ఇదీ ఒక వివక్షా రూపమే? చావు-డప్పు!?

“అసలు ఎవరైనా చావు ఎందుకు కోరుకుంటారు.చావు కోరుకునేవారు మానసిక రోగైనాకావాలి, జీవితం మీద విరక్తి అయినా చెందాలి.లేదా కక్ష్య, కార్పణ్యాలు ఉన్నవారే!వాటిని కోరుకుంటారు.వారసులైతే ఆస్తిపాస్తులు పోతే ఆస్తి తమకే దక్కుతుందని కోరుకుంటారు.మరి రాజకీయ నాయకులైతే! తమ అధికారానికి అడ్డం, నిలువు అని భావించినప్పుడే చావు కోరుకుంటారు. నిరాశా,నిస్పృహలు కూరుకుపోయిన వారే అలా భావిస్తారు.రెండేళ్ళ కాలపరిమితి కాసుకొని ఉండగానే చావు డప్పు మోగించడం వెనుక రహస్యం ఏమిటి? చేతులు ఎత్తేసినట్లా? చేదు నిజం ఏమైనా చెబుతున్నట్టా? పాలకులే సెలవివ్వాలి..”

-ఎన్.తిర్మల్
(సీనియర్ జర్నలిస్టు, పొలిటికల్ ఎనలిస్టు)
సెల్:9441864514, email: thirmal.1960@gmail.com

చనిపోయిన తర్వాత గూడా మనిషికి విలువనిచ్చే మొట్ట మొదటి మనిషి ఎవరైనా ఉన్నారు అంటే వారు ఖచ్చితంగా దళితులే!? ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత అప్పటివరకు ప్రీతిపాత్రం అయిన బంధాలు,అనుబంధాలు అన్నీ తెగతెంపులు చేసుకొని శవాన్ని నేలపై పడుకోబెడతారు. వారసులు,పాలి వాళ్ళు తప్ప ఆ శవాన్ని అంటుకోవడం కూడా నిషిద్ధంగా బంధువులు,సన్నిహితులు భావిస్తారు.ఒకవేళ  అంటుకున్నా కట్టుకున్న బట్టలు బయట వదిలి తలంటు మైల స్నానం చేసి గాని ఇంటిలోపలకు వెళ్ళరు. కానీ,మనిషి చనిపోయిన తర్వాత శవాన్ని కూడా గౌరవించి,తలపంచలో పుల్లలు పేర్చి కొరివి(నిప్పు)రాజేయడం,పాడె కట్టడం,శవం ఊరేగింపు లో డప్పు కొట్టడం,చితి పేర్చడం,శవాన్ని బూడిద అయ్యేవరకు కాల్చడం ఇది అనాదిగా దళితులు చేస్తున్న ఓ సాంప్రదాయిక పని!

పశువులు చనిపోయినప్పుడు వాసన వేస్తున్నా,ఊరి బయటకు తీసుకెళ్లి తోలు తీయడం,తంగేడురొట్టతో ఊరవేయడం, ఎండిన చర్మాన్ని సాపు చేయడం, అవసరం అయిన తోలు పనిముట్లు నగిషీ గా చేయడం,కాళ్ళు కందకుండా చెప్పులు కుట్టడం రెండవ ముఖ్యమైన పని.అందుకే వీరిని అంటరాని వారిగా అగ్రవర్ణాలు వెలివాడలో ఉంచారు.వివక్ష ప్రదర్శించారు.ద్వితీయ జాతి పౌరులుగా భావించారు.శుద్ది చేయడానికి సాయం చేసిన వారికి సనాతన సమాజం ఇచ్చిన బహుమతి ఇది? ఇంటివాన్ని పారేసిన,పసుపు నీళ్ళతో ప్రక్షాళన చేసుకోవడం,కర్మ కాండలు జరుపుకోవడం రక్త సంబంధీకులైన పాలివాళ్ళ పని !!చచ్చిన వారిని సైతం గౌరవంగా సాగనంపే చావు డప్పు అనేది ఇలా జన్మ పొందింది..

