ్యాయులే కాదు విద్యా శాఖ లో నాణ్యమైన విద్యను పర్యవేక్షించే అధికారులు అందరూ అది తప్ప అన్నీ పనులు చేస్తుంటారు. ఇది మారాలి.
ప్రశ్న: ఒక గ్రామానికి బడి ఎందుకు అవసరం? గ్రామ సామాజిక అభివృద్ధిలో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది?
జవాబు: పాఠశాల అనేది కేవలం చదువు చెప్పే స్థలం కాదు; అది ఒక సామాజిక సంస్థ. సామజిక న్యాయం వైపు అడుగు పడే అతి ముఖ్యమైన వ్యవస్థ. ఒక బడికెళ్లని బాలుడు “కిష్టి గాడు ” నుంచి బడికెళ్లిన మరుక్షణమే “కృష్ణ”గా మారిన కథ నాకు గుర్తుంది. అదే విద్య కలిగించే గౌరవం. పాఠశాల పిల్లలకు జ్ఞానం మాత్రమే కాదు, గుర్తింపు, ఆత్మగౌరవం, భవిష్యత్తుపై ఆశను కూడా ఇస్తుంది. అందుకే బడి నిర్వచనం మారాలి. నా అనుభవం లో లక్షాలది బాలలు తరతరాలుగా అణిచివేత,వివక్ష,వెనుకబాటుతనాన్ని ఛేదించిన శక్తి విద్య. ఈ కుటుంబాలు ఇది సాద్యమే నిరూపించారు.
ప్రశ్న: మీరు ఇటీవల అర్బన్ స్కూల్స్ మీద అధ్యయనం చేస్తున్నారు. అసలు సమస్యలు ఏంటి, వాటిని ఎలా చూడాలి?
జవాబు: పట్టణ విద్యకు తగిన ప్రాధాన్యం దక్కలేదు.పట్టణ జనాభా పెరిగింది. ఈ నగరాన్ని నడిపేది లక్షలాది కార్మికులు. కానీ వారి పిల్లల విద్య గురించి తగినంతగా ఆలోచించడం లేదు. ప్రభుత్వ పాఠశాలలు పెరగలేదు. దాంతో లక్షలాది కుటుంబాలు తప్పనిసరిగా ప్రైవేట్ పాఠశాలలపై ఆధారపడుతున్నాయి. పట్టణ విద్యను ఒక మౌలిక ప్రజా సేవగా గుర్తించాల్సిన అవసరం ఉంది.
ప్రశ్న: క్యూర్ రీజియన్ లో ప్రతి డివిజన్‌కు స్కూల్ ఉండాలన్న మీ ఆలోచన గురించి చెప్పండి.
జవాబు: హైదరాబాద్ లో ఇప్పుడు క్యూర్ అని పిలుస్తున్న ఏరియా లో డివిజన్‌ను ఒక యూనిట్‌గా తీసుకుని ప్లానింగ్ చేయాలి. జనాభా ప్రాతిపదికన ప్రతి డివిజన్‌కు ఒక మంచి స్కూల్ కట్టాలి. స్థలం లేదు, ఖర్చు ఎక్కువ అని చెప్పడానికి వీలు లేదు. పిల్లల భవిష్యత్తు కంటే ఖరీదైనది ఏముంది? పెద్ద పెద్ద కంపెనీలకు స్థలం ఇస్తున్నప్పుడు, స్కూళ్లకు ఇవ్వలేమా? పట్టణ విద్యను ప్రజా మౌలిక వసతిగా గుర్తిస్తే ఇది సాధ్యమే. తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యా సాధనకు సన్నద్దమౌతున్నారు.
ప్రశ్న: అర్బన్ ప్రాంతాల్లో స్కూళ్ల భూమిని రియల్ ఎస్టేట్ కోసం వాడుకునే అవకాశం ఉందా?
జవాబు: అంత లోతుగా నేను స్టడీ చేయలేదు. కానీ భూమి చాలా విలువైనదని మాత్రం నిజం. ప్రభుత్వ భూమిని ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వ హాస్పిటల్స్ కు కేటాయించాలనే చట్టం రావాలి.
ప్రశ్న: ఫీజుల భారం గురించి?
జవాబు: జూన్ వస్తే ఇళ్లల్లో పెద్ద టెన్షన్. ఇది పేద వర్గాలలోనే కాదు ఎగువ మధ్య తరగతి కుటుంబాలలో కూడా ఇదే పరిస్తితి. ప్రస్తుతం విద్య కుటుంబాలపై భారీ ఆర్థిక భారం మోపుతోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలు పిల్లల చదువు కోసం అప్పులు చేయడం, త్యాగాలు చేయడం చూస్తున్నాం. ఇది విద్యపై ఉన్న డిమాండ్‌ను చూపిస్తుంది. ఆ డిమాండ్‌కు ప్రభుత్వం నాణ్యమైన ఉచిత విద్యతో స్పందించాలి.
ప్రశ్న: బడ్జెట్ కేటాయింపు గురించి మీ అభిప్రాయం?
జవాబు: ప్రభుత్వాలు 18-20% బడ్జెట్ విద్యకు కేటాయించాల్సిందే. విద్యపై పెట్టుబడి ఖర్చు కాదు; భవిష్యత్తుపై పెట్టుబడి. “డబ్బులు ఉన్నాయా” అని అడగాల్సిన అవసరమే లేదు. సమాన అవకాశాల గురించి మాట్లాడాలంటే ముందుగా నాణ్యమైన ప్రభుత్వ విద్యలో పెట్టుబడి పెట్టాలి.
ప్రశ్న: చివరగా, అందరికీ సమానమైన నాణ్యమైన విద్య అందాలంటే?
జవాబు: కొఠారి కమిషన్ సూచించిన కామన్ స్కూల్ సిస్టమ్ ఇప్పటికీ అత్యంత ప్రాసంగికమైన ఆలోచన.ఒక ప్రాంతంలోని ధనిక, పేద పిల్లలందరూ అదే పాఠశాలలో చదివే నైబర్‌హుడ్ స్కూల్ విధానం సామాజిక న్యాయానికి పునాది. పిల్లలందరికి నాణ్యమైన ప్రభుత్వ పాఠశాల అందుబాటులో ఉండాలి. గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో సమాన విద్యా అవకాశాలు కల్పించాలి. అదే సమాన అవకాశాలకు, ప్రజాస్వామ్యానికి, మంచి సమాజ నిర్మాణానికి మార్గం. అదే రాజ్యాంగం చూపించిన దారి. అదే ప్రజాస్వామ్య సమాజానికి పునాది.
(3tv జర్నలిస్ట్ తిరుపతి మరియు 3tv వీడియో చానల్ సౌజన్యం తో)


– 


