సమస్యల పట్టింపు లేని మోదీ పాలన
ద్రవ్యోల్బణం అదుపులోకి వొచ్చిందన్న మాటలు శుద్ధ అబద్దం…
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి…
నిరుద్యోగం ఎందుకు తాండవిస్తోంది…
పదేళ్లుగా మోదీ నేతృత్వంలోని బిజెపి పాలన వికసిత భారత్ లక్ష్యంగా సాగుతోందని బిజెపి శ్రేణులు పదేపదే ప్రచారం చేస్తున్నారు. గత పదేళ్లలో క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడంలో బిజెపి నేతలు విఫలం అవుతూనే ఉన్నారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో వారికి పట్టింపు లేదు. తాము చెప్పిందే వేదం అన్న రీతిలో పాలన సాగిస్తున్నారు. నిజానికి వికసిత భారత్ లక్ష్యం అయివుంటే ద్రవ్యోల్బణం ఎందుకు దాడి చేస్తోంది. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి. నిరుద్యోగం ఎందుకు తాండవిస్తోంది. వీటన్నిటికి పరిష్కారం చూపడంలో మోదీ విఫలం అయ్యారనే చెప్పాలి. సామాజిక రుగ్మతగా మారిన వ్యవస్థీకృత అసమానతలను రూపుమాపలేక పోతున్నాం. గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థలో అనేక గుణాత్మక మార్పులు వొచ్చాయని చంకలు గుద్దుకోవడంతో సరిపోదు. పీఎం ఫసల్ బీమా యోజన కింద నాలుగు కోట్ల మంది రైతులకు పంట బీమా సాయం అందుతోందని చెప్పారు. నిజానికి దేశంలో ఎక్కడ ఎలాంటి పంటలు పండుతున్నాయి. వాటికి ఎంత ఖర్చవుతుంది. రైతులు ఏం కోరుకుంటున్నారన్న చర్చ చేయడం లేదు. వ్యవసాయ చట్టాలు ఎత్తేశాక వాటి గురించి చర్చించడం లేదు. పన్ను వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ట్యాక్స్ చెల్లింపుదారుల సంఖ్య పెరిగింది.
ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల పొదుపులు, పెట్టుబడులకు భద్రత ఏర్పడిరదం టున్నారు. నిజానికి ఇదొక్కటే దేశాన్ని, ప్రజలను అగాధంలోకి నెట్టుతోందని ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చిందన్న మాటలు శుద్ద అబద్దం. ఆర్థిక వ్యవస్థ బలోపేతమై ప్రజలకు ఉపాధి లభించేలా ప్రజా ప్రయోజనాల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు రూపొందించాల్సి ఉంది. బ్యాంకులను సంస్కరిం చాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పాలన జరిగిందన్న విషయంలో అబద్దాలను అందంగా చెప్పారు. 2014కు ముందు దేశం అనేక సవాళ్లను ఎదుర్కొందన్న మోదీ… ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయని చెప్పడం మోసం చేయడం తప్ప మరోటి కాదు. గత 20 ఏళ్ల కాలానికి పోలిస్తే దేశంలో అభివృద్ది అన్నది ఎండమావి అన్న విమర్శలు ఉన్నాయి. కార్పోరేట్లకే బిజెపి అనుకూలం అన్న ప్రచారం కూడా బలంగా ఉంది. పేదల అభివృద్ధే దేశ అభివృద్ధి. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందంటే వారు బాగుపడ్డ దాఖలాలు కనబడాలి. 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్‌తో ఆహార సమస్య తీరిందని పేర్కొనడంతోనే దేశం ఏ మేరకు అభివృద్ది చెందిందో అర్థం చేసుకోవచ్చు. గ్రావిరీణ ప్రజల ఆర్థిక వికాసం సాధ్యం అవుతోందని చెప్పకుండా ఉంటే బాగుండేది.
