నరేందర్‌రెడ్డి అరెస్టుపై ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 20 (ఆర్‌ఎన్‌ఎ): లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రిమాండ్ ఆర్డర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు వాదనలు విని.. తీర్పును రిజర్వ్ చేసింది. నరేందర్‌రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా అరెస్టు తీరును తప్పుబట్టింది. కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఎందుకు అరెస్టు చేశారు? మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాది మాదిరిగా ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సి వొచ్చిందని ప్రశ్నించింది. నరేందర్‌రెడ్డి ఏమైనా పరారీలో ఉన్నారా? అని పీపీపై ప్రశ్నల వర్షం కురిపించింది. దాడికి గురైన అధికారుల గాయాలపై సరిగ్గా నివేదించలేదని.. తీవ్ర గాయాలపై రిపోర్టు ఇచ్చి.. చిన్న గాయాలైనట్లుగా రాశారని పేర్కొంది. నరేందర్‌రెడ్డి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ప్రజలను రెచ్చగొట్టేలా నరేందర్‌రెడ్డి మాట్లాడారని పీపీ ధర్మాసనానికి తెలిపారు.
ఈ దశలో పిటిషన్‌ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావంపై ప్రభావం చూపుతుందని.. రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలన్న పిటిషన్‌ను కొట్టివేయాలని పీపీ కోర్టును కోరారు. కాగా, వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, పోలేపల్లిలో 1350 ఎకరాల్లో మొదట ఫార్మా సిటీ పెట్టాలని భావించిన ప్రభుత్వం ఆ తర్వాత.. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం గ్రామసభ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయణ సేకరణ చేపట్టారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్‌పై దాడికి పాల్పడ్డారంటూ పలువురు రైతులతో పాటు బీఆర్‌ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో పట్నం నరేందర్‌రెడ్డి ప్రమేయం ఉందంటూ ఆయనను పోలీసులు హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. తన రిమాండ్‌ని సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.