డప్పు అనేది ఆది సంగీత రూపం.ఒక్క చావుకే కాదు, ఒకప్పుడు పెళ్ళికి,పేరంటానికి,గ్రామదేవతల ఆరాధనకు డప్పునే ప్రధాన వాయిద్య రూపం.డప్పు కొడితే గాలి,ధూళి శుభ్రం అవుతాయని పూర్వీకుల నమ్మకం.ఇంత విశిష్ట చరిత్ర ఉన్న డప్పును ఆధునిక కాలంలో అన్ని రకాల వివక్ష లో భాగంగానే ఆది జాంబవ వాయిద్యమైన డప్పుకు చావును జోడించి చావుడప్పుగా మార్చారు.దానికి తాజాగా రాజకీయ నాయకులు సరికొత్త పునర్జన్మ అందించారు.తమచేతులకు రాజకీయ మైల అంటకుండా ఎదుటి వారిపై దళిత కార్డును వాడి సరికొత్త చావు డప్పు క్రీడను ఆడించడం.ఇదికదా!తరతరాల సనాతన దరిద్రాన్ని ఇంకా దళితుల నెత్తికెత్తి తాము రాజకీయ పవిత్రత పొందడం .ఇది కూడా అగ్రవర్ణ రాజకీయ క్రీడేకదా!?. దళితులను ఈ చావుడబ్బు క్రీడలో భాగస్వాములు చేయడం కొత్త ప్రయోగం ఏమీకాదు.. పాతదే! గ్రామ రాజకీయాల్లో ఉన్నదే,పీకలదాకా తాగించి తమ ప్రత్యార్థిని తిట్టించి, వారే మన్నా అంటే  కేసులు పెట్టించి ఆడుకోవడం.ఇదో ఉన్నత వర్గాల రాజకీయ క్రీడ గా మారింది.ద్వారా యస్సీ యస్టీ చట్టం అపహాస్యంగా మారింది.తెలివి పొందిన అణగారిన వర్గాలకు ఈ కేసులు,పోలీసులు ఉపయోగపడడం తప్ప!పేదలకు , నిజమైన కులం వివక్ష ఎదుర్కొంటున్న వాళ్ళకు ఈ చట్టం ఏనాడు ఏ మాత్రం ఉపయోగపడలేదు.

బరితెగించి తెలంగాణా రాష్ట్రం లో” చావు” తెలివి” అనేది ఒకటి ఈ మధ్య ప్రచారంలోనికి వచ్చింది.పెడితే పెండ్లి కోరడం, కాదంటే చావు కోరడం రాజకీయ పక్షాలకు ప్రస్తుతం వెన్నతో పెట్టిన విద్య నే.ఒకరినొకరు తిట్టుకోవడం,కొట్టుకోవడం  కేసులు,జైళ్ళు ఇవన్నీ రాజకీయ ఎత్తుపల్లాలే.. వికారం,వాంతులు తెప్పించే పనులు ఈ మధ్య రాజకీయాల్లో మౌనంగా ఎన్నోచూస్తాం.కానీ,బ్రతికున్న వ్యక్తులను “చావండి” అనడం సరికొత్త ప్రయోగం.పైగా అదో రాజకీయ క్రీడ.ఇది తెలంగాణా రాష్ట్రం లోనే కొత్తగా పురుషుడు పోసుకుంది.ఒకరకంగా ఇది జీవించే హక్కు, ఆర్టికల్ 21 కు విరుద్దం అయిన మాట!ఈమాట ఎవరన్నా రాజ్యాంగ బద్దంగా చర్యలు తీసుకోవాలసి ఉంది.కేసుపెట్టాలసిఉంది.కానీ, తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నే సాక్ష్యాత్తు ఆ మాట అంటే! నోరెళ్ళ బెట్టి చూడడం తప్ప ఎవరూ హక్కుల గురించి మాట్లాడ లేరు, గుర్తు చేయనూ లేరు. .సరిగదా సరికొత్త రాజకీయ వ్యవహారం అనుకొని సంకలు గుద్దుకున్న వాళ్ళు లేకపోలేదు.ముఖ్యమంత్రి ఆమాట అన్నదెవరినోకాదు?పదేళ్ళు తెలంగాణా రాష్ట్రం కు ముఖ్యమంత్రి గా చేసిన ప్రస్థుత ప్రతిపక్ష నేత కేసీఆర్ నే! ఆవు చేలో మేస్తే దూడగట్టున ఎలా మేస్తుంది? ఆయన బాటలోనే నడిచి  మరో శాసన సభ్యుడు వీరెల్లి శంకర్ కేసీఆర్ నూటికి నూరు శాతం చచ్చి పోవాల్సిందే!నని చావు డప్పు పిలుపులో భాగం అయ్యారు.