కోట్లాది మంది రైతులకు నేరుగా నగదు బదిలీ చేస్తున్నామంటేనే వారికి తగిన గిట్టుబాటు ధరలు, వ్యవసాయ పనిముట్లు అందడం లేదని అర్థం చేసుకోవాలి. ఇన్ని సమస్యలను చర్చించకుండా అంతా బాగుందని చెప్పడం ద్వారా భారత్ వెలిగిపోతోందని అంటే నమ్మడానికి ప్రజలు సిద్దంగా లేరని గుర్తించాలి. సామాన్యులు బతకడమెలా అన్నది ఆలోచించడం లేదు. సామాన్యుడు తనకుతానుగా బతక గలిగినప్పుడే నిజమైన అభివృద్దికి గీటురాయిగా చూడాలి. వచ్చే ఐదేళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించబోతుందని మోదీ సహా నేతలంతా పేర్కొనడం చూస్తే..దేశం మరో ఐదేళ్లపాటు వేచి చూడాలన్న మాట. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడ మే లక్ష్యంగా పనిచేస్తున్నా మంటున్నారు. అప్పటికి వందేళ్ల స్వాతంత్య్ర భారతం అవుతుంది. గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం అని మోదీ చెప్పారు. అలాగే 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నా మని చెప్పారు. నిజానికి అభివృద్ది జరిగివుంటే ఈ దుస్థితి ఎందుకని ప్రశ్నించుకోవాలి. ప్రజలు తిండిగింజల ను కొనుక్కునే పరిస్థితిలో లేరని చెప్పకనే చెప్పారు. పేద మధ్య తరగతి ప్రజలకు సొంతింటికల ఎండమావిగా మారింది. పేదలు, మహిళలు, యువకులు, రైతులపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పడమే తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదు.
అంతెందుకు జిఎస్టీ అన్నది ప్రజల రక్తామాంసాలను పీల్చి పిప్పి చేస్తోంది. జిఎస్టీ వసూళ్లు నెలకు లక్షా 60 వేల కోట్ల వసూళ్లను చూసి అభివృద్ది అనుకుంటున్నారు. కానీ అదంతా ప్రజలను జలగల్లా పీల్చి వసూలు చేస్తున్న డబ్బుగా చూడడం లేదు. ప్రజలు స్వచ్చందంగా పన్నులు కట్టలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత చేపట్టిన సంస్కరణలు ఫలితాలిస్తాయని ఆశించారు. దేశ ప్రజలు భవిష్యత్‌పై ఆశతో ఉన్నారు. పేదలకు ఉచిత రేషన్ ఇస్తున్నామంటేనే..ప్రజల కొనుగోలు శక్తి లేకుండా పోయిందని గుర్తించడం లేదు. రైతులకు కనీస మద్దతు ధరలు అన్నవి రావడం లేదు. కానీ బియ్యం, ఉప్పు,పప్పుల ధరలు మాత్రం ఏటికేడు ఆకాశాన్ని అంటుతున్నాయి. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం అని వివరించడం అందంగా మోసగించడం తప్ప మరోటి కాదు. దేశంలో ఎన్నో సమస్యలు పరిష్కరించడం వేరు..కానీ పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వం అండలేకుండానే జీవించగలగాలి. కానీ ఈ పదేళ్లలో అలాంటి అవకాశాలు లేకుండా చేశాయి. సామాన్యులు ఇల్లు కొనుక్కునే పరిస్థితి లేదు. బ్యాంక్ వడ్డీ రేట్లు దారుణంగా ఉన్నాయి. భూములు, సిమెంట్, స్టీలు ధరలను అడ్డం పెట్టుకుని బిల్డర్లు దోపిడీ చేస్తున్నారు. అందమైన ఏసీ గదుల్లో కూర్చుని ఆలోచిస్తే ఎన్నటికీ అంటే 2047 నాటికి కూడా ప్రజల బతుకులు బాగుపడవని గుర్తించాలి.
-ముప్పిడి సత్యం