భూమిని నమ్ముకున్నపేద‌ల‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

ధరణి పోర్టల్‌తో సమస్యలు మరింత తీవ్రత‌రం
వీలైనంత త్వ‌ర‌గా అమలులోకి భూ భార‌తి
రెవెన్యూ ,హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 19 :  వీలైనంత త్వ‌ర‌గా భూభార‌తి చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకొస్తామ‌ని రెవెన్యూ ,హౌసింగ్ ,స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. క్షుణ్ణంగా, స‌మ‌గ్రంగా ప‌రిశీలించి చిన్న చిన్న పొర‌పాట్ల‌కు తావులేకుండా డ్రాఫ్ట్ భూభార‌తి విధివిధానాల‌ను త‌యారు చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. భూభారతి చట్టానికి సంబంధించి విధివిధానాల రూపొందించడంపై ఎంసీహెచ్ఆర్‌డిలో క‌లెక్ట‌ర్లు , ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న వర్క్‌షాప్ లో రెండో రోజు బుధ‌వారం మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. భూమి మనిషి జీవనాధారం. అది కేవలం ఆస్తి మాత్రమే కాదు, రైతుల ఉపాధి, జీవితానికే పునాది అని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అన్నారు.

తెలంగాణలో భూమికి సంబంధించి అనేక సమస్యలు వున్నా, గత ప్రభుత్వ‌ నిర్వాకం వల్ల వాటికి సరైన పరిష్కారం దొరకలేదు. గతంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. రైతులు తమ భూములను కోల్పోవాల్సి వొచ్చింది. తొందరపాటు నిర్ణయాలతో రెవెన్యూ వ్యవస్థను భ్ర‌ష్టు పట్టించింది. సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేసింది. ఈ పరిస్థితికి పరిష్కారంగా, తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం రైతుల భూములకు భద్రత కల్పించడం తో పాటు, భూ రికార్డులను కచ్చితంగా పరిరక్షించడానికి రూపొందించబడింది.

సామాన్యులకు రెవెన్యూ సేవలు అందుబాటులోకి తేవడం , ప్రభుత్వ ఆస్తులు, భూములను పరిరక్షించడం ప్రధాన బాధ్యతగా తమ ప్రభుత్వం పనిచేస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. భూమిని నమ్ముకుని బతికే కష్టజీవులను ఈ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు రైతుకు భూమికి సంబంధించి ఏ కష్టం వచ్చినా రెవెన్యూ కార్యాలయాలలో పరిష్కారం లభించేలా విధి విధానాలను తయారు చేస్తామన్నారు స‌మావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్‌, భూ చ‌ట్టాల నిపుణుడు సునీల్‌, సిసిఎల్ఎ పీడీ , సిఎం ఆర్ వో మ‌క‌రంద్. సిసిఎల్ఎ స‌హాయ కార్య‌ద‌ర్శి ల‌చ్చిరెడ్డి, ప‌లు జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఇత‌ర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page