కేసీఆర్ ఫాంహౌస్ ముందు చావు డప్పులు మోగించారు.అందులో దళితులున్నారా?మరెవ్వరు న్నారు,అనే విషయం ప్రక్కన పెడితే.. ఇది ఫక్తు రాజకీయ ప్రేరేపిత చర్య!! ఇక బిఆర్యస్ కార్యకర్తలు కొందరు చావు డప్పు మోగిన చోట పసుపు నీళ్ళు చల్లించారు.ఇదికూడా రాజకీయ ప్రేరేపిత ప్రతిచర్యనే!పసుపు నీళ్ళు కూడా తప్పుదారిన పట్టిన శాస్త్రీయ అంశమే! పశుపు నీళ్ళు చల్లడం అనేది దళితుల కోసం కాదు.. మనిషి చనిపోయినప్పుడు శవం ఉంచిన ప్రాంతంలో వైరస్లు,ఫంగస్ లు వ్యాప్తి చెందకుండా చేసే పురాతన వైజ్ఞానిక ప్రక్రియ! పసుపు ప్రకృతి సిద్ధమైన యాంటిబయోటిక్ ! పసుపు శుద్దికేకాదు,బుద్ధికి సాంకేతిక చిహ్నం.సనాతనధర్మం అనేది అంటరాని తనానికి జోడించిన ఓ వికారచేష్ఠ! బ్రతికున్న వారింట డప్పు మోత మంగళవాయిద్యమే!దానికి పసుపు నీళ్ళు చల్లడం దేనికో అర్థంకాదు? రాజకీయాల్లో దిగజారుడు తనం మరీ ఇంత జానా,బెత్తెలా ఉంటుందా? అన్నఅనుమానం కలుకగుతుంది.ఇంతహేయంగా,నగ్నంగా రాజకీయం ఉంటుందా? అనిపిస్తుంది.తరతరాలుగా మోసానికి గురి అయిన అణగారిన వర్గాలను అదే వరవడిలో వాడుకోవడం,మోసగించడం,తప్పుదారి పట్టించడమే!

నేటి డప్పు శబ్దం!చావు డప్పు.. .దళితులను ఏమార్చి రాజకీయాలకు పావులు గా వినియోగించుకునే విష ప్రయోగం! రూపు మారిందే కానీ,నీతి,రీతి మారలేదు.అసలు ఎవరైనా చావు ఎందుకు కోరుకుంటారు.చావు కోరుకునేవారు మానసిక రోగైనాకావాలి, జీవితం మీద విరక్తి అయినా చెందాలి.లేదా కక్ష్య, కార్పణ్యాలు ఉన్నవారే!వాటిని కోరుకుంటారు.వారసులైతే ఆస్తిపాస్తులు పోతే ఆస్తి తమకే దక్కుతుందని కోరుకుంటారు.మరి రాజకీయ నాయకులైతే! తమ అధికారానికి అడ్డం, నిలువు అని భావించినప్పుడే చావు కోరుకుంటారు. నిరాశా,నిస్పృహలు కూరుకుపోయిన వారే అలా భావిస్తారు.రెండేళ్ళ కాలపరిమితి కాసుకొని ఉండగానే చావు డప్పు మోగించడం వెనుక రహస్యం ఏమిటి? చేతులు ఎత్తేసినట్లా? చేదు నిజం ఏమైనా చెబుతున్నట్టా? పాలకులే సెలవివ్వాలి.ప్రజలకు సమాధానం చెప్పుకోలేని ఒకానొక సంకట స్థితినుండి,అదికారపు ఆలోచనల్లో చుట్టూ మోలుస్తున్న అహంకారపు విషపు ముళ్ళే.. ఈ చావుడప్పు..! ఒకరకంగా దళిత వర్గాలను రాజకీయ క్రీడకు వినియోగించడం కూడా మరోరకమైన వివక్షా రూపమే!ఇది కాదనలేని సామాజిక సత్యం.దళితులను రాజులను చేస్తామన్న వాగ్దానం గాలికి పోయింది. ,ఊరూరా,వాడవాడలా బెల్టుషాపులు పెట్టడం,చంకకు చావుడప్పు తగిలించి రాజకీయ సిందులకు సిద్ధం కావడం తప్పు.వోట్ల కోసం,సీట్ల కోసం , రాజకీయ మనుగడ కోసం ఇలా దళిత క్రీడలు ఆడడం ఎప్పుడు మానతారో ఏమో! ఉన్నత చదువుల్లో తప్ప దళితుల ఆత్మగౌరవం నిలబడే చైతన్య మార్గం మరొకటి లేనేలేదు?

ఏదిఏమైనా దళితులను ఆటలో పావులుగా వాడుకునే విధానం పోవాలని కోరుకుందాం.దళితులను మెట్టుగా చేసుకునే రాజకీయ వైకుంఠ పాళీ వదిలేద్దాం.దళిత వర్గాలు కూడా తమకు తరతరాలుగా బానిస చేస్తున్న చావు డప్పు వదిలి.వివక్షరూపం అయివస్తున్న ఆధునిక రాజకీయ ముఖం పై తూ అని ఊసి,చెప్పుతో రాజకీయ చెక్కిలిని చెళ్ళుమనిపించాలి.ఇదికదా ఆధునిక కాలంలో కావలసిన తిరుగుబాటు డప్పు!? వ్యవస్థ వివక్షా రూపం పై మోగించాలసిన  “చావు”డప్ప!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *