-ఆర్ అండ్ బి ఈఎన్‌సీ మోహన్ నాయక్ ఇంట్లో సాదాలు
-భారీగా బంగారం, నగదు, ఆస్తులు గుర్తించిన ఏసీబీ
-కిలో బంగారం, రూ.60 లక్షల నగదు స్వాధీనం
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్9: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో రోడ్లు మరియు భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) ఈఎన్‌సీ మోహన్ నాయక్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగాయి. మోహన్ నాయక్ ఈఎన్‌సీ హోదాలో ఉన్న సమయంలో వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో మొత్తం 11 చోట్ల ఏకకాలంలో దాడులు చేపట్టారు. మియాపూర్ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న విల్లా నంబర్-98లో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. భద్రతా కారణాల దృష్ట్యా అధికారుల అనుమతి లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించ లేదు. సోదాల సందర్భంగా పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, నగదు, బంగారు ఆభరణాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు మోహన్ నాయక్‌పై గతంలోనే పలు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కాంట్రాక్టర్లకు టెండర్లు కేటాయించే పక్రియలో అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. సోదాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి లెక్కలు, స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువపై అధికారిక వివరాలు వెల్లడించాల్సి ఉంది. సాయంత్రం వరకు ఈ తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సోదాలు పూర్తయిన అనంతరం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ వెల్లడించనున్నారు. మోహన్ నాయక్ ఇంటితోపాటు 15 ప్రాంతాల్లోని ఆయన బంధువుల నివాసాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. అతడి ఇంట్లో 20కి పైగా విదేశీ మద్యం సీసాలను గుర్తించారు. మంగళవారం ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయని, సోదాలు పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. మోహన్ నాయక్ ఇంట్లో చేపట్టిన తనిఖీల్లో రూ.60లక్షల నగదు గుర్తించినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. కిలో బంగారు నగలు, 13 బంగారు బిస్కెట్ల గుర్తించినట్లు తెలిపారు. హైదరాబాద్, నిజామాబాద్‌లో ఇళ్ల స్థలాల పత్రాలు గుర్తించామని తెలిపారు. మరోవైపు, మోహన్ నాయక్ కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు జరిపింది. ఎర్రమంజిల్‌లోని కార్యాలయంలో పలు ఫైళ్లను తనిఖీ చేస్తున్నారు. అక్కడి అధికారుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. అతడి ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




